
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు భయపెడుతోంది. మే నెలలో ఏకంగా ఈ లోటు 15.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన ఆరు నెలల్లో ఇంత ఎక్కువ స్థాయి (2018 నవంబర్‌లో 16.67 బిలియన్ డాలర్లు) వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎగుమతులు తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం– మేలో దేశం ఎగుమతులు 3.93 శాతం (2018 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 30 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతుల విలువ 4.31 శాతం పెరుగుదలతో 45.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యియి. దీనితో వాణిజ్యలోటు 15.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ ఎలక్ట్రానిక్స్ (51 శాతం), ఇంజనీరింగ్ (4.4 శాతం), కెమికల్స్ (20.64 శాతం), ఫార్మా (11 శాతం), తేయాకు (24.3 శాతం) ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి బాగుంది.
♦ అయితే పెట్రోలియం ప్రొడక్టులు, చేతితో తయారుచేసే నూలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, కాఫీ, బియ్యం ఎగుమతులు పెరక్కపోగా (2018 మేతో పోల్చి) మే నెలలో క్షీణించాయి.
♦ దిగుమతుల బిల్లు పెరగడానికి ప్రధాన కారణాల్లో క్రూడ్ ఆయిల్, పసిడి దిగుమతుల విలువ పెరగడం ఉన్నాయి.
♦ చమురు దిగుమతులు 8.23 శాతం పెరిగాయి. విలువ రూపంలో 12.44 బిలియన్ డాలర్లు. చమురు యేతర దిగుమతులు 2.9 శాతం పెరిగాయి. విలువ 32.91 బిలియన్ డాలర్లు.
♦ పసిడి దిగుమతులు ఏకంగా 37.43 శాతం పెరిగి 4.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఏప్రిల్– మే నెలల్లో..: 2019–20 తొలి రెండు నెలలనూ తీసుకుంటే, ఎగుమతులు 2.37% వృద్ధితో 56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 4.39% పెరుగుదలతో 86.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 30.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment