కిట్‌క్యాట్ హవా మొదలైందా...?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ శకం మొదలైందా... వారం రోజుల వ్యవధిలో మూడు నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ దర్శనమివ్వడాన్ని గమనిస్తే అవుననే చెప్పాలి.మరి.. ఈ తాజా ఓఎస్ తెచ్చే కొత్త ఫీచర్లేమిటి? వాటితో మనకు కలిగే ప్రయోజనాలేమిటి?చదవండి మరి...
మొబైల్‌ఫోన్లను స్మార్ట్‌ఫోన్లుగా మార్చిన ఘనత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొట్టమొదటి వెర్షన్ కప్ కేక్ మొదలుకొని ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న జెల్లీబీన్ వరకూ కొత్తఫీచర్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. మొబైల్‌ఫోన్‌ను అరచేతి అద్భుతంగా మార్చేశాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ 4.4.2ను గత ఏడాది సెప్టెంబరులోనే ప్రకటించింది. డెవలపర్లు తమదైన మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించింది.
ఆ తరువాత కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకుని డిసెంబరు 2013 నాటికి పూర్తి రూపాన్ని సంతరించుకుంది. అయినప్పటికీ కొన్ని ఇతర కారణాల దృష్ట్యా అధికశాతం ఫోన్లలోకి చేరలేదు. ప్రస్తుతం 10 శాతం ఫోన్లకు మాత్రమే విస్తరించింది. జెల్లీబీన్‌తో నడుస్తున్న స్మార్ట్‌ఫోన్లు కొన్ని అప్‌గ్రేడ్‌కు అవకాశమివ్వడం... తాజా ఓఎస్‌తో కొత్తఫోన్లు రావడం కిట్‌క్యాట్ ప్రాబల్యం పెరుగుతోందనడానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి.
మెరుగైన మెమరీ మేనేజ్‌మెంట్...
స్మార్ట్‌ఫోన్లను ఎంచుకునే సమయంలో మనమందరం కచ్చితంగా గమనించే అంశం ర్యామ్. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఫోన్ అంత మెరుగ్గా పనిచేస్తుందన్నది మనకున్న అంచనా. కిట్‌క్యాట్‌లో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే అతితక్కువ ర్యామ్‌తోనూ సమర్థంగా పనిచేసేందుకు వీలుగా దీంట్లో మెరుగైన మెమరీ మేనేజ్‌మెంట్ పద్ధతులను ప్రవేశపెట్టారు. కచ్చితంగా చెప్పాలంటే కిట్‌క్యాట్ ఓఎస్ ఉంటే 512 ఎంబీ ర్యామ్‌తోనూ మల్టీటాస్కింగ్ సులువుగా చేసుకోవచ్చు. టచ్‌స్క్రీన్ స్పందనలను మరింత సమర్థంగా నిర్వహించడం, ముఖ్యమైన అప్లికేషన్ల మెమరీ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆండ్రాయిడ్ ఈ ఘనతను సాధించింది.
గూగుల్‌తో మమేకం...
ఆండ్రాయిడ్ అనేది గూగుల్ సిద్ధం చేసిన ఓఎస్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లనే గూగుల్‌కు సంబంధించిన సర్వీసులు అనేకం ఈ ఓఎస్‌లో కనిపిస్తాయి. కిట్‌క్యాట్‌లో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓకే గూగూల్ వీటిల్లో ఒకటి. జెల్లీబీన్ తాజా వెర్షన్లు కొన్నింటిలో కనిపించిన ఈ ఫీచర్ మీ మాటనే ఆదేశంగా మారుస్తుంది. హోంస్క్రీన్‌పైనే ఉండే మైక్ ఐకాన్ ద్వారా గూగుల్ సెర్చింజిన్‌ను వాడుకోవచ్చు. లేదా టెక్ట్స్ మెసేజ్‌లు పంపవచ్చు.
ఒక ప్రాంతం నుంచి మరోచోటికి వెళ్లేందుకు డెరైక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్ వంటి అప్లికేషన్లను లాంచ్ చేయవచ్చు కూడా. వీటితోపాటు గూగుల్ నౌ అప్లికేషన్లను ఇతర అప్లికేషన్లతో అనుసంధానించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఏదైనా హోటల్ కోసం వెతుకుతున్నారనుకుందాం. గూగుల్ నౌలో ఈ పని మొదలుపెట్టగానే... మీకు దగ్గర్లో ఉన్న హోటళ్ల వివరాలు గూగుల్ మ్యాప్ అప్లికేషన్ సాయంతో కనిపిస్తాయి.
మెసేజీలన్నీ హ్యాంగౌట్ లోనే...
ఇప్పటివరకూ కేవలం ఎస్‌ఎంఎస్‌లకు మాత్రమే పరిమితమైన హ్యాంగౌట్ కిట్‌క్యాట్‌లో అన్ని రకాల మెసేజ్‌లను ఒకేచోట చూపుతుంది. హెచ్‌డీ వీడియో కాల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. యానిమేషన్ జీఐఎఫ్, లొకేషన్ల షేరింగ్‌కి కూడా హ్యాంగౌట్ ఉపయోగపడుతుంది. కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో కాలర్ ఐడీలోనూ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డిజైన్‌తోపాటు ఒక సెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో లిస్ట్ అయిన వ్యాపారాల తాలూకూ కాంటాక్ట్ సమాచారం కాలర్ ఐడీ ద్వారానే లభిస్తుంది.
వైర్‌లెస్ ప్రింటింగ్‌కు ఆస్కారం...
మొబైల్‌ఫోన్ల ద్వారా ఫొటోలు, డాక్యుమెంట్లను నేరుగా ప్రింట్ చేసేందుకు కిట్‌క్యాట్ అవకాశం కల్పిస్తోంది. గూగుల్ క్లౌడ్ ప్రింట్ అప్లికేషన ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాకపోతే వైఫై, బ్లూటూత్ ల ద్వారా జరిగే ఈ ప్రింటింగ్‌కు తగిన ప్రింటర్లు కూడా ఉండాలి. ప్రింటింగ్ సంగతి ఇలా ఉంటే కిట్‌క్యాట్ ద్వారా క్లౌడ్ స్టోరేజీ కూడా చాలా సులువుగా జరిగిపోతుంది. మీ ఫోన్‌లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే గూగుల్ డ్రైవ్ సాయంతో నేరుగా క్లౌడ్ నుంచే డాక్యుమెంట్లను ఓపెన్ చేయవచ్చు.
స్టోర్ చేయవచ్చు నన్నమాట. క్విక్ ఆఫీస్ వంటి అప్లికేషన్ల ద్వారా ఈ డాక్యు మెంట్స్‌ను ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకునే వీలుంటుంది. తద్వారా ఆఫీసు పనులను కూడా ఎప్పటి కప్పుడు చక్కబెట్టుకోవచ్చునన్నమాట. కిట్‌క్యాట్ ఓఎస్‌లో రెండు కాంపోజిట్ సెన్సర్లు అదనంగా చేరాయి. స్టెప్ కౌంటర్, స్టెప్ డిటెక్టర్ అనే ఈ రెండు సెన్సర్ల ద్వారా ప్రత్యేకమైన ఫిట్‌నెస్ అప్లికేషన్ల అవసరం లేకుండా పోతుందన్నమాట.