న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరిగినప్పటికీ ఇటీవల పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు రేట్ల పెంపును కాస్తంత వాయిదా వేసుకున్నాయి. దీంతో వాటి మార్జిన్లపై ప్రభావం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కంపెనీలపై భారం పెరిగేలా చేసింది. ఈ పరిస్థితులను అధిగమించి, తమ మార్జిన్లను బలోపేతం చేసుకునేందుకు కంపెనీలు ధరల పెంపును చేపట్టాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పెంచగా, ప్యానాసోనిక్ ఇండియా 7 శాతం మేర తన ఉత్పత్తుల ధరలను పెంచనుంది. ‘‘గత కొన్ని నెలలుగా రూపాయి క్షీణిస్తూ రావడం వల్ల మా తయారీ వ్యయాలపై ప్రభావం పడింది. అయితే, చాలా వరకు మేం సర్దుబాటు చేసుకున్నాం. కానీ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల నుంచి 5–7 శాతం స్థాయిలో పెంచక తప్పడం లేదు’’ అని ప్యానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. పండుగల తర్వాత నుంచి తాము రేట్ల పెంపును చేపట్టినట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ సైతం తెలిపారు. కంపెనీల వార్షిక విక్రయాల్లో మూడింట ఒకవంతు దసరా, దీపావళి సమయంలోనే జరుగుతుంటాయి. సెప్టెం బర్‌లో 3–4% ధరలు పెంచినప్పటికీ అవి ఇంకా ఆచరణ రూపం దాల్చలేదని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. ఎంఆర్‌పీ పెంచినప్పటికీ డిమాండ్ తగ్గడం, మార్కెట్ వాటా కోసం బ్రాండ్ల మధ్య పోటీతో అమల్లోకి రాలేదని వివరించింది. తమ టెలివిజన్ల ధరలను పెంచే ఆలోచనేదీ లేదని సోనీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment