టీవీఎస్ లాభం 30 శాతం అప్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 30 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-16) క్యూ4లో రూ.91 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.118 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,395 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.2,776 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
బైక్‌ల విక్రయాలు 2.21 లక్షల నుంచి 12 శాతం వృద్ధితో 2.47 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు1.66 లక్షల నుంచి 1.98 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 21,445 నుంచి 26,901కు పెరిగాయని తెలిపింది.
అమ్మకాలు 13 శాతం అప్...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సర పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.328 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధితో రూ.369 కోట్లకు. నికర అమ్మకాలు రూ.10,075 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.11,377 కోట్లకు పెరిగాయని పేర్కొంది. టూ వీలర్ల అమ్మకాలు 24.09 లక్షల నుంచి 7 శాతం వృద్ధితో 25.68 లక్షలకు పెరిగాయని వివరించింది. వీటిల్లో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 9.51 లక్షల నుంచి 10.71 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 7 లక్షల నుంచి 8.13 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 1.08 లక్షల నుంచి 1.11 లక్షలకు పెరిగాయని పేర్కొంది. కంపెనీ షేర్ మంగళవారం బీఎస్‌ఈలో 10% నష్టపోయి రూ.288 వద్ద ముగిసింది.