
ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంత కాలంగా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. సరికొత్త రికార్డులను ఛేదిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్ దూసుకుపోతున్నాయి. గత 28 నెలల్లో డీజిల్ ధరల పెంపు 50 శాతానికి పైగా అంటే 51.17 శాతం పెరిగినట్టు తెలిసింది. 2016 జనవరి 16న ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.44.18 ఉంటే, 2018 మే 17 అంటే నేటికి లీటరుకు రూ.66.79కు పెరిగినట్టు వెల్లడైంది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల డేటా ప్రకారం నేడు డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.66.79గా రికార్డు కాగ, కోల్‌కతాలో రూ.69.33గా, ముంబైలో రూ.71.12గా, చెన్నైలో రూ.70.49గా నమోదైనట్టు తెలిసింది. నేడు ఢిల్లీలో రికార్డైన ఈ డీజిల్ ధరలు ఆల్‌టైమ్ హై. అంటే ఈ మేర డీజిల్ ధరలు ఎప్పుడూ ఎగియలేదు. మరోవైపు ఢిల్లీలో పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ హైకు 1 శాతం మాత్రమే దూరంలో ఉంది. లీటరు పెట్రోల్ ధర నేడు ఢిల్లీలో రూ.75.32గా ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.78.01గా, ముంబైలో రూ.83.16గా, చెన్నైలో రూ.78.16గా రికార్డయ్యాయి. మొత్తంగా నేడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లీటరుకు 22-24 పైసలు ఎగిసినట్టు ఇండియన్ ఆయిల్ కంపెనీల డేటాలో తెలిసింది.
కాగ, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు రోజుల నుంచి మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. గురువారంతో కలిపి ఈ నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరు 69 నుంచి 73 పైసల మేర పెరిగాయి. డీజిల్ ధరలు కూడా 70 నుంచి 93 పైసలు ఎగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 2014 నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తుండటంతో, దేశీయంగా కూడా ఈ మేర ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. నేడు క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారల్‌కు 80 డాలర్లకు పైకి ఎగిశాయి. 2014 నవంబర్ తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. ఈ ప్రభావంతో కూడా దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment