ఇది... లాభాల వారం
♦ స్వల్పంగా ఎగసిన సెన్సెక్స్
♦ 4 నెలల్లో అత్యధికంగా లాభపడ్డ వారమిదే...
♦ 60 పాయింట్ల లాభంతో 23,709 వద్దముగింపు
♦ 19 పాయింట్ల లాభంతో 7,211కు సెన్సెక్స్
ట్రేడింగ్ చివర్లో వాహన, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ స్వల్పంగా లాభపడింది. వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 23,709 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 7,211 పాయింట్ల వద్ద ముగిశాయి. టెక్నాలజీ, ఆయిల్ షేర్లు కూడా లాభపడ్డాయి. కాగా ఈ వారంలో సెన్సెక్స్ 723 పాయింట్లు(3.14 శాతం), నిఫ్టీ 230 పాయింట్లు(3.2 శాతం) చొప్పున లాభపడ్డాయి. నాలుగు నెలల కాలంలో ఒక్క వారంలో సెన్సెక్స్ ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటిసారి.
మూడీస్... సానుకూల ప్రభావం
ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా భారత్ 7.5 శాతం చొప్పున వృద్ధి సాధించగలదని, చైనా మందగమనం వంటి బాహ్య అంశాల ప్రభావం స్వల్పమేనని, కమోడిటీ ధరలు పడిపోవడం భారత్‌కు ప్రయోజనకరమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వెల్లడించడం సానుకూల ప్రభావం చూపించింది. ముడి చమురు సరఫరాలు మరింతగా పెరుగుతాయనే ఆందోళనలు మళ్లీ రేగడంతో ప్రారంభంలో సెన్సెక్స్‌కు నష్టాలు వచ్చాయి. కొనుగోళ్లు జోరుగా ఉండడం, షార్ట్ పొజిషన్ల కవరింగ్ కారణంగా సెన్సెక్స్ లాభాల బాట పట్టింది. చివరకు 60 పాయింట్ల లాభంతో 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 7,211 పాయింట్ల వద్ద ముగిసింది.
కొనుగోళ్ల ఆసక్తి..
అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పుంజుకోవడంతో చాలా కాలం తర్వాత భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల ఆసక్తి పెరిగిందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. రానున్న బడ్జెట్లో సంస్కరణలు ఉంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు పొజిషన్లు తీసుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. చమురు ధరలు నిలకడగా ఉండడం, చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, తదితర అంతర్జాతీయ పరిణామాలపై మార్కెట్ రికవరీ ఆధారపడి ఉంటుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. రైల్వే, కన్సూమర్ డ్యూరబుల్ వంటి బడ్జెట్ షేర్లలో స్పెక్యులేటివ్ ర్యాలీ ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
రైల్ షేర్లలో ర్యాలీ..
వచ్చే వారంలో రైల్వే బడ్జెట్ ఉన్న నేపథ్యంలో టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్, టిటాఘడ్ వ్యాగన్స్, కాళింది రైల్ నిర్మాణ్, బీఈఎంఎల్, స్టోన్ ఇండియా షేర్లు 9 శాతం వరకూ లాభపడ్డాయి. వ్యాపార వృద్ధి కోసం బాండ్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించిన నేపథ్యంలో ఎస్‌బీఐ 3.2 శాతం లాభపడి రూ.165 వద్ద ముగిసింది. హీరో మోటొకార్ప్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడ్డాయి.
పదేళ్ల కనిష్ట స్థాయిని తాకిన భెల్
విదేశీ బ్రోకరేజ్ సంస్థ విక్రయించమని సిఫార్సు చేయడం, టార్గెట్ ధరను రూ.115 నుంచి రూ.70కు తగ్గించడంతో భెల్ షేర్ ఇంట్రాడేలో రూ.98.75ను తాకింది. 2005 ఆగస్టు తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. చివరకు ఈ షేర్ 2 శాతం నష్టంతో రూ.102 వద్ద ముగిసింది. ఈ క్యూ3లో భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 10న రూ.123గా ఉన్న భెల్ షేర్ ధర తొమ్మిది రోజుల్లో 23 శాతం క్షీణించింది. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే మారుతీ సుజుకీ, భెల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్2 శాతం వరకూ నష్టపోయాయి. 1,302 షేర్లు లాభాల్లో, 1,204 షేర్లు నష్టాల్లో ముగిశాయి.