నిశ్చింతగా రిటైర్ కావాలంటే..
జీతం మీదే ఆధారపడిన వారికి .. పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. ఖర్చులు మాత్రం పెరిగిపోతుంటాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తుం టాయి. రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి సమస్యల వలయంలో చిక్కుపడకూడదంటే .. కాస్త ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే సరి. పదవీ విరమణ తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు.
ఈ దిశగా తోడ్పడే కొన్ని అంశాలు మీకోసం.. వైద్యానికీ కొంత కేటాయించాలి ..
రిటైర్మెంట్ తర్వాత ఒడిదుడుకుల్లేకుండా జీవించడానికి ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ద్రవ్యోల్బణం, మరొకటి వయసు పైబడుతున్న కొద్దీ పెరిగే వైద్యం ఖర్చులు. ఆసుపత్రి వ్యయాలు ఏటా 18-20% పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎంత అవసరమో లెక్క వేసుకోవాలి.
రిటైర్మెంట్ నిధి..
సాధారణంగా 58-60 సంవత్సరాలకు రిటైరవుతుంటాం. అయితే, ఏదైనా కారణంతో ఒకవేళ 50 ఏళ్లకే రిటైరవ్వాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? అందుకే ఈ రెండు అంశాలకూ పనికొచ్చే విధంగా రిటైర్మెంట్ నిధిని రెండు భాగాలుగా విడగొట్టాలి. ఒక భాగం సాధారణ రిటైర్మెంట్‌కి కేటాయించాలి. రెండోది ముందస్తు రిటైర్మెంట్ వయసు నుంచి సాధారణ పదవీ విరమణ వయసు దాకా (58-60) గడిపే సంవత్సరాల కోసం కేటాయించాలి.
అత్యాశకు పోవద్దు..
సాధ్యమైనంత ఎక్కువ నిధిని కూడబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధిక రాబడులు అందిస్తామనే మోసపూరిత పథకాల వలలో పడకుండా ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటే రిస్కు కూడా ఎక్కువే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
మార్కెట్లంటే భయపడొద్దు ..
రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది దీర్ఘకాలికమైనది. కనుక, సురక్షితంగా, స్థిరమైన రాబడులు ఇచ్చే పెట్టుబడి సాధనాలు ఎంచుకోవాలి. అలాగని మరీ రక్షణాత్మకంగా కాకుండా పోర్ట్‌ఫోలియోలో అన్ని పథకాలు ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో మిగతా సాధనాల కన్నా అధిక రాబడులు అందిస్తుంటాయి. కనుక, ముందస్తుగా పదవీ విరమణ చేయదల్చుకున్న వారు రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన యులిప్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
మరింత పొదుపు చేయాలి..
తగినంత నిధితో రిటైర్ కావాలంటే.. సాధ్యమైనంత వరకూ వ్యయాలు తగ్గించుకోవాలి, పొదుపు చర్యలు పాటించాలి, తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. పన్నులపరంగా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తే.. మరింత డబ్బు పొదుపు చేసేందుకు ఉపయోగపడుతుంది.
ఆదాయం పెంచుకోవాలి..
కాలం చాలా విలువైనది. కనుక దీన్ని వృథా చేయకుండా ఆదాయం తెచ్చిపెట్టే పనులపై ఇన్వెస్ట్ చేయాలి. కేవలం జీతమే కాకుండా అదనపు ఆదాయ మార్గాలను కూడా అన్వేషించుకోవాలి.