Huawei Technologies
-
‘అన్ని ఉద్యోగాలు నాన్ లోకల్స్‌కేనా..? మా పరిస్థితి ఏంటి..!’ చైనా కంపెనీకి భారీ షాక్..!
ప్రముఖ చైనీస్ దిగ్గజ కంపెనీ హువావేకు దక్షిణాఫ్రికా గట్టి షాక్‌ను ఇచ్చింది. ఉద్యోగాల విషయంలో హువావేను కోర్టుకు లాగింది. స్థానికులను నియమించుకోవడంలో హువావే నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు పూర్తిగా నాన్ లోకల్స్‌కే..! చైనీస్ కంపెనీ హువావే దక్షిణాఫ్రికాలో నాన్ లోకల్స్‌కు ఎక్కువ ఉద్యోగాలను ఇస్తున్నట్లు ఆ దేశ లేబర్ డిపార్ట్మెంట్ నిర్ధారించింది. ఈ విషయంలో హువావే టెక్నాలజీస్‌కు చెందిన స్థానిక యూనిట్‌కు జరిమానా విధించాలని, అంతేకాకుండా కంపెనీ పద్దతులను మార్చుకోవాలని దక్షిణాఫ్రికా కార్మికశాఖ అక్కడి కోర్టును కోరింది. హువావేలో స్థానికంగా దాదాపు 90 శాతం మంది విదేశీ పౌరులు పనిచేస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది. ఉద్యోగుల నియామకంలో హువావే నిబంధనలను అసలు పట్టించుకోవడం లేదంటూ కార్మిక శాఖ ఆరోపించింది. భారీ జరిమానా..! నిబంధనలను ఉల్లఘించినందుకుగాను హువావేపై వార్షిక టర్నోవర్‌లో 2 శాతం జరిమానా విధించాలని దక్షిణాఫ్రికా కార్మిక శాఖ కోర్టును కోరింది. దీంతో హువావే సుమారు 1.5 మిలియన్ డాలర్స్‌ను చెల్లించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా జోహన్నెస్‌బర్గ్‌లోని హువావే ఫ్యాక్టరీలోని పరిస్థితులు, ఉద్యోగుల అక్రమ రవాణా వంటి విషయాలపై చైనా సంస్థపై కార్మిక శాఖ విరుచుకుపడింది. కాగా ఈ ఆరోపణలను హువావే ఖండించింది. నిబంధనలను పాటిస్తూనే ఉద్యోగుల నియమాకం జరుపుతున్నామని పేర్కొంది. చదవండి: ఎలన్‌మస్క్‌కు గట్టిపోటీ..! దూకుడు పెంచిన ఎయిర్టెల్..! -
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ‘హువావే’ అంటారు. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్, సైడ్–టచ్ ఫీచర్లుకు సంబంధించిన మోడల్ కోసం పేటెంట్ ఫైల్ చేసింది హువావే. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డింగ్ ఫోన్‌ని ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్‌తో రూపొందించారు. ఈ నేపథ్యంలో ‘హువావే’ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్ ద్వారా ఎక్స్ట్రాస్క్రీన్ కలిసొస్తుంది. రకరకాల ఐకాన్ల కోసం, సింగిల్ లైన్ మెసేజ్‌లు చదువుకోవడం కోసం ఉపయోగపడుతుంది. -
హువావేకు మరో దెబ్బ
వాషింగ్టన్: చైనా టెలీకమ్యూనికేషన్స్ దిగ్గజం హువావేకు అమెరికాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశ కార్యకలాపాలపై నిఘా పెడుతోందంటూ చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్ సంస్థపై ఇప్పటికే పలు ఆంక్షలను విధించిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హువావేకి అనుబంధంగా 21 దేశాల్లో పనిచేస్తున్న మరో 38 సంస్థలపై ఆంక్షలను విధించింది. అమెరికన్ చట్టాన్ని అధిగమించకుండా నిరోధించేందుకు వీటిని బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. అమెరికా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ లేదా టెక్నాలజీతో అభివృద్ధి చేసిన లేదా ఉత్పత్తి చేసిన, విదేశీ సంస్థల చిప్‌లతో సహా ప్రత్యేక లైసెన్స్ లేకుండా సెమీకండక్టర్లను పొందకుండా నిరోధించే లక్ష్యంతో ఈ ఆంక్షలు విధించింది. ఈ చర్యలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారెన్-ప్రొడ్యూస్డ్ డైరెక్ట్ ప్రొడక్ట్ (ఎఫ్‌డిపి) నిబంధనలను సవరించింది. దీంతో మొత్తం సంస్థల సంఖ్య 152 కి చేరింది. (అలీబాబాకు ట్రంప్ సెగ) చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన విధాన లక్ష్యాలను నెరవేర్చడానికి అమెరికా సాఫ్ట్వేర్ , టెక్నాలజీ నుండి అభివృద్ధి లేదా ఉత్పత్తి చేసిన అధునాతన సెమీకండక్టర్లను పొందటానికి హువావే, దాని విదేశీ అనుబంధ సంస్థలు తమ ప్రయత్నాలను విస్తరించాయని వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ ఆరోపించారు జాతీయ భద్రతను , విదేశాంగ విధాన ప్రయోజనాలను బలహీనం చేసేలా థర్డ్ పార్టీల ద్వారా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభావిత కంపెనీలు, వ్యక్తులకు ప్రధానంగా హువావే కస్టమర్లకు పరికరాలు, సాఫ్ట్వేర్, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను గుర్తించి మార్చుకోవడానికి, వారి కార్యకలాపాలను విండ్-డౌన్ చేయడానికి తాము తగినంత సమయాన్ని ఇచ్చామని , ఇపుడు ఆ సమయం ముగిసిందని విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో ఒక ప్రత్యేక ప్రకటనలో వెల్లడించారు. కాగా 2019లో హువావేపై భారీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల హువావే టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్ సీసీ) యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి నిషేధించింది. చైనా మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలతో ఈ రెండు కంపెనీలకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆంక్షల నుండి తప్పించుకోవడానికి ఇరాన్‌కు సహాయం, ఇతర ఆరోపణలతో హువావేపై న్యాయ శాఖ అభియోగాలు మోపింది. -
చైనా కంపెనీపై యూకే నిషేధం.. అందుకేనా?
లండన్: చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌కు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది. వావేకు చెందిన సేవలు, పరికరాలపై నిషేధం విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల నెట్‌వర్క్‌లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్వర్క్ టెక్నాలజీని అందించేందుకు వావే సంస్థ గత కొన్ని రోజులుగా వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాల కల్పనకై వావే అభివృద్ధి చేసిన పరికరాలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా చైనా అవలంబిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బ్రిటన్ జాతీయ భద్రత దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.(చైనాకు షాక్.. కెనడా కీలక నిర్ణయం) ఈ విషయం గురించి టెలికాం మంత్రి ఒలివర్ డౌడెన్ మాట్లాడుతూ.. ‘‘ఇది కఠినమైన నిర్ణయమే. అయితే యూకే టెలికాం నెట్‌వర్క్‌లు, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. చైనా అవలంబిస్తున్న విధానాలను యూకే నిశితంగా గమనిస్తోంది. చైనాతో పరస్పర గౌరవం, పరిపక్వతతో కూడిన బంధాన్ని మాత్రమే మేం కోరుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన వావే టెక్నాలజీస్.. యూకే ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతీ బ్రిటన్ పౌరుడికి ఇది నిజంగా చేదు వార్త అని.. ఇప్పటికే పనులు ప్రారంభించినందు వల్ల యూకే ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తాము ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. (వావేపై ఆరోపణలు - అమెరికా కీలక ముందడుగు) అమెరికా ఒత్తిడి కారణంగానేనా? కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, యూకే సహా ఇతర పశ్చిమ దేశాలు కరోనా విలయంతో అల్లాడుతున్న క్రమంలో అగ్రరాజ్యం- డ్రాగన్ల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదిరింది. అంతేగాక హాంకాంగ్‌లో చైనా ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టం కారణంగా స్వేచ్చా వాణిజ్యానికి వీల్లేకుండా పోవడంతో డ్రాగన్‌పై కఠిన వైఖరి అవలంబించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉండగా.. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం.. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని ఈ ఏడాది మేలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అభివర్ణిస్తూ.. చైనా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని మరోసారి ఆరోపణలు గుప్పించింది. అంతేగాక ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు గనుక వావే వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. కాబట్టి వావేపై ఆంక్షలు విధించాలని సూచించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడితోనే తాజాగా బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా యాప్‌లపై నిషేధం విధించే దిశగా అమెరికా కఠిన చర్యలకు సిద్ధమైన నేపథ్యంలో.. వైట్‌హౌజ్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ బుధవారం పారిస్‌లో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ దేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లతో భేటీ కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది. -
చైనాకు షాక్.. కెనడా కీలక నిర్ణయం
ఒట్టావా: పరస్పర ప్రతివిమర్శలతో కెనడా, చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో హంకాంగ్‌పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా కెనడా ‘అప్పగింత ఒప్పందాన్ని’ రద్దు చేసింది. అలాగే మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం-రెండు విధానాలు’ అన్న పద్దతిని తాము పాటిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హంకాంగ్‌కు మిలిటరీ వస్తువుల ఎగుమతిని రద్దు చేస్తూ.. కెనడా నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మిలిటరీ వస్తువులు చైనా ప్రధాన భూభాగం కోసం వినియోగించబడుతున్నట్లు కెనడా అనుమానిస్తోంది. అందువల్లే మా విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత అంశంలో ఇది ఎంతో ముఖ్యమైన నిర్ణయం’ అన్నారు ట్రూడో. అయితే ‘అప్పగింత ఒప్పందాన్ని’ రద్దు చేయడంపై హాంకాంగ్ అధికారులు నిరాశ వ్యక్తం చేశారు. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా') కెనడా, చైనా మధ్య సంబంధాల విషయంలో గత కొంతకాలంగా ఉద్రిక్తలు నెలకొన్నాయి. చైనీస్ టెలికాం దిగ్గజం వావే టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫే కుమార్తె, సంస్థ సీఎఫ్ఓ మెంగ్ వాంఝూను ఓ కేసులో అనుమానితురాలిగా పేర్కొంటూ అమెరికా ఆమెపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో వావే అనుమానాస్పద ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందని అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో కెనడాలో తలదాచుకున్న మెంగ్ వాంఝాని అమెరికా అభ్యర్థనపై కెనడా పోలీసులు 2018 డిసెంబరులో అరెస్టు చేశారు. అదే సమయంలో గూఢచర్యం ఆరోపణలపై కెనాడకు చెందిన మైఖేల్ కోవ్రీ, మాజీ దౌత్యవేత్త, వ్యాపారవేత్త మైఖేల్ స్పావర్లను చైనా అరెస్టు చేసింది. వారికి కనీసం దౌత్యపరమైన సాయం పొందేందుకు కూడా చైనా అనుమతించడం లేదు. ఫలితంగా ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ప్రకటన చేశారు. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!) అయితే మెంగ్ వాంఝాని విడిచిపెడితే.. కెనడా పౌరులను విడదుల చేస్తానని చైనా వెల్లడించింది. ఈ అంశంలో ప్రధాని మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. కానీ ట్రూడో మాత్రం ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. చైనా షరతుకు అంగీకరించి.. మెంగ్ వాంఝాను విడిచిపెడితే.. ఇక భవిష్యత్తులో ఏ కెనడా పౌరుడికి కూడా రక్షణ కల్పించలేమని ఆయన అన్నారు. ఇప్పుడు చైనా షరతుకు తలవంచితే.. రానున్న రోజుల్లో కూడా అది ఇలానే ప్రవర్తిస్తుందని ట్రూడో అభిప్రాయపడుతున్నారు. చైనా ఖైదీల విడుదల ప్రక్రియ ఆ దేశ తాకట్టు దౌత్యవిధానాలకు అద్దం పడుతుందని ట్రూడో విమర్శించారు. -
మరో రెండు చైనా కంపెనీలు బ్యాన్..
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధిస్తూ భారత్ డిజిటల్ స్ట్రయిక్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా కూడా డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన వావే టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ) యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి నిషేధించింది. ‘ఈ రెండు కంపెనీలకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, చైనా మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలతో సంబంధాలున్నాయి. ఆ దేశ ఇంటలిజెన్స్ సర్వీసులకు సహకరించడానికి ఇవి చైనీస్ చట్టాలకు లోబడి పనిచేస్తాయి. ఇవి రెండు చైనా ఇంటెలిజెన్స్ విభాగంకు సహకరిస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి’ అని ఎఫ్‌సీసీ చైర్పర్సన్ అజిత్‌పాయ్ తెలిపారు. ఈ క్రమంలో ఈ రెండింటితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని అగ్రరాజ్యం పేర్కొంది. వావే, జెడ్‌టీఈలను నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిత్ర దేశమైన భారతదేశంపై కూడా ఈ విషయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్) ఈ రెండు కంపెనీలపై భారత్ నిషేధం విధిస్తే... ఇక సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో భారతదేశం 59 చైనీస్ యాప్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పడు ఈ రెండు కంపెనీలపై కూడా నిషేధం విధిస్తే భారత టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకోవచ్చు. వావే ఎంతో కాలంగా దేశీయ టెలికాం కంపెనీలకు తక్కువ ధరకు పరికరాలను సరఫరా చేస్తున్నాయి. 5 జీ స్పెక్ట్రమ్‌ను దేశంలో అభివృద్ధి చేయాలని అనుకుంటున్న క్రమంలో ఈ కంపెనీల పై నిషేధం విధిస్తే ఈ వ్యయం పెరిగే అవకాశం ఉంది. దేశంలో 4జీ సేవలను ప్రారంభించినప్పుడు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ వంటి సంస్థలకు చైనాకు చెందిన ఈ కంపెనీలే పరికరాలను సరఫరా చేశాయి. వావే భారతదేశంలోని మొత్తం టెలికం పరికరాల మార్కెట్లో దాదాపు 25 శాతం కలిగి ఉంది. భారతి ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌ల కోసం వావేతో సహా 30 శాతం వరకు చైనా టెలికాం పరికరాలను ఉపయోగిస్తుండగా, వోడాఫోన్ ఐడియా 40 శాతం ఉపయోగిస్తుంది. టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత ఏడాది డిసెంబర్లో వావేకు దేశంలో 5జీ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతినిచ్చారు. (పేట్రేగిన చైనా హ్యాకర్లు) (వావేపై ఆరోపణలు - అమెరికా కీలక ముందడుగు) జూన్ 15 రాత్రి భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలా అని సమాలోచనలు జరుపుతున్న భారత్ చివరకు డ్రాగన్‌కు గట్టి షాకిస్తూ డిజిటల్ స్ట్రయిక్ ప్రకటించింది. (నిషేధంతో చైనా గుబులు) -
ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!
ఒట్టావా: చైనీస్ టెలికాం దిగ్గజం వావే టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫే కుమార్తె, సంస్థ సీఎఫ్ఓ మెంగ్ వాంఝూకు కెనడా కోర్టులో చుక్కెదురైంది. ఆమెను తమకు అప్పగించాలంటూ అగ్రరాజ్యం అమెరికా వేసిన కేసులో తదుపరి విచారణకు అనుమతినిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించిన ఒట్టావాలోని చైనా రాయబార కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వావే సహా ఇతర చైనా దిగ్గజ కంపెనీలను దెబ్బతీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నంలో, కెనడా అగ్రరాజ్యానికి సహాయం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెంగ్‌ను వెంటనే విడుదల చేసి, సురక్షితంగా చైనాకు పంపించాలని హెచ్చరించింది. ఇప్పటికైనా తప్పుదిద్దుకుని, సరైన మార్గంలో నడవాలని హితవు పలికింది. తాజా పరిణామాలతో చైనా- కెనడా దౌత్య సంబంధాలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. 2018లో అరెస్టు ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వావే అనుమానాస్పద ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందన్న అమెరికా ఆరోపణల నేపథ్యంలో సంస్థ సీఎఫ్ఓ మెంగ్‌ను 2018లో వాంకోవర్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్‌లోని ఓ షెల్ కంపెనీని అడ్డుపెట్టుకుని ఇరాన్‌కు పరికరాలను అమ్మేందుకు వావే ప్రయత్నించిందని, తద్వారా అమెరికా నిబంధనలు ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. ఈ మేరకు మెంగ్ హెచ్ఎస్బీసీని తప్పుదోవ పట్టించి ఇరాన్‌తో లావాదేవీలు కొనసాగించారని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఆమెను తమకు అప్పగించాల్సిందిగా అమెరికా కెనడాను కోరింది. (హువావేపై ఆరోపణలు - అమెరికా కీలక ముందడుగు) అప్పగింత ప్రక్రియలో ముందుకు సాగవచ్చు ఈ నేపథ్యంలో మెంగ్ కేసు బుధవారం విచారణకు రాగా, ఆమె నేరంలో భాగస్వామ్యురాలిగా ఉన్నందున, అప్పగింత ప్రక్రియలో ముందుకు సాగవచ్చని అసోసియేట్ చీఫ్ జస్టిస్ హెదర్ హోమ్స్ వెల్లడించారు. ‘‘మెంగ్‌పై వచ్చిన ఆరోపణలు అతి తీవ్రమైనవి.. అప్పగింత విషయంలో అడ్డుచెప్పే సామర్థ్యాన్ని తగ్గించాయి. మోసం, ఆర్థిక నేరారోపణలు మోపబడిన కారణంగా తదుపరి చర్యలకు ఉపక్రమించే వీలుంది’’ అని తెలిపారు. అయితే ఈ కేసు కేవలం ఇరాన్‌పై అమెరికా ఆంక్షలకు సంబంధించి మాత్రమేనని, నిజానికి ఇందులో ఫ్రాడ్ ఏమీ లేదన్న మెంగ్ తరఫు న్యాయవాది వాదనలను జడ్జి ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఇరాన్‌పై కెనడా ఎటువంటి ఆర్థిక పరమైన ఆంక్షలు విధించలేదన్న మాట వాస్తమని, అయితే అదే సమయంలో అమెరికా ఆంక్షలు కెనడా ప్రాథమిక విలువలకు ఏమాత్రం విరుద్ధంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జూన్ 3న మరోసారి కోర్టులో వాదనలు వినిపించేందుకు మెంగ్ లీగల్ టీం సన్నద్ధమవుతోంది. ఇలావుండగా, ఇటీవల వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వావే సంస్థ కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసే వస్తువులను వావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. తద్వారా హువావేకు చెక్ పెట్టే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో డ్రాగన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా.. వాణిజ్య పరంగానూ యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. -
5 జీ నెట్వర్క్ : అమెరికా కీలక ముందడుగు
