
భలే బోనస్..కొంచెం బోగస్..!
- ఈ ఏడాది 21 కంపెనీల బోనస్ బొనాంజా
- వీటిలో చాలావరకూ టాప్ కంపెనీలే
- బోనస్ చూసి షేర్లు కొనొద్దంటున్న నిపుణులు
- ఏ కంపెనీకైనా ఫండమెంటల్సే ముఖ్యం
ఈసారి కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలేమీ అంత బాగులేవు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ముగిసిన ఆఖరి త్రైమాసికం ఫలితాలు ఆకర్షణీయంగా లేవంటూ అంతా వాపోతుండగా... పలు కంపెనీలు షేర్‌హోల్డర్లకు ఆకర్షణీయమైన బోనస్ షేర్లను ప్రకటించాయి. తద్వారా తమ దగ్గర నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చాటాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 21 కంపెనీలు బోనస్ ఇష్యూల్ని ప్రతిపాదించాయి. వాటిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ తదితర పెద్ద కార్పొరేట్లూ ఉన్నాయి.
అయితే ఇటీవల బోనస్ ఇష్యూల్ని ప్రకటించిన 21 కంపెనీల్లో 9 కంపెనీల లాభాల వృద్ధి 2015 మార్చి త్రైమాసికంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యింది. ఆయా కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నా, భవిష్యత్‌లో వ్యాపారం వృద్ధి చెందుతుందన్న భరోసాతో బోనస్ షేర్లను ప్రకటించాయి.
బోనస్ షేర్లు అంటే...
ఒక్క ముక్కలో చెప్పాలంటే... కంపెనీల వద్దనున్న మిగులు రిజర్వుల్ని (నగదుతో సహా) వాటాదార్లకు నగదు రూపంలో పంచకుండా షేర్ల రూపంలో పంచటమే!! ఇలా చేయటం వల్ల కంపెనీల ఈక్విటీ (మూలధనం) పెరుగుతుంది. అంటే నగదుతో సహా తమ దగ్గరున్న రిజర్వుల్ని మూలధనంగా మారుస్తాయన్న మాట. నిజానికి ఇది కంపెనీ ఖాతా పుస్తకాల్లో జరిగే మార్పే. అయితే మూలధనం పెరగడం వల్ల షేర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ప్రతి షేరుకూ వచ్చే రాబడి (ఈపీఎస్) తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినపుడు కంపెనీ సరైన వృద్ధి కనపరచటం లేదనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే భవిష్యత్తులో మరింత వృద్ధి కనబరుస్తామనే ధీమా ఉన్న సంస్థలే బోనస్ ప్రకటిస్తుంటాయి. అలా చేస్తేనేబోనస్ షేర్ల వల్ల ఇన్వెస్టర్లకు లాభం కూడా. భవిష్యత్ బాగుంటుం దని, వ్యాపారాన్ని మరింత విస్తరించే చాన్స్ వుందన్న విశ్వాసం ఆ కంపెనీ యాజమాన్యానికి ఉందనే సంకేతం బోనస్ ఇష్యూ ద్వారా వెలువడుతుంది.
ఇన్వెస్టర్లకూ ఇదో అవకాశమే...
అధిక ధరలో షేర్లు కొనలేని ఇన్వెస్టర్లకు బోనస్ ఇష్యూ ఒక అవకాశం. ఎందుకంటే బోనస్ షేర్లు జారీ అయ్యాక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఆ షేరు ధర బోనస్ నిష్పత్తి ప్రకారం తగ్గుతుంది. ఉదాహరణకు ఇన్ఫోసిస్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్ జారీకి నిర్ణయించిన రికార్డు తేదీ నాటికి ఆ కంపెనీ షేర్లు ఎవరి దగ్గర ఉంటాయో వారికి బోనస్ షేర్లు లభిస్తాయి. నిర్ణీత తేదీ తర్వాత ఆ షేరు ధర కూడా సగానికి తగ్గిపోతుంది. దాంతో ఇన్ఫోసిస్ షేరును రూ.2000కు బదు లు రూ.1000 ధరతో కొనవచ్చు. కానీ బోనస్ ఇష్యూ తర్వాత కంపెనీ షేరు పుస్తక విలువ, ఈపీఎస్ తదితరాలు కూడా సగమైపోతాయన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అంటే షేరు ధర తగ్గినంత మాత్రాన, కంపెనీ ఫండమెంటల్స్‌తో పోలిస్తే షేరు చౌక అయినట్లు కాదు.
షేర్లు కొనొచ్చా
బోనస్ ఇస్తామన్న కంపెనీల షేర్లను కొనడానికి రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉత్సాహపడతారు. కానీ బోనస్ ఇచ్చినంత మాత్రాన ప్రతి కంపెనీ షేరును కొనడం సరికాదని, ఆయా కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు వ్యాపారాన్ని అవగాహన చేసుకునే కొనడం మంచిదనేది విశ్లేషకుల సూచన. ప్రముఖ ఫైనాన్షియల్ మేగజైన్ వెల్లడించిన సర్వే ప్రకారం 2001-2010 మధ్యకాలంలో బోనస్ ప్రకటించిన టాప్ 30 కంపెనీల్లో 24 కంపెనీల షేర్లు రికార్డు తేదీ తర్వాత ఏడాదికాలంలో ర్యాలీ జరిపాయి. ఆ సర్వే ప్రకారం అప్పట్లో బోనస్ ప్రకటించిన కంపెనీల్లో టీసీఎస్, ఎల్ అండ్ టీ, ర్యాన్‌బాక్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రికార్డు తేదీ తర్వాత ఏడాది కాలంలో 82 శాతం వరకూ పెరిగాయి. అదే సమయంలో స్టెరిటైల్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సీమెన్స్ షేర్లు బోనస్ జారీ తర్వాత ఏడాది కాలంలో 16-72% మధ్య నష్టపోయాయి. చాలావరకూ ఆరోగ్యకరమైన కంపెనీలే బోనస్ షేర్లను జారీచేస్తాయని, అందువల్ల అవి పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు అంటుం టారు. కానీ రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వృద్ధి అవకాశం లేని కంపెనీలు కూడా బోనస్‌లను ప్రకటిస్తాయని, వాటి పట్ల ఆప్రమత్తంగా వుండాలన్నది వారి హెచ్చరిక.
షేరు ధర పెరుగుతుందా..
కంపెనీ రిజర్వుల్ని మూలధనంగా మార్చి బోనస్ ఇచ్చినంత మాత్రాన షేరు ధర పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఏప్రిల్ 24న బోనస్ ప్రకటించింది. తరవాత రెండ్రోజుల్లో 10 శాతంపైగా పతనమైంది. ఆ ప్రకటనకు ముందునాటి ధర రూ. 2,150తో పోలిస్తే ఇప్పటికీ దాని ధర 5 శాతం తక్కు వే ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా పలు బోనస్ ఇష్యూల్ని ఇన్ఫోసిస్ ప్రకటించింది. అటు తర్వాత కొద్ది త్రైమాసికాలకు ఆ షేరు పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుదలకు అనుగుణంగానే కంపెనీ లాభాలు ఎప్పటికప్పుడు వృద్ధి చెందడం ఇందుకు కారణం. అదే కోటక్ బ్యాంక్ మే 5న బోనస్ ప్రతిపాదించాక వెనువెంటనే 8% ర్యాలీ జరిపింది. మధ్యలో క్షీణించినా, ఇప్పటి ధర బోనస్ ప్రకటనకు ముందునాటి ధరతో పోలిస్తే 5 శాతం ఎక్కువగానే వుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ 2009 అక్టోబర్లో 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అప్పటి ధరతో పోలిస్తే ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ 25 శాతం తక్కువగానే వుంది. రిలయన్స్ గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కంపెనీ ఆశించిన ఫలితాల్ని ఇవ్వక ధర తగ్గిందనేది గమనించాలి.