లండన్: చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌కు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది. వావేకు చెందిన సేవలు, పరికరాలపై నిషేధం విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల నెట్‌వర్క్‌లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్‌వర్క్ టెక్నాలజీని అందించేందుకు వావే సంస్థ గత కొన్ని రోజులుగా వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో 5జీ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల కల్పనకై వావే అభివృద్ధి చేసిన పరికరాలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా చైనా అవలంబిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బ్రిటన్ జాతీయ భద్రత దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.(చైనాకు షాక్.. కెనడా కీలక నిర్ణయం)
ఈ విషయం గురించి టెలికాం మంత్రి ఒలివర్ డౌడెన్ మాట్లాడుతూ.. ‘‘ఇది కఠినమైన నిర్ణయమే. అయితే యూకే టెలికాం నెట్‌వర్క్‌లు, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. చైనా అవలంబిస్తున్న విధానాలను యూకే నిశితంగా గమనిస్తోంది. చైనాతో పరస్పర గౌరవం, పరిపక్వతతో కూడిన బంధాన్ని మాత్రమే మేం కోరుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన వావే టెక్నాలజీస్.. యూకే ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతీ బ్రిటన్ పౌరుడికి ఇది నిజంగా చేదు వార్త అని.. ఇప్పటికే పనులు ప్రారంభించినందు వల్ల యూకే ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తాము ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. (వావేపై ఆరోపణలు - అమెరికా కీలక ముందడుగు)
అమెరికా ఒత్తిడి కారణంగానేనా?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, యూకే సహా ఇతర పశ్చిమ దేశాలు కరోనా విలయంతో అల్లాడుతున్న క్రమంలో అగ్రరాజ్యం- డ్రాగన్‌ల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదిరింది. అంతేగాక హాంకాంగ్‌లో చైనా ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టం కారణంగా స్వేచ్చా వాణిజ్యానికి వీల్లేకుండా పోవడంతో డ్రాగన్‌పై కఠిన వైఖరి అవలంబించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉండగా.. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం.. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని ఈ ఏడాది మేలో కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అభివర్ణిస్తూ.. చైనా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని మరోసారి ఆరోపణలు గుప్పించింది. అంతేగాక ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు గనుక వావే వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. కాబట్టి వావేపై ఆంక్షలు విధించాలని సూచించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడితోనే తాజాగా బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా యాప్‌లపై నిషేధం విధించే దిశగా అమెరికా కఠిన చర్యలకు సిద్ధమైన నేపథ్యంలో.. వైట్‌హౌజ్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ బుధవారం పారిస్‌లో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ దేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లతో భేటీ కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment