మొబైల్ ఫోన్ల తయారీ కోసం టాస్క్‌ఫోర్స్
4 ఏళ్లలో 50 కోట్ల హ్యాండ్‌సెట్ల తయారీ లక్ష్యం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల తయారీ జోరు పెంచడానికి కేంద్రం ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2019 కల్లా 50 కోట్ల మొబైల్ ఫోన్లు భారత్‌లో తయారు చేయడం (వార్షిక ఉత్పత్తిని రూ.1,50,000 కోట్ల నుంచి రూ.3,00,000కోట్లకు పెంచడం) లక్ష్యంగా ఈ ఫాస్ట్‌ట్రాక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయి ఉత్పత్తి కారణంగా 15 లక్షల మందికి ఉద్యోగవకాశాలు వస్తాయని అంచనా.
ఇండియన్ సెల్యులర్ ఆసోసియేషన్(ఐసీఏ) నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ మోహింద్రూ ఈ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. శామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్ డివెసైస్, లావా, మైక్రోమ్యాక్స్, ఎల్‌జీ, సోనీ తదితర కంపెనీల ప్రతినిధులకు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో స్థానం కల్పించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డైటీ) డెరైక్టర్లు ఎస్‌కె. మార్వా, ఆశా నంగియాలు టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది భారత మొబైల్ మార్కెట్ 32 శాతం వృద్ధితో 1,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని, దీంట్లో దిగుమతుల వాటా మూడొంతులని అంచనా. నోకియా ప్లాంట్ మూసివేత కారణంగా దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ 29 శాతం క్షీణించింది.