టాప్ 5 మార్కెట్లలో భారత్.. | top 5 markets in india | Sakshi
Sakshi News home page

టాప్ 5 మార్కెట్లలో భారత్..

Published Thu, Jan 21 2016 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

టాప్ 5 మార్కెట్లలో భారత్..

టాప్ 5 మార్కెట్లలో భారత్..

కంపెనీలకు అపారమైన
వ్యాపార అవకాశాలు ఉన్నాయ్
సీఈవోల సర్వేలో వెల్లడి
డబ్ల్యూఈఎఫ్ వేదికపై నివేదిక విడుదల

దావోస్: అపారమైన వ్యాపార అవకాశాలు కల్పిస్తూ దేశ, విదేశ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది భారత్. తద్వారా అంతర్జాతీయంగా వ్యాపారాలకు అనువైన, ఆశావహ టాప్ 5 దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు.

వ్యాపారాలకు ఆశావహ దేశాలుగా సీఈవోలు పేర్కొన్న దేశాల్లో అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, భారత్ ఉన్నాయి. సొంత కంపెనీల వృద్ధిపై భారతీయ సీఈవోల్లో ధీమా స్థాయి గతేడాదితో పోలిస్తే కొంత తగ్గినా.. అంతర్జాతీయ సగటుతో పోలిస్తే అధికంగానే ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఏడాది వ్యాపారాల వృద్ధిపై చాలా మంది సీఈవోలు అంత ఆశావహంగా లేరు.

రాబోయే ఏడాది కాలంలో ప్రపంచ ఎకానమీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశావహంగా ఉన్న వారి సంఖ్య గతేడాది 37 శాతంగా ఉండగా.. ఈసారి అది 27 శాతానికి పడిపోయింది. అయితే, ఈ పరిస్థితి నడుమ... అత్యంత ఆశావహంగా ఉన్న సీఈవోల్లో భారత్‌కి చెందినవారు అత్యధికంగా (64 శాతం) ఉన్నారు. తర్వాత స్థానాల్లో స్పెయిన్ (54 శాతం), రొమేనియా (50 శాతం) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.

తమ కంపెనీల ఆదాయాల వృద్ధిపై మిగతా దేశాలవారితో పోలిస్తే భారత సీఈవోలు మరింత ధీమాగా ఉండటమనేది.. సెంటిమెంటు మెరుగుపడటానికి నిదర్శనమని పీడబ్ల్యూసీ ఇండియా విభాగం చైర్మన్ దీపక్ కపూర్ తెలిపారు. ఇటీవలి విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడుల రాక, ఇన్‌ఫ్రాకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మొదలైనవి ఇందుకు కారణమని వివరించారు.

అవకాశాలపై సీఈవోలు ఆశావహంగా ఉన్నప్పటికీ.. మౌలిక సదుపాయాల కొరత, నియంత్రణ సంస్థల అధిక జోక్యం వంటి అంశాలు వారికి ఆందోళనకరంగా ఉంటోందని కపూర్ పేర్కొన్నారు. 83 దేశాల్లో 1,409 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

 ఆటోమేషన్‌తో వర్ధమాన దేశాలకు దెబ్బ..
నాలుగో పారిశ్రామిక విప్లవంతో వచ్చిన తీవ్ర స్థాయి ఆటోమేషన్, కనెక్టివిటీ తదితర పరిణామాలతో సంపన్న దేశాలు లబ్ధి పొందినా .. వర్ధమాన దేశాలపై మాత్రం దీని ప్రభావం ప్రతికూలంగానే ఉండనుందని ఆర్థిక సేవల దిగ్గజం యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. ఆటోమేషన్ వల్ల తక్కువ స్థాయి, మధ్య స్థాయి నిపుణుల ఉద్యోగాలకు ముప్పు పెరుగుతోందని వివరించింది.

నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ఆకళింపు చేసుకోవడమనే అంశంపై ఈసారి డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో యూబీఎస్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. అటు టెక్నాలజీ అనేది శక్తివంటిదని, దాన్ని ఉపయోగించుకోవడంపైనే ప్రభావాలు ఆధారపడి ఉంటాయని సదస్సులో పాల్గొన్న సందర్భంగా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.

అటు, పారిశ్రామిక విప్లవంతో డిజిటల్‌పరమైన ప్రయోజనాలు ఎలా పొందాలన్న దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. సరైన శిక్షణతో నైపుణ్యాలు కల్పిస్తే.. భారత్‌లో అపార ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా చెప్పారు.

 9% వృద్ధి సాధ్యమే: జైట్లీ
అంతర్జాతీయంగా అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒడిదుడుకులనేవి ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణ అంశంగా మారాయని, ఏ దేశమూ వీటికి అతీతం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే, పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటే భారత్ కచ్చితంగా 8-9 శాతం మేర వృద్ధి రేటును సాధించగలదని సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వర్షాభావం, అంతర్జాతీయ సమస్యల మధ్య కూడా 7-7.5 శాతం మేర వృద్ధి రేటును భారత్ సాధించగలుగుతోందన్నారు. అటు, 2008 తరహా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలు లేనప్పటికీ, ప్రపంచ ఎకానమీకి పలు రిస్కులు మాత్రం పొంచి ఉన్నాయని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ఆర్థికవేత్త నూరిల్ రూబిని పేర్కొన్నారు.

 ద్రవ్య విధానాలే పరిష్కారం కాదు: రాజన్
ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నింటికీ ద్రవ్య పరపతి విధానాలొక్కటే పరిష్కారమార్గం కాదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలికంగా ప్రపంచ ఎకానమీ వృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు మార్కెట్ల పతనమనేది మార్కెట్లపరమైన సమస్యే తప్ప ఆర్థిక వ్యవస్థది కాదని రాజన్ స్పష్టం చేశారు. అయితే, మార్కెట్లలో వచ్చే సమస్యలతో వాస్తవిక ఎకానమీపైనా దెబ్బపడే అవకాశముందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement