
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో రూ.147 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.130 కోట్లు)తో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని టీవీఎస్ మోటార్ తెలిపింది. వివిధ విభాగాల అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,457 కోట్ల నుంచి రూ.4,171 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.306 కోట్లకు, నిర్వహణ లాభ మార్జిన్ 1.2 శాతం పెరిగి 7.4 శాతానికి చేరాయని తెలిపింది.
ఎగుమతులు 52 శాతం అప్...
గత క్యూ1లో 7.85 లక్షలుగా ఉన్న మొత్తం టూవీలర్ల అమ్మకాలు ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో 8.93 లక్షలకు పెరిగాయని టీవీఎస్ మోటార్ తెలిపింది. బైక్‌ల అమ్మకాలు 17 శాతం, స్కూటర్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయని పేర్కొంది. మొత్తం ఎగుమతులు 52 శాతం వృద్ధి చెందాయని తెలిపింది. ఈ కంపెనీ స్కూటీ, జూపిటర్ బ్రాండ్ల స్కూటర్లను, అపాచీ, స్టార్ బ్రాండ్ మోటార్‌బైక్‌లను విక్రయిస్తోంది. నికర లాభం 13 శాతం పెరగడంతో బీఎస్‌ఈలో ఈ షేర్ లాభపడింది. ఇంట్రాడేలో 6 శాతం లాభంతో రూ.560కు ఎగసిన ఈ షేర్ చివరకు 4 శాతం లాభంతో రూ.549 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment