సాక్షి, హైదరాబాద్: టీవీ9 సంస్థను నిర్వహించిన ఐల్యాబ్స్ గ్రూప్‌ను ఓ కేసులో ఓడించాలనే ఉద్దేశంతో రవిప్రకాష్ అదే సంస్థలో పనిచేస్తున్న నటరాజన్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి కీలక సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ సంస్థకు పంపినట్టుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు టి.కృష్ణ ప్రసాద్ మే 6వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 406 ఐపీసీ, 66డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రవిప్రకాషే ఆ నటరాజన్ అని టెక్నికల్ సాక్ష్యాలతో నిర్ధారించారు. టీవీ9 ఆఫీస్‌లోని అతని కంప్యూటర్ నుంచే ఈ–మెయిల్ సృష్టించడంతోపాటు సమాచారం సైఫ్‌పార్టనర్స్‌కు పంపినట్టుగా తేల్చారు.
కేసు పూర్వాపరాలు..
ఐల్యాబ్స్ గ్రూప్ ప్రారంభించిన టీవీ9 సంస్థలో సైఫ్ పార్టనర్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో పొరపొచ్చాలు రావడంతోపాటు టీవీ9ను ఏబీసీఎల్ కంపెనీకి అమ్మేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరి 24న ఐల్యాబ్స్ గ్రూప్‌లో పనిచేస్తున్న నటరాజన్ అనే ఉద్యోగి పేరు మీదున్న ఈ–మెయిల్ ఐడీ నుంచి ఐల్యాబ్స్‌కు సంబంధించిన కీలక సమాచారం ఎన్సీఎల్టీ కేసులో ప్రత్యర్థిగా ఉన్న సైఫ్ పార్టనర్స్ ఎండీ రవి అదుసుమిల్లీకి చేరింది.సైఫ్ పార్టనర్స్ అధికారి వివేక్ మాతూర్, జనరల్ కౌన్సిల్ రామానుజ గోపాల్‌కు మెయిల్ వెళ్లింది. ఇదే సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ ఎన్సీఎల్టీ ముందు ఉంచింది. అయితే ఆ కాపీలను ఎన్సీఎల్టీలో న్యాయవాది ఎన్.లోమేశ్ కొరియర్ ద్వారా ఐల్యాబ్స్ గ్రూప్‌కు పంపారు.
నకిలీ ఉద్యోగిపై ఫిర్యాదు..
ఆ కాపీలను చూసి అవాక్కయిన ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు తమ కంపెనీలో నటరాజన్ పేరుతో ఏ ఉద్యోగీ లేడని, థర్డ్ పార్టీలతో కమ్యూనికేట్ చేసేందుకు ఎటువంటి జీ మెయిల్ ఉపయోగించమని పేర్కొంటూ ఏప్రిల్ 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్‌కు పంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుతో ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేశారు. టీవీ9 కార్యాలయంలో జరిగినట్టుగా గుర్తించి.. రవిప్రకాష్ కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా టెక్నికల్ డేటా అనాలాసిస్‌తో ఆ నటరాజన్ ఎవరో కాదు రవిప్రకాషే అని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment