త్వరలో టీవీ9 వాటాలు విక్రయిస్తా | TV9 shares as soon as selling | Sakshi
Sakshi News home page

త్వరలో టీవీ9 వాటాలు విక్రయిస్తా

Published Fri, Aug 15 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

త్వరలో టీవీ9 వాటాలు విక్రయిస్తా

త్వరలో టీవీ9 వాటాలు విక్రయిస్తా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో న్యూస్ చానల్స్ కలిగిన టీవీ9లో ప్రమోటర్ల వాటా విక్రయ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ లావాదేవీపై వచ్చే నెలరోజుల్లో ఒక స్పష్టత వస్తుందని టీవీ9 వ్యవస్థాపక ప్రమోటర్లలో ఒకరైన శ్రీనిరాజు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ వాటాను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిపారు.  

టీవీ9 న్యూస్ చానల్స్‌ను కలిగి ఉన్న అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ(ఏబీసీ)లో శ్రీనిరాజుకు 60 శాతం వాటా ఉంది. వాటాల విక్రయానికి సంబంధించి రెండేళ్ల క్రితమే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ని నియమించడం జరిగిందని, కానీ ఆర్థిక మందగమనం వల్ల వాటాల విక్రయం పూర్తి చేయలేకపోయినట్లు శ్రీనిరాజు తెలిపారు.  ఆ సంస్థల పేర్లు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఏబీసీ కంపెనీ విలువ మదింపు ఇంకా పూర్తి కాలేదని, దీనిపై ఒక నెలరోజుల్లో స్పష్టత వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా రాజు తెలిపారు.

 ప్రధాన ఆదాయ వనరు అయిన తెలుగు టీవీ9  చానల్‌ను తెలంగాణ  రాష్ట్రంలో ప్రసారం కాకుండా ఎంఎస్‌వోలు అడ్డుకోవడం కంపెనీ విలువపై కొంత ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఏడు ప్రాంతీయ చానల్స్‌ను కలిగి ఉన్న టీవీ9 విలువను రూ. 400 కోట్లుగా మదింపు వేసినట్లు అంచనా.   ఇది కేవలం వాటాల విక్రయం మాత్రమేనని, ఒక ఇన్వెస్టర్ వైదొలగి అతని స్థానంలో మరో ఇన్వెస్టర్ రావడం తప్ప టీవీ9 ఉద్యోగుల్లో, యాజమాన్యంలో ఎటువంటి మార్పులు ఉండవని రాజు స్పష్టం చేశారు.

 ఇప్పటికే 15 శాతం వాటా అమ్మకం
 ఐల్యాబ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరుతో ఏబీసీ లిమిటెడ్‌లో 100 శాతం వాటాలు కలిగిన శ్రీనిరాజు చానల్ ప్రారంభమైన తర్వాత సీఈవోతో సహా ఇతర సహోద్యోగులకు 20% ప్రమోటర్ల వాటాను కేటాయించడం జరిగింది. మరో 20% వాటాను కొద్ది సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్ అనే వీసీ ఫండ్‌కి రూ. 51 కోట్లకు విక్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement