
నెల రోజులు గడువివ్వండి
♦ ఆర్థిక ఫలితాల వెల్లడికి యూబీహెచ్‌ఎల్ అభ్యర్థన
♦ మాల్యాపై కేసులతో అనిశ్చితి ఉందంటూ వినతి
న్యూఢిల్లీ: యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్‌ఎల్) ఆర్థిక ఫలితాల వెల్లడికి నెల రోజుల గడువు కోరింది. చైర్మన్ విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు, డెట్ రికవరీ ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున 2015-16 ఆర్థిక ఫలితాల వెల్లడికి నెల రోజుల గడవు కావాలని అభ్యర్థించింది. ఈ మేరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు యూబీహెచ్‌ఎల్ సమాచారం అందించింది. సెబి రెగ్యులేషన్స్, 2015 ప్రకారం ఏ కంపెనీ అయినా ఆర్థిక సంవత్సరం ముగిసిన రెండు నెలల్లోగా ఆ సంవత్సర ఫలితాలను వెల్లడించాలి.
అసాధారణ పరిస్థితులున్నాయి...
తమ గ్రూప్ సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పలు బ్యాంక్‌లకు రుణాలు చెల్లించాల్సి ఉందని, ఈ విషయమై ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంక్‌ల కన్సార్షియానికి తమ చైర్మన్ విజయ్ మాల్యా ఒక సెటిల్‌మెంట్ ఆఫర్‌ను ఇచ్చారని యూబీహెచ్‌ఎల్ ఆ లేఖలో పేర్కొంది. ‘‘సంస్థ ఆస్తుల్లో కొన్ని విక్రయించడం ద్వారా ఈ ఆఫర్‌లో కొంత మొత్తాన్ని చెల్లిస్తాం. డీఆర్‌టీ తొలి విచారణ వచ్చే నెల 2న జరుగుతుంది. అందుకే ఆర్థిక ఫలితాల వెల్లడికి నెలరోజుల గడువు అడుగుతున్నాం’’ అని యూబీహెచ్‌ఎల్ వివరించింది.