తోషిబాకు 32 కోట్ల డాలర్ల నష్టం
టోక్యో: లాభాలను పెంచి చూపిన కుంభకోణంలో చిక్కుకున్న జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తోషిబా గత ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను సవరించింది. ముందుగా 120 బిలియన్ యెన్‌ల వార్షిక లాభాలు అంచనా వేసినప్పటికీ.. సవరించిన దాని ప్రకారం 37.8 బిలియన్ యెన్‌ల మేర (సుమారు 31.8 కోట్ల డాలర్ల) నష్టాన్ని ప్రకటించింది.
అయితే, నిర్వహణ లాభాలు మాత్రం యథాతథంగా 170 బిలియన్ యెన్‌ల మేర ఉన్నట్లు వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాలు ప్రకటించడం లేదని పేర్కొంది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థ లాభాలను ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల మేర పెంచి చూపించినట్లు వెల్లడి కావడంతో తోషిబా ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. పలువురు అధికారులు వైదొలిగారు. దీంతో తోషిబా ఆర్థిక పరిస్థితులను కంపెనీయేతర కమిటీ మదింపు చేసింది.