ఎన్‌ఎఫ్‌ఓల్లో పెట్టుబడులు పెట్టొచ్చా? | to invest in nfo? | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎఫ్‌ఓల్లో పెట్టుబడులు పెట్టొచ్చా?

Published Mon, May 5 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

to invest in nfo?

కొత్త ఫండ్ ఆఫర్ల(ఎన్‌ఎఫ్‌ఓ)లో 5,000-10,000 చొప్పున చిన్న మొత్తాల్లో పెట్టుబడిపెట్టి దీర్ఘకాలిక రాబడుల కోసం పదేళ్లపాటు వేచి చూడటం మంచి నిర్ణయమేనా? - వికాశ్, ఈమెయిల్
 ఎన్‌ఎఫ్‌ఓలకు దూరంగా ఉండాలనేది మేం సాధారణంగా ఇచ్చే సలహా. ఈ పెట్టుబడులను ఆయా సంస్థలు తిరిగి ఎందులో ఇన్వెస్ట్ చేస్తాయనేది తెలియదు. అందువల్ల గతంలో మంచి పనితీరున్న ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే ఉత్తమం. దీర్ఘకాలం పాటు పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా ఉంచాలని మీరు భావిస్తున్నారు కాబట్టి.. మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్‌ను ఎంచుకొని మీ చిన్నచిన్న పొదుపు మొత్తాలను క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి.

 ఒకవేళ మీరు చిన్న మొత్తాన్ని ఒక ఎన్‌ఎఫ్‌ఓలో పెట్టుబడిగా పెట్టారనుకుందాం. ఆ పెట్టుబడి ఎలా వృద్ధి చెందుతోంది లేదంటే తగ్గుతోందనేది తెలుసుకునే అవకాశం ఉండదు. ఆ ఫండ్ పథకం పనితీరును తెలియజేసే గత రికార్డు ఏదీ అందుబాటులో ఉండదు. మీ పెట్టుబడులు రాబడులు అందించొచ్చు లేదా అందించకపోవచ్చు. అదే క్రమం తప్పకుండా ఏవైనా పెట్టుబడులు పెట్టుకుంటూవెళ్తే... కొన్నేళ్ల తర్వాత అత్యంత మెరుగైన రాబడులు అందుకునేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయి.

 సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్లు క్షీణించే సమయంలో మరింత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు వీలవుతుంది. తక్కువ రేటుకు ఫండ్ యూనిట్లను కొనుగోలు చేస్తారు కాబట్టి లాభాల మార్జిన్లు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు  సిప్‌ను అనుసరించడం వల్ల  ఏ సమయంలో పెట్టుబడి పెడితే మంచి రాబడులొస్తాయి ఇతరత్రా మానసిక ఒత్తిళ్లుకూడా ఉండవు. ఒక మంచి ఫండ్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనేవి ఎల్లప్పుడూ అత్యుత్తమ రాబడులనే అందిస్తాయి. దీనికోసం ఎన్‌ఎఫ్‌ఓలను ఆశ్రయించడం అనవసరం. అయితే, మీరు చేసే పెట్టుబడులకు సంబంధిన మొత్తాన్ని ఫండ్ సంస్థలు నిర్వహించే తీరు, కేటాయింపులు లేదా ఆ రంగం భవిష్యత్తులో మంచి పనితీరును కనబరుస్తుందని మీరు బలంగా విశ్వసిస్తే ఎన్‌ఎఫ్‌ఓల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.

 ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఇంట్రాడే ట్రేడింగ్ సందర్భంగా ఆయా ఇండెక్స్ విలువలకు అనుగుణంగా ట్రేడ్ అవుతాయా? వీటి బిజినెస్ మోడల్‌ను అదేవిధంగా ఇన్వెస్టర్లకు ఏవిధంగా రాబ డులను అందించగలుగుతాయో వివరించండి. - సుశీల్‌కుమార్, విజయవాడ
 ఇండెక్స్ ఫండ్స్‌ను ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. స్టాక్ సూచీల జాబితాలో ఉండే కంపెనీల వెయిటేజీకి అనుగుణంగా ఈ పండ్స్ పెట్టుబడులు పెడతాయి. ఫండ్ కంపెనీలు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలను ట్రాక్ చేయడం ద్వారా వీటి పనితీరును అంచనావేస్తాయి. చాలా చురుగ్గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చే ఫండ్స్‌తో పోలిస్తే.. ఈ ఇండెక్స్ ఫండ్స్‌కు నష్టభయం(రిస్క్-రిటర్న్ ఫ్రొఫైల్) తక్కువగా ఉంటుంది.

బుల్స్ మంచి దూకుడు మీదున్నప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ ఇంచ్చేంత భారీ రాబడులను ఈ ఇండెక్స్ ఫండ్స్ అందించలేవు. అదేవిధంగా మార్కెట్లు కుప్పకూలినప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ విభాగంలోని ఫండ్స్ మాదిరిగా భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉండదు. ఇండెక్స్ ఫండ్స్‌కు సంబంధించి రాబడులను ముందుగానే ఒక అంచనా వేయొచ్చు. మార్కెట్లను మించి లాభాలను ఆశించడం కుదరదు. ఇక ఇంట్రాడే ట్రేడింగ్ విషయానికొస్తే... మ్యూచువల్ ఫండ్స్ కేవలం షేర్లను మాత్రమే కొనడం, అమ్మడం, కొంతకాలం అట్టిపెట్టుకోవడం చేస్తాయి. డే ట్రేడర్ల మాదిరిగా ఫండ్స్ కార్యకలాపాలు ఉండవు.

 ఏజెంట్లు లేదా డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే ట్రైల్ కమీషన్‌ను నికర అసెట్ విలువ(ఎన్‌ఏవీ) కొనుగోలు తేదీ లేదా వార్షిక ముగింపు తేదీ లేదా అమ్మకం తేదీ... వీటిలో దేని ఆధారంగా లెక్కిస్తారు? అదేవిధంగా డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్‌లను నిర్వచించేందుకు గల పరిమితులు ఏంటి? డెట్ ఫండ్ తనవద్దనున్న కార్పస్(మూల నిధి)లో డెట్ పెట్టుబడి సాధనాల్లో వెచ్చించే మొత్తం 75 శాతమా లేదంటే 65 శాతమా?
 - కమల్, తిరుపతి
 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల(ఏయూఎం)ల్లో రోజువారీ ప్రాతిపదికన కొంత శాతాన్ని తీసుకొని దాని ఆధారంగా ఈ ట్రైల్ కమీషన్లను లెక్కిస్తారు. వీటిని నెలవారీగా చెల్లిస్తారు. నికర అసెట్స్ ఆధారంగా వీటిని లెక్కగడతారు కాబట్టి.. ఆయా ఫండ్స్‌కు సంబంధించిన ఎన్‌ఏవీ పెరగడం వల్ల అసెట్స్ పుంజుకోవడం లేదా మరిన్ని ఎక్కువ ఫండ్ యూనిట్లను విక్రయించడం వంటి సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.

రోజువారీ పద్ధతిలో వ్యయనిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని దాన్ని మినహాయించుకున్నాకే ఈ కమీషన్ చెల్లింపులు జరుగుతాయి. ఇన్వెస్టర్లు ఈ ట్రైల్ కమీషన్ల గురించి పెద్దగా ఆందోళనచెందక్కర్లేదు. ఎందుకంటే అన్ని ఫండ్స్ కూడా ఈ కమీషన్లను తమ వ్యయ నిష్పత్తుల్లో చేరుస్తాయి. ఇవేమీ బయటికి వెల్లడించని వ్యయాలుకావు. కాబట్టి ఎన్‌ఏవీలపై వీటి ప్రభావం ఉండదు. ఈక్విటీ ఫండ్స్‌లో ట్రైల్ కమీషన్లు 0.20-1 శాతంగా; డెట్ ఫండ్స్‌లో అయితే 0.10-1 శాతం మధ్యలో ఉంటాయి. ఇన్వెస్టర్ల సొమ్ము ఫండ్స్‌లో కొనసాగినంతకాలం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్లు చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండో ప్రశ్న విషయానికొస్తే.. ఏ ఫండ్ అయినా 65 శాతానికి మించి తమ అసెట్స్‌ను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌చేస్తే దాన్ని ఈక్విటీ ఫండ్‌గా వ్యవహరిస్తారు. అదే 65 శాతం కంటే తక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లో పెట్టుబడిపెడితే వాటిని డెట్ ఫండ్స్‌గా చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement