
న్యూఢిల్లీ: వాణిజ్యం విషయంలో అమెరికాతో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ లైట్ తీసుకుంది. కృత్రిమ గడువులను భారత్ ఏర్పాటు చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు బ్యాలన్స్ ఆఫ్ ట్రేడ్‌కు సంబంధించి చేసినవని, ఈ విషయంలో అమెరికా ఆందోళలను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవనీష్‌కుమార్ గురువారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. భారత్‌కు అమెరికా ఆరో అతిపెద్ద చమురు సమీకరణ దేశంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, భారీ సంఖ్యలో పౌర విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అమెరికా భారత్‌కు వస్తు సేవల పరంగా అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉందని వివరించారు. ‘‘వాణిజ్య ఒప్పందానికి తొందరపడదలుచుకోలేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో క్లిష్టమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇందుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల ప్రభావం పౌరులు, దేశాల ఆర్థిక ప్రయోజనాలపై దీర్ఘకాలం పాటు ఉంటుంది’’ అని రవనీష్ కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment