టీసీఎస్‌ను బీట్ చేసిన బ్యాంకింగ్ దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న టెక్ దిగ్గజం టీసీఎస్‌ను, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధిగమించింది. మార్కెట్ విలువలో రెండో అత్యంత విలువైన కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అవతరించింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,73,530.72 కోట్లకు ఎగిసింది. ఇది టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే రూ.797.4 కోట్లు ఎక్కువ. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.4,72,733.32 కోట్లగా ఉంది.
బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 0.93 శాతం పైకి జంప్‌చేసి 52 వారాల గరిష్టంలో ట్రేడవుతున్నాయి. టీసీఎస్ కూడా 0.36 శాతం లాభాల్లో ట్రేడవుతున్నప్పటికీ, ఈ కంపెనీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్ దిగ్గజం అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు సుమారు 53 శాతం పైకి ఎగియగా.. టీసీఎస్ 5 శాతం మేర లాభపడింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5,33,818.72 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లున్నాయి.