సాక్షి, బిజినెస్ విభాగం: పబ్లిక్ ఇష్యూల జోరు ఈ ఏడాదీ కొనసాగనుంది. గతేడాది పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రికార్డ్ స్థాయిలో నిధులు సమీకరించాయి. మొత్తంగా 36 ప్రధాన కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లు సమీకరించాయి. ఇది ఇప్పటివరకూ రికార్డ్. గత ఏడాది లిస్టయిన 36 కంపెనీల్లో 27 ఇన్వెస్టర్లకు మంచి రాబడులే ఇచ్చాయి. ఈ ఏడాది ఆ రికార్డు బద్దలయ్యే అవకాశాలున్నాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పదికి పైగా కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.12,000 కోట్ల మేర నిధులు సమీకరించడానికి సెబీ నుంచి ఆమోదం పొందాయి. రూ.19,000 కోట్ల సమీకరణ కోసం మరో 10 కంపెనీలు సెబీకి దరఖాస్తులు చేస్తున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను చూసుకున్నా... వాటిలో సెబీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ వాటాను 75 శాతానికి పరిమితం చేసుకోవాల్సి ఉంది. దీంతో 18 సంస్థల్లో వాటాను ప్రభుత్వం తగ్గించుకోవాల్సి ఉంది. దీని కోసం ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఐపీఓల ద్వారా రూ.27,520 కోట్లు సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కాని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఓకు రానున్న ప్రధాన కంపెనీలు, వాటి వివరాలు చూస్తే...
హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ
ఈ ఏడాది మార్చిలోగానే ఈ కంపెనీని లిస్ట్ చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ యోచిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.2.69 లక్షల కోట్లు. ఈ ఐపీఓ ద్వారా 10% వాటాకు సమానమైన షేర్ల జారీ చేసి రూ.4,000 కోట్ల వరకూ సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్టవుతున్న రెండో మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇది. ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టయింది.
ఎట్టకేలకు ఎన్‌ఎస్‌ఈ!
గత ఏడాది బోంబే స్టాక్ ఎక్సే్ఛంజీ (బీఎస్‌ఈ) ఇష్యూకి మంచి స్పందన రావడంతో ఇప్పుడు అందరి కళ్లూ ఎన్‌ఎస్‌ఈపై పడ్డాయి.ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ కూడా ఈ ఏడాదే వచ్చే అవకాశాలున్నాయి. దీని ద్వారా రూ.10,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఎన్‌ఎస్‌ఈలో వాటాదారులైన ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, ఐఎఫ్‌సీఐ, ఐడీబీఐ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, స్టాక్ హోల్డింగ్ కార్ప్, టైగర్ గ్లోబల్, సిటీ గ్రూప్ తదితర కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తమ వాటాను కానీ, తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నాయి.
నేషనల్ ఇన్సూరెన్స్ వస్తోంది..
గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రి, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌లు లిస్టయ్యాయి. ఈ ఏడాది మరో నేషనల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు రానుంది. ఐపీఓ ద్వారా 10–15% వాటా విక్రయించే అవకాశాలున్నాయి. ఐపీఓ పరిమాణం రూ.2,000–రూ.3,000 కోట్లు ఉండొచ్చు.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్..
ఐసీఐసీఐ బ్యాంక్ పూర్తి అనుబంధ కంపెనీ ఇది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఈ బ్యాంక్ 6,44,28,280 షేర్లను జారీ చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ లిస్ట్ చేస్తున్న నాలుగో గ్రూప్ కంపెనీ ఇది. భారత్‌లో అతి పెద్ద బ్రోకరేజ్ సంస్థ ఇదే. రూ.5,000 కోట్లు సమీకరించొచ్చని అంచనా.
ఐదు రైల్వే ఐపీఓలు కూడా!
రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ, ఇర్‌కాన్, ఐఆర్‌ఎఫ్‌సీ, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్), ఆర్‌ఐటీఈఎస్ కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్లు గతేడాది ప్రారంభంలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కానీ వివిధ రైల్వే సంస్థల మధ్య ఆర్థికాంశాలు పరిష్కారం కావలసి ఉండటంతో ఈ ఐపీఓ ప్రణాళికలు అటకెక్కాయి. ఐఆర్‌సీటీసీ సర్వీస్ చార్జీ అంశంపైన, ఐఆర్‌ఎఫ్‌సీ పన్ను బాధ్యతపైన స్పష్టత రావాల్సి ఉంది. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ఐపీఓకు రావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ ఐదు రైల్వే ఐపీఓల ద్వారా సుమారుగా రూ.8,000 కోట్లు సమీకరించవచ్చు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్..
రక్షణ రంగ పరికరాలు తయారు చేస్తున్న ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ ఇది. పది శాతం వాటాకు సమానమైన 3,61,50,000 షేర్లను ఆఫర్ ఫర్‌సేల్ విధానంలో కేంద్రం విక్రయించనుంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.2,000– 2,500 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.19,597 కోట్ల ఆదాయంపై రూ.2,625 కోట్ల నికర లాభం సాధించింది. లాభదాయకత విషయంలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీ సొంతం. 40 ఏళ్లుగా ఏటా డివిడెండ్‌లు చెల్లిస్తోంది. దీర్ఘకాలంలో పవన్ హాన్స్, ఎయిర్‌పోర్ట్ అ«థారిటీ ఐపీఓలనూ తెచ్చే అవకాశాలున్నాయి.
ఈ ఏడాది ఐపీఓల హల్‌చల్
Published Wed, Jan 3 2018 12:36 AM | Last Updated on Wed, Jan 3 2018 12:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment