ట్రాక్టర్లకు యాంత్రీకరణ జోష్..!
♦ కూలీ రేట్లు పెరగటం; లభ్యత తగ్గటమే కారణం
♦ వాణిజ్య అవసరాలకు వాడటంపై పెరిగిన ఆసక్తి
♦ మెల్లగా జోరందుకుంటున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ అనగానే గుర్తొచ్చేది వ్యవసాయమే. కాకపోతే సాగు చేసేవారే ట్రాక్టర్‌ను కొనటమనే ట్రెండ్ మారిందిపుడు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతుండటంతో ఆదాయం కోసం వ్యవసాయ కుటుంబాలకు చెందనివారూ ట్రాక్టర్లను కొని అద్దెకివ్వటం వంటివి చేస్తున్నారు.
విభిన్న అవసరాలకు... ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల రవాణాకు ఉపయోగపడడం, తక్కువ సమయంలో ఎక్కువ పని, తక్కువ ఇంధనాన్ని వినియోగించే ట్రాక్టర్లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ట్రాక్టర్లు, ఇతర మెషినరీ తయారీ కంపెనీలు సైతం ఔత్సాహిక యువతను ప్రోత్సహిస్తున్నాయి. చెల్లించగలిగే స్తోమతున్న వారికి రుణం అందేలా చొరవ తీసుకుంటున్నాయి. ఈ చర్యలతో స్తబ్దుగా ఉన్న పరిశ్రమ తిరిగి గాడిలో పడుతోందన్నది కంపెనీల మాట.
వాణిజ్య అవసరాలకు వినియోగం...
నిజానికి రైతులు వ్యవసాయ అవసరాలకు ట్రాక్టర్ వాడితే ఏడాదిలో 90 రోజులకు మించి పని ఉండదు. మిగిలిన రోజుల్లో ట్రాక్టర్ ఖాళీగా ఉంటుంది కనక వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే గిట్టుబాటు అవుతుందని మహీంద్రా స్వరాజ్ సేల్స్ డీజీఎం ఎం.రాజానందన్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో చెప్పారు. ఒక గ్రామంలో ఎందరు రైతులున్నారు? ట్రాక్టర్లు, త్రెషర్లు, రోటావేటర్లు, పవర్ టిల్లర్ల వంటివి వారి దగ్గరెన్ని ఉన్నాయి? వాస్తవ డిమాండ్ ఎంత? అనే విషయాల్ని కంపెనీలు అధ్యయనం చేస్తున్నాయి.
ఊళ్లో ఔత్సాహిక యువతను ఎంచుకుని యంత్రాలను కొనేలా వారిని ప్రోత్సహిస్తున్నాయి. వారి రుణానికి మధ్యవర్తిగానూ వ్యవహరిస్తున్నాయి. పంట రకాన్నిబట్టి విభిన్న పరికరాలు (అప్లికేషన్లు) అవసరం. ఇలా ముందుకొచ్చిన యువతకు వారి ఊరు, సమీప గ్రామాల్లో వేసిన పంటల ఆధారంగా పనిముట్లను సూచిస్తున్నాయి. యాంత్రీకరణ విషయంలో భారత్‌లో అపార అవకాశాలున్నాయని ట్రాక్టర్ల కంపెనీ సొనాలికా చెబుతోంది. పంజాబ్‌లో అయిదుగురు రైతులకు ఒక ట్రాక్టర్ ఉంటే, దక్షిణాదిన 25 మంది రైతులకు ఒకటి ఉంది.
డిమాండ్ ఉన్న మోడళ్లపైనే..
మూడేళ్లుగా దేశవ్యాప్తంగా ఆశించిన వర్షాలు పడలేదు. పండించిన పంటకు సరైన ధర రాలేదు. దీంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయాలు లేక రైతులు కొత్త ట్రాక్టర్ల కొనుగోళ్లకు దూరమయ్యారు. ఈ పరిశ్రమ తిరోగమన బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థాయిలో ఏటా 60 వేల ట్రాక్టర్లు అమ్ముడయ్యేవి. ఇప్పుడీ సంఖ్య 37 వేలకు పరిమితమైంది. దేశవ్యాప్తంగానూ పరిస్థితి ఇలాగే ఉండడంతో ట్రాక్టర్ల కంపెనీలు 2014 నుంచి మోడళ్ల ధరలను పెంచలేదు.
ఈ కారణంగా లాభాలు పడిపోయాయని సొనాలికా సీనియర్ జీఎం ఎన్‌వీఎల్‌ఎన్ స్వామి తెలిపారు. అందుకే ఎక్కువ అమ్ముడయ్యే హెచ్‌పీ విభాగంపైనే దృష్టిసారించామని చెప్పారు. తమ కస్టమర్లలో 60 శాతం మంది సొంత అవసరాలతోపాటు వాణిజ్య అవసరాలకు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారని, 40 శాతం మంది పూర్తిగా కమర్షియల్ యూజర్లని తెలియజేశారు.
పెద్ద ఎత్తున యాంత్రికీకరణ..
భారత్‌లో వ్యవసాయ యంత్రాల పరంగా ఎక్కువగా అమ్ముడయ్యేవి ట్రాక్టర్లే. ఏడాదికి త్రెషర్లు ఒక లక్ష యూనిట్లు, రోటావేటర్లు 80,000, పవర్ టిల్లర్లు 60,000, పవర్ వీడర్లు 25 వేలు, కంబైన్ హార్వెస్టర్లు 5,000 దాకా విక్రయమవుతున్నాయి. కూలి రేట్లు పెరగటం, కూలీల కొరత తీవ్రంగా ఉండడమే యాంత్రీకరణను పెంచుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. 2004-2012 మధ్య దేశంలో 3.7 కోట్ల మంది వ్యవసాయ కూలీలు నిర్మాణ, తయారీ, సేవా వంటి రంగాలకు మళ్లినట్టు అంచనా. దేశ చరిత్రలో ఈ స్థాయిలో వలసలు జరగడం ఇదే తొలిసారి. ఇదంతా యాంత్రీకరణకు ఊపిరిపోస్తోంది.