కుబేర సంపద సగం వీరిదే | Top 5 richest Indians, led by Mukesh Ambani, have half of nation's billionaires' wealth | Sakshi
Sakshi News home page

కుబేర సంపద సగం వీరిదే

Published Thu, Aug 14 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

కుబేర సంపద సగం వీరిదే

కుబేర సంపద సగం వీరిదే

న్యూఢిల్లీ: టాప్ 5 భారతీయ కుబేరుల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 8,550 కోట్ల డాలర్లు! మన కరెన్సీలో రూ.5,23,897 కోట్లు. భారత్‌లో 100 కోట్ల డాలర్లకుపైగా వ్యక్తిగత సంపద ఉన్న శ్రీమంతుల మొత్తం ఆస్తుల విలువలో ఇది దాదాపు సగమని వెల్త్ రీసెర్చ్ కంపెనీ వెల్త్-ఎక్స్ విశ్లేషించింది. దేశంలోని కుబేరుల సిరిసంపదలపై కంపెనీ ఇటీవలే అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించింది.

 

 

ముకేశ్ అంబానీదే అగ్రస్థానం...
 రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2,440 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,49,474 కోట్లు) సంపదతో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఉక్కు రంగ దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, టాటా సన్స్ వాటాదారు పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విలువైన ముంబై ఇండియన్స్ టీమ్ ముకేశ్ అంబానీకి చెందినదే. ఈ టీమ్ విలువ 11.20 కోట్ల డాలర్లుంటుందని అంచనా.

 స్టీల్ టైకూన్ మిట్టల్...
 ప్రపంచంలో ఉక్కును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ నెట్‌వర్త్ 1,720 కోట్ల డాలర్లు. ఆర్సెలర్ మిట్టల్‌లో 38 శాతం షేరుతో పాటు క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌లో 33 శాతం వాటా మిట్టల్‌కు ఉంది.

 అత్యంత సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీకి 1,563 కోట్ల డాలర్లు, నాలుగో స్థానంలోని విప్రో ప్రేమ్‌జీకి 1,490 కోట్ల డాలర్లు, ఐదో ర్యాంకులోని పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీకి 1,270 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు ఇతోధిక తోడ్పాటు అందించేందుకు ఈ ఐదుగురు కుబేరులూ ఫౌండేషన్లను ఏర్పాటు చేశారని వెల్త్-ఎక్స్ తెలిపింది. బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్‌కు 60 కోట్ల డాలర్లు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు 16 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement