విదేశాలు వెళుతున్నారా... ట్రావెల్ కార్డ్ బెటర్!
విదేశీ పర్యటనలు చేయాలని ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా సరదాపడుతున్నారు. ఆదాయాలు పెరగడం కోరికలకు కూడా రెక్కలు వస్తున్నాయి. విదేశీ పర్యటనను ఏదో ఒక సరదా అంశంగా కాకుండా... విజ్ఞానాన్ని, మనో వికాసాన్ని పెంపొందించే ఒక అవకాశంగా కూడా ప్రజలు చూడ్డం ప్రారంభించారు. ఇందుకోసమే ప్రతినెలా కొంత డబ్బును తీసి పక్కనబెట్టే రోజులు వచ్చాయి. ప్రత్యేకించి నగరాల్లో నివసిస్తున్న కుటుంబాల్లో విదేశీ పర్యటన మోజు తీవ్రమవుతోంది. ‘పర్యటన ఎప్పుడో ఒకసారి’ అనే ధోరణికి బదులు ‘ఏడాదికి ఒకసారి తప్పనిసరి’గా మారింది.
రంగంలోకి ట్రావెల్ కంపెనీలు...
ప్రజల్లో వ్యక్తమవుతున్న విదేశీ పర్యటన ఆసక్తిని, ఉత్సాహాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి, దీనిని ఒక వ్యాపార అవకాశంగా మలచుకోడానికి పలు ట్రావెల్ కంపెనీలు కూడా పుట్టుకువచ్చాయి. ఎటువంటి పరిమితులూ లేకుండా... ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి యాత్రికుల ఆర్థిక శక్తికొలదీ వారికి విదేశీ పర్యటన అనుభవాన్ని ట్రావెల్ కంపెనీలు ఇస్తున్నాయి. గ్రూప్ ట్రావెల్స్, రాయితీలు వంటి పలు ఆకర్షణీయమైన పథకాలను ట్రావెల్ ఏజెన్సీలు ప్రవేశపెడుతున్నాయి. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు సైతం పర్యాటక రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ.. పర్యాటకులను ఆకర్షించడానికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘ఇంటర్నెట్’ ద్వారా పర్యాటకులు తమకు కావల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలు, హోమ్ స్టే, హోటల్స్ వంటి వివరాలను పర్యాటకులకు వెబ్‌సైట్లు అందుబాటులో ఉంచుతున్నాయి.
లోకల్ కరెన్సీతోనే ఎంజాయ్...
మీరు ఒక వేరే దేశంలో అడుగుపెట్టారంటే... అక్కడ ఉత్సాహంగా గడపడానికి లోకల్ కరెన్సీ తప్పనిసరి. ఈ విషయంలో ఇటీవల ‘ట్రావెల్ కార్డులు’ ప్రజాదరణ సంపాదించుకుంటున్నాయి. మీకు ఎంతకావాలో అంత మొత్తం ఆ దేశ లోకల్ కరెన్సీని అందించడానికి ఈ కార్డులు చక్కని సాధనాలుగా మారాయి. వీటి విశేషాలను చూస్తే...
►బ్యాంకులు వీటిని ఆఫర్ చేస్తాయి. మీరు ఏ దేశానికి వెళుతున్నారో ఆ దేశ కరెన్సీని ‘మీరు కోరినంత పరిమాణంతో’ ప్రస్తుత విదేశీ మారకపు విలువను లోడ్‌చేసి ట్రావెల్ కార్డ్‌ను అందజేస్తారు. అంటే ఇవి ప్రీ-పెయిడ్ కార్డులన్నమాట. విదేశీ ఏటీఎంల నుంచి ప్రత్యక్షంగా ఈ కార్డుల ద్వారా మీరు స్థానిక కరెన్సీని విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. షాపింగ్‌కు మర్చంట్ పాయింట్-ఆఫ్-సేల్ వద్ద కూడా ఈ కార్డును ప్రత్యక్షంగా వినియోగించుకోవచ్చు.
►ట్రావెలర్ చెక్కులకు ప్రజాదరణ రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యం- దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి నగదు కోల్పోయి ఇబ్బంది పడే అవకాశాలు తలెత్తకుండా చూసుకోవడం వంటి అంశాలకు ‘ట్రావెల్ కార్డ్’ ఒక చక్కని సమాధానం.
►ఒకసారి పర్యటన పూర్తయిన తర్వాత, ఖర్చుకాని డబ్బుకు సంబంధించి రిఫండ్ సైతం ఎంతో తేలిక. అవసరమైతే అదే కార్డును విదేశాల్లో మరో ట్రిప్‌కు కూడా వినియోగించుకునే సౌలభ్యం ఉంది.
►వివిధ దేశాల్లో ఒకేసారి సుదీర్ఘకాలం పర్యటించే సమయాలకు సంబంధించి ‘మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డు’కూడా అందుబాటులో ఉంటుంది.
►ఈ కార్డులకు భద్రతా పరమైన అంశాలు ప్రత్యేకమైనవి. బ్యాంకులు అందించే సెల్ఫ్-కేర్ పోర్టల్, నిరంతర ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ కస్టమర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. బ్యాలెన్స్ ఎంత ఉంది? ఒకవేళ కార్డును పోగొట్టుకుంటే... దానిని బ్లాక్‌చేసి, అందులో ఉన్న డబ్బును వేరొక కార్డు (రిప్లేస్‌మెంట్ కార్డ్)కు బదలాయించడం వంటి సౌలభ్యతలు ఇక్కడ లభిస్తాయి. ప్రైమరీ కార్డు సమయంలోనే అదనంగా మరో రిప్లేస్‌మెంట్ కార్డును అందజేయడం జరుగుతుంది.
►కార్డును మీరు వినియోగించినప్పుడల్లా... అందుకు సంబంధించిన సమాచారం ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్ అలర్ట్ రూపంలో ఈ అంశాన్ని తెలియజేస్తుంది. తద్వారా కార్డు వినియోగ సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. వేరొక వ్యక్తి సదరు కార్డు నంబర్ దుర్వినియోగానికే ఇక్కడ ఆస్కారం ఉండదు. ఇంకా చెప్పాలంటే... ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలతో కార్డులు ఇప్పుడు చిప్ అండ్ పిన్ టెక్నాలజీతో సైతం అందుబాటులోకి వస్తున్నాయి.
►విమాన ప్రమాదాల్లో మరణం, వీసా అలాగే పాస్‌పోర్ట్ వంటి ట్రావెల్ డాక్యుమెంట్లు పోగొట్టుకోవడంసహా పలు అంశాలకు సంబంధించి బీమా కవర్ ఆఫర్ కూడా లభ్యమవుతుండడం గమనార్హం.
►పర్యటనలో కరెన్సీ అయిపోతే... కార్డు హోల్డర్లు ఆన్‌లైన్‌లో మనీ-రీలోడ్ సౌలభ్యం కూడా ఉంది.
►రివార్డు పాయింట్లు, కొన్ని కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటి వినూత్న ప్రయోజనాలు కూడా కస్టమర్లకు ఒనగూరుతాయి.