వాషింగ్టన్: జాతీయ భద్రత, 5 జీ నెట్వర్క్ సమగ్రత రక్షణ అంశంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసింది. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. అమెరికా పౌరుల గోప్యత, ప్రపంచ వ్యాప్తంగా 5జీ నెట్వర్క్ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసేందుకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ ఆ చర్యలను తామెంతమాత్రం సహించబోమని హెచ్చరించింది ఆ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. (2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు). ఇక వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అమెరికా అభివర్ణించింది. చైనా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించింది. అమెరికాలో వావే గూఢచర్యం చేస్తోందని ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ సంస్థపై నేరారోపణలు చేసింది. అదే విధంగా ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు కుదర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వావే నమ్మదగిన వ్యాపార సంస్థ కాదని పేర్కొంది. ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు గనుక వావే సంస్థ వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. కాబట్టి వావేపై ఆంక్షలు విధించాలని సూచించింది. (5జీ టెక్నాలజీతో కొత్త తరం కార్లు) ఇక తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికా సాంకేతికతను వావే దుర్వినియోగం చేసే వీలు లేకుండా పోతుందని, తద్వారా తమ జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని అమెరికా పేర్కొంది. అంతేగాక అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వావే సంస్థ కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసే వస్తువులను వావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. జాతీయ భద్రత, అంతర్జాతీయ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు హువావేకు ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.(ఎవరెస్ట్ పర్వతంపైనా 5జీ సిగ్నల్) కాగా, మొబైల్ ఫోన్ల నెట్‌వర్క్‌లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్వర్క్ టెక్నాలజీని అందించేందుకు వావే సంస్థ వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వావే టెక్నాలజీ కారణంగా దేశ భద్రత పరంగా ముప్పు కలిగించేలా ఉందంటూ వావేపై అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో 5 జీ సేవలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశ టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో గతేడాది జూన్‌లో వావే ఒప్పందం కుదుర్చుకుంది. -
ఆ టెక్ కంపెనీ ఉద్యోగులకు బోనస్ బొనాంజా
బీజింగ్: చైనా టెలికాం దిగ్గజం హువావే టెక్నాలజీస్ కంపెనీ ఉద్యోగులు భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికా హువావే కంపెనీల ఉత్పత్తులు, చైనా వాణిజ్య బ్లాక్‌లిస్టింగ్‌ను దీటుగా ఎదుర్కొనేలా సహాయపడిన సిబ్బందికి 2 బిలియన్ యువాన్ల (286 మిలియన్ డాలర్లు) నగదు రివార్డులను అందజేస్తామని మంగళవారం తెలిపింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(పరిశోధన, అభివృద్ధి) టీమ్‌లకు ఈ నగదు బహుమతులను అందించనుంది. ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం పరికరాల ప్రొవైడర్, అమెరికాలో హార్డ్‌వేర్ ఉత్పత్తుల వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మే నెలలో అమెరికన్ సంస్థలతో వ్యాపారం చేయకుండా నిషేధించిన అనంతరం చైనా కంపెనీ ఉద్యోగులకు ఈ నగదు బోనస్‌లను ఇచ్చేందుకనిర్ణయించింది. యుఎస్ ఒత్తిడి నేపథ్యంలో ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపుగా ఇది వుంటుందని హువావే మానవ వనరుల విభాగం కంపెనీ సిబ్బందికి ఇచ్చిన నోటీసులో తెలిపింది. తద్వారా దాదాపు 1,90,000 మంది కార్మికులకు ఈ నెలలో ఇది రెట్టింపు వేతనం ఇస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా అమెరికా నిషేధం విధించడంతో ప్రత్నామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది కంపెనీకి చెందిన 5జీ నెట్‌వర్కింగ్‌కు సంబంధించి పరికరాలు భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ హువావే ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
అమెరికాకు వావే షాక్!
బీజింగ్ : అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా సమాధానం చెప్పిన చైనా మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ వావే కీలక విషయాన్ని ప్రకటించింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొందరలోనే లాంచ్ చేయనున్నామని గురువారం ప్రకటించింది. మమ్మల్ని తక్కువగా అంచని వేయొద్దని ప్రకటించిన వావే ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా ‘హాంగ్‌మెంగ్’ పేరుతో కొత్త ఓఎస్‌ను లాంచ్ చేయనుంది. తద్వారా అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్‌కు పెద్ద షాక్ ఇస్తోంది. వావే ‘హాంగ్‌మెంగ్’ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో గ్లోబల్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని వావే తెలిపింది. ఈ మేరకు వావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియమ్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాంగ్‌మెంగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే చైనాలో మిలియన్‌కు పైగా స్మార్ట్ఫోన్లలో అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ట్రేడ్‌మార్క్‌ను సాధించనున్నామంటూ ధృవీకరించారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వావేను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, సంస్థ వ్యాపార లావాదేవీలను నిషేధించారు. శత్రు దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్‌వర్క్‌కు ప్రమాదం పొంచి ఉందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా చైనాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద టెలికం కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ వావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వావేకు అమెరికాలో కార్యకాలాపాల కొనసాగింపు కోసమంటూ అమెరికా వాణిజ్య శాఖ 90 రోజుల తాత్కాలిక లైసెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ వావేతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఫేస్బుక్ కూడా ఇదే బాటలో పయనించింది. ప్రస్తుతం అమెరికా కంపెనీలైన గూగుల్, ఆపిల్ కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్‌ను ఏలుతున్న సంగతి తెలిసిందే. హువావే 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. తాజా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో పాటు గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చినట్టేనని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
హువావే దూకుడు : 8కే 5జీ స్మార్ట్ టీవీలు
చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ హువావే స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెరికా దిగ్గజం యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా అవతరించిన హువావే ప్రపంచంలోనే తొలి 5జీ సపోర్ట్ టీవీని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. హువావే అదిరిపోయే స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకు రానుందని నికాయ్ ఏషియన్ రివ్యూ నివేదించింది. 5జీ సపోర్ట్ ఫీచర్‌తో 8కే స్మార్ట్ టీవీని త్వరలోనే ఆవిష్కరించనుంది. దీని ప్రకారం కంపెనీ తన మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ల మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్‌ను అమర్చనుంది. ఈ అంచనాలు నిజమైతే 5జీ, హైఎండ్ రిజల్యూషన్ డిస్ప్లే, గిగాబిట్ సామర్థ్యంతో వైర్లెస్ స్టాండర్ట్ కేపబుల్ టీవీని ఆవిష్కరించిన కంపెనీగా హువావే చర్రిత సృష్టించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురు కానుంది. కాగా ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటైన హువావే అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం వృద్దిని సాధించి యాపిల్‌ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. -
హువావే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019 లోటెక్ దిగ్గజాలు అద్భుతమైన స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా 5జీ, ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై దృష్టిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా మొబైల్స్ తయారీదారు హువావే తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్ ను పరిచయం చేసింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న ప్రదర్శనలో ఫోల్డబుల్ ఫోన్ ‘మేట్ ఎక్స్ ’ను హువావే లాంచ్ చేసింది. 6.6 ఇంచుల డిస్ప్లేను ముందు భాగంలో, 6.38 ఇంచుల డిస్ ప్లేను వెనుక భాగంలో అమర్చారు. ఈ రెండింటినీ మడత తీసినప్పుడు 8 అంగుళాల డిస్ప్లేతో బిగ్ ట్యాబ్‌లా ఉంటుంది. 5జీ సపోర్టు, ఫింగర్ ప్రింట్ సెన్సార్. ట్రిపుల్ రియర కెమెరా, ఎన్ఎం కార్డు స్లాట్ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు 55 వాట్ల సూపర్ చార్జ్ ఫీచర్‌తో ప్రపంచంలో ఈ ఫీచర్ తో వచ్చిన ఫోన్ ఇదేనని హువావే వెల్లడించింది. అలాగే తమ పవర్ ఫుల్ ప్రాససర్ కారణంగా 1 గిగా బైట్ మూవీని కేవలం మూడు సెకన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ధర : ఈ ఫోన్ ధరను 2607 డాలర్లు (దాదాపుగా రూ.1,85,220) గా నిర్ణయించారు. 2019 మధ్య నాటికి అందుబాటులోకి రానుంది. మరోవైపు ఇటీవల లాంచ్ చేసిన శాంసంగ్ ఫోల్డబుల్ డివైస్ శాంసంగ్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌కు గట్టిపోటీ ఇస్తుందని అంచనా. హువావే మేట్ ఎక్స్ ఫీచర్లు 6.6 ఇంచ్ ఓలెడ్ డిస్ప్లే 2480 x 1148 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 6.38 ఇంచ్ సెకండరీ ఓలెడ్ డిస్ప్లే 2480 x 892 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై హువావే కైరిన్ 980 ప్రాసెసర్ 5జీ/8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 512 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 40 +16 + 8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలు 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 55 వాట్ల సూపర్ చార్జ్. -
హానర్ కొత్త ఫోన్.. ‘వ్యూ20’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ దిగ్గజం హువావే.. ‘హానర్’ బ్రాండ్‌లో ‘వ్యూ20’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. హైఎండ్ పోర్టిఫోలియోలో భాగంగా 6జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత మెమోరీ సామర్థ్యం కలిగిన ఈ హ్యండ్‌సెట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.37,999గా నిర్ణయించింది. ఈ సందర్భంగా హువావే వైస్ ప్రెసిడెంట్ అలెన్ వాంగ్ మాట్లాడుతూ.. భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరాల మేరకు ఈ మొబైల్‌ను విడుదలచేశామని, వినియోగదారుల అంచనాలను అందుకోగలదన్నారు. -
కనీసం 30 సంవత్సరాల జైలు తప్పదట?
ఇటీవల కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసిన హువావే సీఎఫ్‌వో మెంగ్ వాంఝూకు జైలు శిక్ష భారీగానే పడే అవకాశం ఉందట. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా అమెరికా వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఆమెకు గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. హువాయ్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫేకుమార్తె అయిన మెంగ్, సంస్థ అనుబంధ సంస్థ స్కై క్యామ్ ఇరాన్లో వ్యాపారం చేయడానికి అనుమతినిచ్చింది, తద్వారా అమెరికా ఆంక్షలు ఉల్లంఘించిందనీ టెక్‌క్రంచ్ నివేదించింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా , ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టేలా చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలపై హువావేకు అనేక హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో కెనడా కోర్టు అనుమతితో అమెరికాకు తరలిస్తే ఈ కేసులో మెంగ్‌కు కనీసం 30సంవత్సరాల కారాగార శిక్ష తప్పదని వ్యాఖ్యానించింది. చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీన అరెస్ట్ చేసింది. దీనిపై స్పందించిన విదేశీ వ్యవహారాల చైనీస్ మంత్రిత్వ శాఖ మెంగ్ విడుదలకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్!
- సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యునినార్ కస్టమర్లకు కొద్దిరోజుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి రాబోతోంది. అది కూడా మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరలోనే. ఇందుకు నెట్‌వర్క్‌ను పూర్తిగా నూతన టెక్నాలజీతో ఆధునీకరిస్తున్నామని, తమ ప్రమోటర్ సంస్థ టెలినార్ గ్రూప్ చైనా టెక్నాలజీ దిగ్గజం హువావె టెక్నాలజీస్‌తో చేతులు కలిపిందని యునినార్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ.1,300 కోట్లకు పైమాటే. యునినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిల్స్‌లో 2017 చివరినాటికి 24,000 సైట్స్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తామని, సాఫ్ట్‌వేర్‌ను జోడించడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేసేందుకు ఈ టెక్నాలజీతో వీలవుతుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలియజేశారు. మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... మార్కెట్ డిమాండ్ ను బట్టి ఎంతైనా స్పీడ్‌ను అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా 5,000 సైట్స్ ఆధునీకరణ పూర్తి అవుతుంది. సబ్సే సస్తా కొనసాగిస్తాం.. ‘‘దేశవ్యాప్తంగా యునినార్ చందాదారుల సంఖ ్య 4.8 కోట్లుంది. ఇందులో 24 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ కస్టమర్లు ప్రతినెల 3-4 శాతం పెరుగుతున్నారు. 1 జీబీ డేటాను రూ.100 లోపే అందిస్తున్నాం. కొత్త టెక్నాలజీతో వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి’’ అని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ తెలిపారు. 2017 నాటికి ఇంటర్నెట్ చందాదారుల సంఖ్యను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. కాగా కంపెనీ కాల్ సెంటర్‌కు కాల్ డ్రాప్స్ ఫిర్యాదులు లేవని శ్రీనాథ్ తెలిపారు.