బీజింగ్ : అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా సమాధానం చెప్పిన చైనా మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ వావే కీలక విషయాన్ని ప్రకటించింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొందరలోనే లాంచ్ చేయనున్నామని గురువారం ప్రకటించింది. మమ్మల్ని తక్కువగా అంచని వేయొద్దని ప్రకటించిన వావే ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా ‘హాంగ్‌మెంగ్’ పేరుతో కొత్త ఓఎస్‌ను లాంచ్ చేయనుంది. తద్వారా అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్‌కు పెద్ద షాక్ ఇస్తోంది.
వావే ‘హాంగ్‌మెంగ్’ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో గ్లోబల్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని వావే తెలిపింది. ఈ మేరకు వావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియమ్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాంగ్‌మెంగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే చైనాలో మిలియన్‌కు పైగా స్మార్ట్‌ఫోన్లలో అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ట్రేడ్‌మార్క్‌ను సాధించనున్నామంటూ ధృవీకరించారు.
గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వావేను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, సంస్థ వ్యాపార లావాదేవీలను నిషేధించారు. శత్రు దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్‌వర్క్‌కు ప్రమాదం పొంచి ఉందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా చైనాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద టెలికం కమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ కంపెనీ వావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వావేకు అమెరికాలో కార్యకాలాపాల కొనసాగింపు కోసమంటూ అమెరికా వాణిజ్య శాఖ 90 రోజుల తాత్కాలిక లైసెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ వావేతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఫేస్‌బుక్ కూడా ఇదే బాటలో పయనించింది.
ప్రస్తుతం అమెరికా కంపెనీలైన గూగుల్, ఆపిల్ కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్‌ను ఏలుతున్న సంగతి తెలిసిందే. హువావే 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. తాజా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో పాటు గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చినట్టేనని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment