మార్కెట్ పంచాంగం
గతవారం ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత్ మార్కెట్ బాగా డీలా పడింది. తాజా క్షీణతతో అక్టోబర్ నెలలో ఆర్జించిన లాభాల్లో ఎక్కువ శాతాన్ని భారత్ సూచీలు కోల్పోయాయి. ప్రపంచ ప్రధాన దేశాల సూచీలను ప్రతిబింబించే ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌తో సహా అమెరికా మార్కెట్లు అక్టోబర్‌లో 7 శాతంపైగా పెరిగి నాలుగేళ్ల రికార్డును సృష్టించగా, భారత్ మార్కెట్ గత నెల పెరుగుదల 1.5 శాతానికే పరిమితయ్యింది. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు బలహీన ఆర్థిక ఫలితాలు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్ల ఆందోళన ఇక్కడి మార్కెట్ క్షీణతకు కారణం కావొచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
అక్టోబర్ 23తో ముగిసినవారం ప్రధమార్థంలో 27,575 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో 26,585 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 814 పాయింట్ల భారీ నష్టంతో 26,657 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 200 డీఎంఏ రేఖ సమీపానికి చేరిన తర్వాత, ఆ స్థాయిని అధిగమించలేక, సూచీ వేగంగా క్షీణించింది. పతనవేగం కారణంగా గత అప్‌ట్రెండ్‌కు ప్రతిగా డౌన్‌స్వింగ్ మొదలయ్యిందని భావించవచ్చు.
సెప్టెంబర్ 8నాటి కనిష్టస్థాయి అయిన 24,833 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి జరిగిన 2,742 పాయింట్ల ర్యాలీలో సూచీ ఇప్పటికి 38.2 శాతం కోల్పోయినందున, ఈ వారం ప్రస్తుతస్థాయి నుంచి మార్కెట్ కోలుకోలేకపోతే 50 శాతం డౌన్‌వర్డ్ రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 26,200 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 25,880 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం నిలబెట్టుకోలేకపోతే తిరిగి 24,800 పాయింట్ల సమీపస్థాయికి తగ్గవచ్చు. ఈ వారం రికవరీ జరిగితే 27,100 పాయింట్ల నిరోధస్థాయిని చేరవచ్చు. ఆపైన ముగిస్తే 27,200 పాయింట్ల వరకూ పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి బుల్ కక్ష్యలోకి ప్రవేశించాలంటే 27,660 పాయింట్ల స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సివుంటుంది.
నిఫ్టీ నిరోధం 8,180-మద్దతు 7,940
గతవారం తొలుత 8,336 పాయింట్ల గరిష్టంవరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, వారం చివర్లో 8,044 పాయింట్ల కనిష్టం వరకూ పతనమయ్యింది. చివరకు 229 పాయింట్ల నష్టంతో 8,066 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ కోలుకుంటే క్రమేపీ 8,180 పాయింట్ల నిరోధస్థాయికి చేరవచ్చు. అటుపైన ముగిస్తే 8,230 స్థాయికి చేరే అవకాశం వుంది. ఈ రెండు స్థాయిల్ని అధిగమించి, స్థిరపడితేనే ఇటీవలి గరిష్టస్థాయి అయిన 8,336 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది.
ఈ వారం ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ నిలదొక్కుకోలేకపోతే క్రమేపీ 7,940 పాయింట్ల మద్దతుస్థాయివరకూ తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే 7,840 పాయింట్ల వరకూ తగ్గే ప్రమాదం వుంది. ఏదైనా అనూహ్యవార్త కారణంగా ఈ రెండో మద్దతును కూడా కోల్పోతే రానున్న రోజుల్లో తిరిగి 7,540 పాయింట్ల వరకూ పతనం కావొచ్చు. 8,375 పాయింట్ల స్థాయిని దాటితేనే నిఫ్టీ తిరిగి బుల్లిష్‌గా మారే ఛాన్స్ వుంటుంది.
మద్దతు 26,200-అవరోధం 27,100
Published Mon, Nov 2 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM
Advertisement
Advertisement