ముంబై: స్టాక్ సూచీలు జీవిత గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను వచ్చే సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. దేశీయంగా కీలక కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి వాటిపై మళ్లనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం(జూన్ 20న) ప్రారంభం కానున్నాయి. రుతు పవనాల పురోగతి వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి.
‘‘గరిష్ట స్థాయిల్లో స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వహిస్తూ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి 19650 వద్ద నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 19770 వద్ద మరో కీలక నిరోధం ఎదురుకానుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువ స్థాయిలో 19300 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు.
కంపెనీల తొలి క్వార్టర్ ఫలితాలపై ఆశాశహ అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, టోకు ధరలు దిగిరావడం, మార్కెట్లో అస్థిరత తగ్గడం తదితర సానుకూలాంశాలతో వరుసగా మూడోవారమూ సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. ఐటీ, మెటల్, రియల్టీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 781 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అలాగే వారాంతాన సెన్సెక్స్ 66,160 వద్ద, నిఫ్టీ 19,595 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరుపై దృష్టి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అలాగే విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హులైన హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు 311 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌హోల్డర్లు ఇప్పటికే వారు కలిగి ఉన్న షేర్లకు ప్రతి 25 షేర్లకు బదులుగా 42 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అందనున్నాయి. కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. తాజాగా లిస్ట్ అవుతున్న షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఈక్విటీ షేర్లతో సమానంగా ఉంటాయని వెల్లడైంది.
క్యూ1 ఆర్థిక ఫలితాలపై కన్ను
కీలక కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలో ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ఆస్కారం ఉంది. ఇండెక్సుల్లోని హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంక్, ఎల్‌టీఐమైండ్‌టీ కంపెనీల క్యూ1 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ బుధవారం.., ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్ గురువారం.., హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఆ్రల్టాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు శుక్రవారం తమ జూన్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ, టాటా కమ్యూనికేషన్స్, యూనిటెడ్ స్పిరిట్, కెన్‌ఫిన్ హోమ్స్, ఎంఫసిస్, టాటా ఎలాక్సీ, క్రిసిల్ కంపెనీలూ ఫలితాలను విడుదల చేసే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.
ప్రపంచ పరిణామాలు
చైనా కేంద్ర బ్యాంకు సోమవారం కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. అలాగే ఆ దేశ రెండో క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి కానుంది. అమెరికా జూన్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం విడుదల అవుతాయి. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా బుధవారం, మరుసటి రోజు గురువారం కరెంట్ ఖాతా గణాంకాలు.., జపాన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడి కానున్నాయి. జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం విడుదల అవుతుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.
కొనసాగిన ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు
దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం జూలై ప్రథమార్థంలో కొనసాగింది. ఈ నెల తొలి భాగంలో రూ.30,600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీయ కార్పొరేట్ ఆదాయాలు, స్థూల ఆర్థిక డేటా మెరుగ్గా నమోదవడం ఇందుకు కారణమయ్యాయి. కాగా మే, జూన్ నెలల్లో వరుసగా రూ.43,838 కోట్లు, రూ.47,148 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ‘‘అంతర్జాతీయంగా డాలర్ క్షీణతతో ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం జీవితకాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనాతో పోలిస్తే భారత ఈక్విటీల వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. కావున చైనాలో అమ్మకం, భారత్‌లో కొనుగోలు విధానం విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువకాలం కొనసాగించకపోవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment