లాభాల స్వీకరణకు చాన్స్ | to chance Profits received | Sakshi
Sakshi News home page

లాభాల స్వీకరణకు చాన్స్

Published Mon, Apr 28 2014 1:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

లాభాల స్వీకరణకు చాన్స్ - Sakshi

లాభాల స్వీకరణకు చాన్స్

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న బుల్ ధోరణి కారణంగా ప్రధాన ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. గడిచిన వారంలో ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 23,000 సమీపానికిరాగా, నిఫ్టీ 6,800ను అధిగమించింది. దీంతో గత శుక్రవారం ఇన్వెస్టర్లు కొంతమేర అమ్మకాలకు దిగారు. సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చన్న తాజా అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. ఈ అంశం సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిందని విశ్లేషకులు తెలిపారు. ఫలితంగా గత వారం చివర్లో అమ్మకాలు ఊపందుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే స్వల్ప కాలానికి కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్లకు దిశా నిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.


 మే డే సెలవు: ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మే డే కారణంగా గురువారం(1న) మార్కెట్లు పనిచేయవు. కాగా, దేశీ కంపెనీల ‘జనవరి-మార్చి’ ఫలితాలకుతోడు.... అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఈ వారం చివర్లో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలిచే అవకాశముందని తెలిపారు. ఏప్రిల్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్నందున ఇన్వెస్టర్లు ఆటో షేర్లపై దృష్టిపెడతారని తెలిపారు.  


 బ్లూచిప్స్ ఫలితాలు...
 ఈ వారం ఫలితాలు వెల్లడించనున్న దిగ్గజాలలో హిందుస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, జిందాల్ స్టీల్, సెసాస్టెరిలైట్ తదితరాలున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. 29-30న రెండు రోజులపాటు నిర్వహించనున్న పాలసీపై అంతర్జాతీయస్థాయిలో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. దేశీయంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగ బ్లూచిప్స్ ప్రకటించనున్న ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు.


 6,650 కీలకం: ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,630-6,650 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనుందని జయంత్ అంచనా వేశారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరుగుతాయని చెప్పారు. కాగా, గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడతారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఈక్విటీలలో కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, విదేశీ సానుకూల సంకేతాలు, దేశీయంగా వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం, లోక్‌సభ ఎన్నికలపై ఆశావహ అంచనాలు వంటివి మార్కెట్లను నడిపిస్తాయని వివరించారు. అయితే స్టాక్ మార్కెట్లకు జోష్‌నివ్వగల బలమైన అంశం కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటేనని, దీంతో వచ్చే నెల 16న వెల్లడికానున్న ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నదని నిపుణులు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement