TV 9 News Channel
-
టీవీ9 రవిప్రకాష్ ‘నట’రాజనే
సాక్షి, హైదరాబాద్: టీవీ9 సంస్థను నిర్వహించిన ఐల్యాబ్స్ గ్రూప్‌ను ఓ కేసులో ఓడించాలనే ఉద్దేశంతో రవిప్రకాష్ అదే సంస్థలో పనిచేస్తున్న నటరాజన్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి కీలక సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ సంస్థకు పంపినట్టుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు టి.కృష్ణ ప్రసాద్ మే 6వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 406 ఐపీసీ, 66డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రవిప్రకాషే ఆ నటరాజన్ అని టెక్నికల్ సాక్ష్యాలతో నిర్ధారించారు. టీవీ9 ఆఫీస్‌లోని అతని కంప్యూటర్ నుంచే ఈ–మెయిల్ సృష్టించడంతోపాటు సమాచారం సైఫ్‌పార్టనర్స్‌కు పంపినట్టుగా తేల్చారు. కేసు పూర్వాపరాలు.. ఐల్యాబ్స్ గ్రూప్ ప్రారంభించిన టీవీ9 సంస్థలో సైఫ్ పార్టనర్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో పొరపొచ్చాలు రావడంతోపాటు టీవీ9ను ఏబీసీఎల్ కంపెనీకి అమ్మేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరి 24న ఐల్యాబ్స్ గ్రూప్‌లో పనిచేస్తున్న నటరాజన్ అనే ఉద్యోగి పేరు మీదున్న ఈ–మెయిల్ ఐడీ నుంచి ఐల్యాబ్స్‌కు సంబంధించిన కీలక సమాచారం ఎన్సీఎల్టీ కేసులో ప్రత్యర్థిగా ఉన్న సైఫ్ పార్టనర్స్ ఎండీ రవి అదుసుమిల్లీకి చేరింది.సైఫ్ పార్టనర్స్ అధికారి వివేక్ మాతూర్, జనరల్ కౌన్సిల్ రామానుజ గోపాల్‌కు మెయిల్ వెళ్లింది. ఇదే సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ ఎన్సీఎల్టీ ముందు ఉంచింది. అయితే ఆ కాపీలను ఎన్సీఎల్టీలో న్యాయవాది ఎన్.లోమేశ్ కొరియర్ ద్వారా ఐల్యాబ్స్ గ్రూప్‌కు పంపారు. నకిలీ ఉద్యోగిపై ఫిర్యాదు.. ఆ కాపీలను చూసి అవాక్కయిన ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు తమ కంపెనీలో నటరాజన్ పేరుతో ఏ ఉద్యోగీ లేడని, థర్డ్ పార్టీలతో కమ్యూనికేట్ చేసేందుకు ఎటువంటి జీ మెయిల్ ఉపయోగించమని పేర్కొంటూ ఏప్రిల్ 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్‌కు పంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుతో ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేశారు. టీవీ9 కార్యాలయంలో జరిగినట్టుగా గుర్తించి.. రవిప్రకాష్ కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా టెక్నికల్ డేటా అనాలాసిస్‌తో ఆ నటరాజన్ ఎవరో కాదు రవిప్రకాషే అని తేల్చారు. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్: కోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: టీవీ9 నిధుల కుంభకోణంలో అరైస్టయిన రవిప్రకాష్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. టీవీ9 యాజమాన్యమైన అలందా మీడియా హౌజ్‌కు చెందిన రూ. 18 కోట్ల మొత్తాన్ని బోనస్ పేరుతో పక్కదారి పట్టించారన్న రవిప్రకాష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. రవిప్రకాష్ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్: కోర్టు విచారణ
-
రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్లో ఉన్న నిబంధనలను తొలగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పోలీసు స్టేషన్‌కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. టీవీ9 చానెల్లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవిప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా టీవీ9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు రూ. 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసును ఆయన ఎదుర్కొంటున్నారు. -
విచారణకు హాజరుకాని శివాజీ
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ గురువారం సైబరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. 11న విచారణకు హజరుకావాలంటూ పోలీసులు శివాజీకి నోటీసులిచ్చారు. దీని ప్రకారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట శివాజీ గురువారం విచారణకు హజరుకావాల్సి ఉంది. అయితే తన కుమారుడిని అమెరికాలో చదువులకు పంపడంలో నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని శివాజీ పోలీసులకు ఈమెయిల్ పంపారు. దీనికి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశానని తెలిపారు. అయితే మరోసారి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. -
ఎట్టకేలకు పట్టుబడ్డ శివాజీ
-
ఎట్టకేలకు పట్టుబడ్డ ‘గరుడ’ పక్షి
సాక్షి, హైదరాబాద్: అలందా మీడియా కేసులో నిందితుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు బుధవారం చిక్కాడు. గత 2 నెలల నుంచి అనారోగ్య కారణాలరీత్యా పోలీసుల విచారణకు రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన శివాజీని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న శివాజీ అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్‌ను బుక్ చేసుకొని బుధవారం తెల్లవారుజామున 6.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ దేశం విడిచి వెళ్లే అవకాశముందని లుకౌట్ నోటీసులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు జారీ చేయడంతో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకోగలిగారు. రజనీకాంత్ స్టైల్లో తయారైనా..! అయితే సినిమా ఫక్కీలో తన అసలు వేషధారణకు కాస్త భిన్నంగా.. శివాజీ సినిమాలో రజనీకాంత్ మాదిరిగా రెడీ అయ్యాడు. ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా ఎత్తుగడ పన్ని నా.. పాస్పోర్టుతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయాన్ని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే 160 సీఆర్పీసీ కింద అక్కడే నోటీసులివ్వాలనుకున్నా.. కొన్ని మార్పులు చేయాల్సి ఉండటంతో శివాజీని గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం దాదాపు 45 నిమిషాలపాటు శివాజీని అక్కడే ఉంచిన పోలీసులు మార్పులు చేసిన నోటీసును ఇచ్చి ఈ నెల 11న విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో అక్కడి నుంచి శివాజీ వెళ్లిపోయాడు. అయితే సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినా శివాజీ అమెరికా వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడనేది ఇప్పుడూ అనేక అనుమానాలను రెకెత్తిస్తోంది. కాగా టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్సీఎల్టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారని అలంద మీడియా ఫిర్యాదు చేయడంతో.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రవిప్రకాష్‌ను పలు పర్యాయాలు విచారించారు. -
శివాజీ పాస్‌పోర్ట్ సీజ్..
-
శివాజీ పాస్‌పోర్ట్ సీజ్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోటీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. చదవండి: పోలీసుల అదుపులో సినీనటుడు శివాజీ -
శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
పోలీసుల అదుపులో నటుడు శివాజీ
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో సినిమా నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్సీఎల్టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారు. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని..ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర పన్ని..పాత తేదీతో నకిలీ షేర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తితోపాటు డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు హరి, ఏబీసీఎల్ ఫైనాన్స్ అధికారి మూర్తి, మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను పోలీసులు గుర్తించారు. ఈ- మెయిళ్ల ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాష్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ..సైబర్ క్రైం పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానంతో వాటిని వెలికి తీశారు. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో రవిప్రకాశ్‌తో పాటు శివాజీపై గతంలో పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లేందుకు శివాజీ ప్రయత్నించడంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ...’దేశం పాటి వెళ్లాలని శివాజీ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నాం. శివాజీని అరెస్ట్ చేయము. కోర్టు ఆదేశాల మేరకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశాం. శివాజీని విచారణకు సహకరించాలని కోరాం. నోటీసులు ఆధారంగా ఆయనను విచారణ చేస్తాం.’ అని తెలిపారు. ఇప్పటికే శివాజీపై లుక్ఔట్ నోటీసులు ఉన్నాయి. శివాజీ అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి రాగా...ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. శివాజీకి మరోసారి నోటీసులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరోసారి నటుడు శివాజీకి నోటీసులు జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆయనను బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి...ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని శివాజీకి సూచించారు. నోటీసులు అందుకున్న అనంతరం ఆయన పీఎస్ నుంచి వెళ్లిపోయారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్
సాక్షి, న్యూఢిల్లీ : టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే, ఆయన ఇంతవరకు పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ భంగపాటు ఎదురైంది. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టు గుమ్మం తొక్కారు. మరోవైపు ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. -
రవిప్రకాశ్‌కు లొంగిపోయే ఆలోచన లేనట్లేనా?
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త వ్యవహారం వెలుగుచూడటం, అవన్నీ రవిప్రకాశ్‌కు ప్రతికూలంగా ఉండటం చూస్తుంటే.. ఈ కేసులో ఆయన రోజురోజుకూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. టీవీ9 యాజమాన్య మార్పు వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో నటుడు శివాజీ, మాజీ సీఈఓ రవిప్రకాశ్లకు చుక్కెదురైంది. దీంతో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలందా మీడియా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో రవిప్రకాశ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు తెలుస్తోంది. చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోతున్న క్రమంలో ఇకపై ఆయన ఏం చేస్తారనే అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. అలందాకు తొలగుతున్న అడ్డంకులు ఈ వ్యవహారంలో టీవీ9ని కొనుగోలు చేసిన కొత్త కంపెనీ అలందా మీడియా సంస్థకు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. తాజాగా ఎన్సీఎల్టీ తీర్పుతో ఈ ఎపిసోడ్లో శివాజీ పాత్ర ముగిసినట్లేనని టీవీ9 ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైనా టీవీ9 యాజమాన్య బదిలీ జరగకుండా శివాజీని అడ్డంపెట్టుకుని రవిప్రకాశ్ వేసిన ఎత్తుగడ ఎన్సీఎల్టీ వద్ద బోల్తా కొట్టిందంటున్నారు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న శివాజీ దొరకడమే మిగిలింది. మరో నిందితుడు టీవీ9 మాజీ సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనను పోలీసులుపలుమార్లు విచారించారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని పోలీసులు ఆదేశించారు. ఈయన తెలిపిన ఆధారాలతోనే ఈ–మెయిల్ సంభాషణలను పోలీసులు వెలికి తీయగలిగారని తెలిసింది. కానీ, మూర్తి, శివాజీ, రవిప్రకాశ్, న్యాయవాది శక్తి మధ్య జరిగిన ఈ–మెయిల్స్ వ్యవహారం.. ఎలా లీకైందన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. పోలీసులు మాత్రం తాము విడుదల చేయలేదని చెబుతున్నారు. లాయర్ శక్తి పాత్ర కీలకమే! ఈ కేసులో మరో కీలక నిందితుడు న్యాయవాది శక్తి. పాతతేదీలతో రవిప్రకాశ్‌పై ఎన్సీఎల్టీలో వేయాల్సి న వ్యాజ్యం డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలున్నాయి. అలందా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం న్యాయవాది శక్తి కూడా పత్తా లేకుండాపోయారు. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. దీనికితోడు రవిప్రకాశ్ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ స్టే ఇవ్వడం, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం వంటి పరిణామాలు చూస్తుంటే అలందా ముందున్న అడ్డంకులు తొలగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే ఆలోచన లేనట్లేనా? టీవీ9 మాతృసంస్థ అయిన ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీ జరగకుండా రవిప్రకాశ్ చాలా సుదీర్ఘమైన వ్యవహారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే, రవిప్రకాశ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, శివాజీ చేత వ్యాజ్యం వేయడం, టీవీ9 లోగోను మోజో టీవీ చైర్మన్ హరికిషన్కి విక్రయించడం తదితర పరిణామాలన్నీ చూస్తుంటే తమ చేతికి పగ్గాలివ్వకుండా రవిప్రకాశ్ చాలా భారీ స్కెచ్ వేశారని అలందా మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే.. పరారీలో ఉన్న రవిప్రకాశ్ అజ్ఞాతం వీడాలి. కానీ, జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో రవిప్రకాశ్ పోలీసులకు లొంగిపోయే ఆలోచనేదీ లేదని సమాచారం. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడమే ఇందుకు నిదర్శనమని న్యాయనిపుణులంటున్నారు. -
రెండోసారి విచారణకూ రవిప్రకాశ్ గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 వాటాల వ్యవహారంలో నకిలీ పత్రాల సృష్టి, సంతకం ఫోర్జరీ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ రెండో నోటీసుకు కూడా స్పందించకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.160 సీఆర్పీసీ కింద ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు రవిప్రకాశ్ హాజరు కాకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయసలహాను తీసుకుంటున్నారు. ఒకవేళ సోమవారం రవిప్రకాశ్ విచారణకు హాజరైతే ఓకే కానీ, లేనిపక్షంలో వారంట్ ద్వారా అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సోమవారం తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సీఆర్పీసీ 160 కింద శనివారం జారీ చేసిన నోటీసును బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటి గోడకు అంటించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు ఒక్కరోజులో హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్న ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు రవిప్రకాశ్ రాలేదు. అయితే, అలంద మీడియా సంస్థ డైరక్టర్ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏప్రిల్ 24, 30 తేదీల్లో రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన విషయాలపై 160 సీఆర్పీసీ కింద రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ, మాజీ సీఎఫ్ఓ మూర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటికి మూర్తి ఒక్కరే స్పందించి గత మూడ్రోజుల నుంచి పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీలు మాత్రం ఇంత వరకు హాజరుకాలేదు. అయితే రవిప్రకాశ్, శివాజీలు పది రోజుల గడువు కోరినప్పటికీ దర్యాప్తులో తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి అంత సమయం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫోర్జరీ కేసులో విచారణకు టీవీ9 మాజీ సీఎఫ్ఓ మూర్తి ఆదివారం మూడోరోజూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అతనితో పాటు హెచ్ఆర్, అడ్మిన్, అకౌంట్స్ వ్యవహారాలు చూస్తున్న ముగ్గురు కూడా పోలీసుల ఎదుట హాజరైనట్టు తెలిసింది. వీరిచ్చిన వివరాలతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోర్జరీ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎవరి కోసం చేశారు.. ఎలా చేశారు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా తెలుసుకునే దిశగా విచారణ చేస్తున్నారు. సైబర్ క్రైం డీసీపీ రోహిణీ ప్రియదర్శిని సారథ్యంలోని సైబర్ క్రైమ్ బృందం ఈ కేసు విచారణను పకడ్బందీగా చేస్తోంది. -
త్వరలో టీవీ9 వాటాలు విక్రయిస్తా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో న్యూస్ చానల్స్ కలిగిన టీవీ9లో ప్రమోటర్ల వాటా విక్రయ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ లావాదేవీపై వచ్చే నెలరోజుల్లో ఒక స్పష్టత వస్తుందని టీవీ9 వ్యవస్థాపక ప్రమోటర్లలో ఒకరైన శ్రీనిరాజు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ వాటాను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిపారు. టీవీ9 న్యూస్ చానల్స్‌ను కలిగి ఉన్న అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ(ఏబీసీ)లో శ్రీనిరాజుకు 60 శాతం వాటా ఉంది. వాటాల విక్రయానికి సంబంధించి రెండేళ్ల క్రితమే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని నియమించడం జరిగిందని, కానీ ఆర్థిక మందగమనం వల్ల వాటాల విక్రయం పూర్తి చేయలేకపోయినట్లు శ్రీనిరాజు తెలిపారు. ఆ సంస్థల పేర్లు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఏబీసీ కంపెనీ విలువ మదింపు ఇంకా పూర్తి కాలేదని, దీనిపై ఒక నెలరోజుల్లో స్పష్టత వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా రాజు తెలిపారు. ప్రధాన ఆదాయ వనరు అయిన తెలుగు టీవీ9 చానల్‌ను తెలంగాణ రాష్ట్రంలో ప్రసారం కాకుండా ఎంఎస్‌వోలు అడ్డుకోవడం కంపెనీ విలువపై కొంత ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఏడు ప్రాంతీయ చానల్స్‌ను కలిగి ఉన్న టీవీ9 విలువను రూ. 400 కోట్లుగా మదింపు వేసినట్లు అంచనా. ఇది కేవలం వాటాల విక్రయం మాత్రమేనని, ఒక ఇన్వెస్టర్ వైదొలగి అతని స్థానంలో మరో ఇన్వెస్టర్ రావడం తప్ప టీవీ9 ఉద్యోగుల్లో, యాజమాన్యంలో ఎటువంటి మార్పులు ఉండవని రాజు స్పష్టం చేశారు. ఇప్పటికే 15 శాతం వాటా అమ్మకం ఐల్యాబ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరుతో ఏబీసీ లిమిటెడ్‌లో 100 శాతం వాటాలు కలిగిన శ్రీనిరాజు చానల్ ప్రారంభమైన తర్వాత సీఈవోతో సహా ఇతర సహోద్యోగులకు 20% ప్రమోటర్ల వాటాను కేటాయించడం జరిగింది. మరో 20% వాటాను కొద్ది సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ అనే వీసీ ఫండ్‌కి రూ. 51 కోట్లకు విక్రయించారు.