ఎగుమతులు డౌన్ | Exports Dip 3.67% to $25.6 Billion, First Time in 8 Months | Sakshi
Sakshi News home page

ఎగుమతులు డౌన్

Published Wed, Mar 12 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

ఎగుమతులు  డౌన్

ఎగుమతులు డౌన్

న్యూఢిల్లీ: కొద్ది నెలల్నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న భారత్ ఎగుమతులు ఫిబ్రవరి నెలలో హఠాత్తుగా తగ్గాయి. అయితే బంగారం, వెండి దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు సైతం తగ్గింది.  

మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇవీ...
 2014 ఫిబ్రవరి ఎగుమతుల్లో (2013 ఫిబ్రవరితో పోల్చితే) అసలు వృద్ధిలేకపోగా - 3.67 క్షీణత నమోదయ్యింది. అంటే 2014 ఫిబ్రవరిలో భారత ఎగుమతుల విలువ 25.68 బిలియన్ డాలర్లు. ఈ పరిమాణం 2013 ఫిబ్రవరిలో 26.66 బిలియన్ డాలర్లు. ఇలాంటి పరిస్థితి (అసలు వృద్ధిలేకపోగా క్షీణత) నమోదుకావడం 8 నెలల్లో ఇదే మొదటిసారి. ఎగుమతుల బాస్కెట్‌లో ముఖ్యమైన పెట్రోలియం, ఇంజనీరింగ్, ఫార్మా వంటి కీలక రంగాలు ఫిబ్రవరిలో డీలాపడిపోయి క్షీణతను నమోదుచేసుకున్నాయి.

ఇక దిగుమతుల విషయానికి వస్తే... దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఇవీ క్షీణతలోనే కొనసాగుతున్నాయి. వార్షికంగా చూస్తే (-) 17.09 శాతం క్షీణతతో 40.79 బిలియన్ డాలర్ల నుంచి 33.81 బిలియన్ డాలర్లకు పడ్డాయి.  చమురు దిగుమతులు 3.1 శాతం క్షీణించి 13.60 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.  చమురు యేతర దిగుమతులు ఫిబ్రవరిలో 24.5 శాతం పడిపోయి, దాదాపు 20.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

 ఇక ఈ నెలలో దిగుమతులు-ఎగుమతులకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు సానుకూల రీతిలో 8.13 బిలియన్ డాలర్లు (2013 ఫిబ్రవరిలో 14.8 బిలియన్ డాలర్లు) ఉంది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. విదేశీ కరెన్సీలలో రూపాయి కదలికల నిర్దేశంలో ఒక ప్రధాన కారణంగా నిలిచే కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్)కు ఇది కలిసివచ్చే అంశం.  ఒక నిర్దిష్ట యేడాదిలో క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి  వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తాం. 2013-14లో ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి  (జీడీపీ)తో పోల్చితే 3 శాతంకన్నా తక్కువగానే ఉంటుందని (40 బిలియన్ డాలర్ల లోపు) ఆర్థికమంత్రి ఇప్పటికే స్పష్టంచేశారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు జీడీపీలో 4.8 శాతం (88 బిలియన్ డాలర్లు).

 11 నెలల వ్యవధిలో...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య ఎగుమతులు కేవలం 4.79 శాతం వృద్ధితో 282.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే దిగుమతులు మాత్రం క్షీణతలో (-8.65శాతం) 410.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్యలోటు 128 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద దిగుమతుల విలువ 491.4 బిలియన్ డాలర్లుకాగా, ఎగుమతుల విలువ 300.6 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 190.9 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం 325 బిలియన్ డాలర్లు. కాగా ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో చమురు యేతర దిగుమతుల విలువ 13.4% పడిపోయి 260.23 బిలియన్ డాలర్లుగా ఉంది. చమురు దిగుమతుల విలువ మాత్రం స్వల్పంగా 0.8% వృద్ధితో 150. 63 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

 లక్ష్య సాధన కష్టమే!
 ఇదిలావుండగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 325 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి మనం ఇంకా 20 బిలియన్ డాలర్ల దూరంలో ఉండిపోయే అవకాశం ఉందని ప్రధాన ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. రుణ లభ్యత ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. డ్యూటీ రిఫండ్ క్లెయిమ్స్ బకాయిలు రూ.20,000 కోట్లు ఉన్నట్లు కూడా తెలిపారు. గ్లోబల్ డిమాం డ్ ఉన్నప్పటికీ, క్రెడిట్ పరమైన ఇబ్బందులు ఉండడం వల్లే మన ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన చెప్పారు.
 
 పుత్తడి దిగుమతుల కట్టడి
 క్యాడ్ కట్టడిలో భాగంగా కేంద్రం బంగారం-వెండి దిగుమతులపై కొనసాగిస్తున్న ఆంక్షలు కూడా వాణిజ్యలోటు తగ్గడానికి   ఒక కారణం. ఏడాది కాలంలో బంగారం, వెండి దిగుమతుల విలువ భారీగా 71.42 శాతం పడిపోయింది. 2013 ఫిబ్రవరిలో ఈ విలువ 5.7 బిలియన్ డాలర్లు ఉండగా, 2014 ఫిబ్రవరిలో 1.63 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో (2012-13 ఇదే కాలంతో పోల్చితే) రెండు విలువైన మెటల్స్ దిగుమతుల రేటు 41.47 శాతం పడిపోయి 52.4 బిలియన్ డాలర్ల నుంచి 30.7 బిలియన్ డాలర్లకు తగ్గింది.

 ఆంక్షల సడలింపును ఆలోచిస్తున్నాం: కేంద్రం
 ఇదిలావుండగా... బంగారం దిగుమతులపై  కొనసాగుతున్న ఆంక్షలను సడలించే అంశాలను పరిశీలిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయంపై ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు ఆయన వివరించారు.
 మరోవైపు, క్యాడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీతో పోల్చితే ఆరేళ్ల కనిష్ట స్థాయి 2 శాతం ఉంటుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. అయితే దిగుమతులు పెరగడం వల్ల వచ్చే యేడాది ఇది తిరిగి 2.7 శాతానికి ఎగసే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement