kitkyat
-
ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో...
దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో నడిచే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.4,333 ధరతో బడ్జెట్ శ్రేణిలో ఉండటం విశేషం. ఇందుకు తగ్గట్టుగానే దీంట్లో ఒక గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీంట్లో ర్యామ్ 512 మెగాబైట్లు మాత్రమే కాగా, ప్రధాన మెమరీ నాలుగు జీబీలుగా ఉంది. మైక్రోఎస్డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ప్రధాన కెమెరా రెజల్యూషన్ 5 ఎంపీ మాత్రమే. సెల్ఫీ కెమెరా 0.3 ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉంది. ప్రధాన కెమెరాలో ఆటో పనోరమిక్ ఫీచర్ ఉండటం విశేషం. ఆక్వా వై2 ప్రో స్క్రీన్ సైజు 4.5 అంగుళాలు. -
ఏ35కే సంచలనం సృష్టిస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవల విడుదల చేసిన తమ స్మార్ట్‌ఫోన్ ఏ35కే సంచలనం సృష్టిస్తోందని, ఇప్పటికే లక్షకుపైగా పీసులు అమ్ముడయ్యాయని సెల్కాన్ సీఎండీ వై.గురు వెల్లడించారు. ఆన్‌డ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో రూపొందించిన ఈ మోడల్లో మరో 10 లక్షల ఫోన్లకు ఆర్డర్లున్నాయని ఆయన చెప్పారు. మార్కెట్లో కిట్‌క్యాట్‌తో 3జీ ఫోన్ల ధర రూ.10 వేల పైమాటేనని, తాము రూ.3 వేలకే అందించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్‌కు అనూహ్య స్పందన వస్తోందని, అగ్ర దేశాల వెబ్సైట్లు సైతం ఈ మోడల్ గురించి చర్చించడం విశేషమన్నారు. కొన్ని సెల్‌ఫోన్ కంపెనీలు సెల్కాన్ను అనుసరించనున్నాయని తెలిపారు. ఇప్పటికే తాము విక్రయిస్తున్న 9 దేశాలతోపాటు యూరప్, ఆఫ్రికాలో మరో 20 దేశాల్లో ఏ35కే విడుదల చేయనున్నట్టు చెప్పారు. మార్కెట్ తీరుతెన్నులు, భవిష్యత్ మోడళ్ల వివరాలను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు? టెక్నాలజీతోపాటే కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. ఫీచర్లపరంగా చూస్తే కిట్‌క్యాట్, 2జీబీ ర్యామ్, గెస్చర్ సెన్సార్, రంగు రంగుల్లో ఎక్స్ట్రా ప్యానెల్స్, క్వాడ్‌కోర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, స్లిమ్, తేలికైన ఫోన్లను కస్టమర్లు కోరుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లను రూపొందిస్తున్నాం. పలుచని, తేలికైన స్మార్ట్‌ఫోన్‌తో రికార్డుల్లోకి ఎక్కారు. భవిష్యత్ మోడళ్లు ఏం తేబోతున్నారు? కిట్‌క్యాట్‌తో మిలీనియం సిరీస్‌లో ఇప్పటికి 5 మోడళ్లు తెచ్చాం. మరో రెండు రానున్నాయి. అన్ని మోడళ్లు క్వాడ్కోర్తో రూపొందినవే. రూ.6 వేల లోపే క్వాడ్‌కోర్ మోడల్‌ను తీసుకొచ్చాం. 7.9 మిల్లీమీటర్ల మం దంలో క్యూ455 మోడల్ ప్రవేశపెట్టాం. క్వాడ్కోర్లో ఇంత పలుచని ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. అమెరికా కంపెనీ బ్రాడ్‌కామ్ చిప్సెట్ వాడాం. ఫోన్ వేడి కాకుండా పీసీబీ లేఅవుట్ డిజైన్ చేశాం. ఇక 2జీబీ ర్యామ్‌తో క్యూ500 అనే మోడల్ ఈ వారమే మార్కెట్లోకి వస్తోంది. దసరాకల్లా ఆక్టాకోర్ మోడల్‌ను ఆవి ష్కరిస్తాం. 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లుంటాయి. కలర్ ప్యానెల్స్‌తో 3జీ కిట్‌క్యాట్ ఫోన్‌ను ప్రపంచంలో తొలిసారిగా రూ.5 వేలలోపు పరిచయం చేస్తాం. కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారా? ఫ్యాబ్లెట్స్ విభాగంలోకి ప్రవే శిస్తున్నాం. 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, వన్ గ్లాస్ సొల్యూషన్‌తో 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో రానుంది. డ్యూయల్ కోర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో 7 అంగుళాల ట్యాబ్లెట్ పీసీ సెప్టెంబరులో తీసుకొస్తున్నాం. గ్లాస్ ఫినిష్, హెచ్డీ డిస్ప్లే అదనపు ఆకర్షణ. ధర రూ.7 వేల లోపే ఉం టుంది. పవర్ బ్యాకప్, డేటా కార్డ్స్, బ్లూ టూత్ వంటి యాక్సెసరీస్ విభాగాల్లోనూ అడుగు పెట్టనున్నాం. త్వరలో వైఫై సిటీలు రాబోతున్నాయి. వీటికి సంబంధించి మీరేం చేయబోతున్నారు? నవంబరులో 4జీ ఫోన్ల విభాగంలో రెండు మోడళ్లతో అడుగు పెడతాం. అలాగే బేసిక్ ఫోన్లను వైఫై ఫీచర్‌తో ప్రవేశపెట్టబోతున్నాం. ఖరీదైన ఫోన్ మాదిరిగా గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ధర రూ.2 వేల లోపే. కెపాసిటివ్ టచ్‌తో రూ.2,500కే వైఫై మోడల్‌ను ఆవిష్కరిస్తాం. మా ప్రస్థానం ప్రారంభమైంది ఫీచర్ ఫోన్ల నుంచే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విభాగాన్ని విస్మరించం. వాట్సాప్‌తో 7 బేసిక్ మోడళ్లను తెచ్చాం. ఎక్స్ట్రా ప్యానెల్స్‌తో ఒక మోడల్‌ను రూ.1,500లకే విక్రయిస్తున్నాం. అందుబాటు ధరలో ప్రభుత్వానికి వైఫై ఫోన్లు విక్రయించేందుకు మేం సిద్ధం. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యూహం ఏమిటి? మార్కెట్‌కు అనుగుణంగా కొన్ని మోడళ్లను స్నాప్‌డీల్ వంటి కంపెనీల భాగస్వామ్యంతో ఆన్లైన్లో విక్రయిస్తున్నాం. దేశవ్యాప్తంగా 800, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 165 సర్వీసింగ్ కేంద్రాలతో కస్టమర్లకు చేరువయ్యాం. ఫోన్ కొనుగోలు చేసిన వారంలోపు సమస్య వస్తే కొత్తది ఇస్తున్నాం. ఏడాది వరకు ఉచిత సర్వీస్ అందిస్తున్నాం. ఓవర్ ద ఎయిర్(ఓటా) అనే యాప్‌తో పాత వర్షన్ నుంచి కిట్క్యాట్కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలు కల్పిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. విక్రయాల్లో ఏ స్థానంలో ఉన్నారు? గత మూడేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫీచర్ ఫోన్ల అమ్మకాల్లో అగ్ర స్థానంలో ఉన్నాం. నెలకు 3 లక్షల ఫోన్లను విక్రయిస్తున్నాం. ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల విభాగంలోనూ తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నాం. -
కిట్‌క్యాట్ హవా మొదలైందా...?
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ శకం మొదలైందా... వారం రోజుల వ్యవధిలో మూడు నాలుగు స్మార్ట్ఫోన్లలో ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ దర్శనమివ్వడాన్ని గమనిస్తే అవుననే చెప్పాలి.మరి.. ఈ తాజా ఓఎస్ తెచ్చే కొత్త ఫీచర్లేమిటి? వాటితో మనకు కలిగే ప్రయోజనాలేమిటి?చదవండి మరి... మొబైల్ఫోన్లను స్మార్ట్ఫోన్లుగా మార్చిన ఘనత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొట్టమొదటి వెర్షన్ కప్ కేక్ మొదలుకొని ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న జెల్లీబీన్ వరకూ కొత్తఫీచర్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. మొబైల్‌ఫోన్‌ను అరచేతి అద్భుతంగా మార్చేశాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ 4.4.2ను గత ఏడాది సెప్టెంబరులోనే ప్రకటించింది. డెవలపర్లు తమదైన మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ తరువాత కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకుని డిసెంబరు 2013 నాటికి పూర్తి రూపాన్ని సంతరించుకుంది. అయినప్పటికీ కొన్ని ఇతర కారణాల దృష్ట్యా అధికశాతం ఫోన్లలోకి చేరలేదు. ప్రస్తుతం 10 శాతం ఫోన్లకు మాత్రమే విస్తరించింది. జెల్లీబీన్‌తో నడుస్తున్న స్మార్ట్ఫోన్లు కొన్ని అప్‌గ్రేడ్‌కు అవకాశమివ్వడం... తాజా ఓఎస్‌తో కొత్తఫోన్లు రావడం కిట్‌క్యాట్ ప్రాబల్యం పెరుగుతోందనడానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. మెరుగైన మెమరీ మేనేజ్మెంట్... స్మార్ట్ఫోన్లను ఎంచుకునే సమయంలో మనమందరం కచ్చితంగా గమనించే అంశం ర్యామ్. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఫోన్ అంత మెరుగ్గా పనిచేస్తుందన్నది మనకున్న అంచనా. కిట్‌క్యాట్‌లో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే అతితక్కువ ర్యామ్‌తోనూ సమర్థంగా పనిచేసేందుకు వీలుగా దీంట్లో మెరుగైన మెమరీ మేనేజ్మెంట్ పద్ధతులను ప్రవేశపెట్టారు. కచ్చితంగా చెప్పాలంటే కిట్‌క్యాట్ ఓఎస్ ఉంటే 512 ఎంబీ ర్యామ్‌తోనూ మల్టీటాస్కింగ్ సులువుగా చేసుకోవచ్చు. టచ్‌స్క్రీన్ స్పందనలను మరింత సమర్థంగా నిర్వహించడం, ముఖ్యమైన అప్లికేషన్ల మెమరీ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆండ్రాయిడ్ ఈ ఘనతను సాధించింది. గూగుల్‌తో మమేకం... ఆండ్రాయిడ్ అనేది గూగుల్ సిద్ధం చేసిన ఓఎస్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లనే గూగుల్‌కు సంబంధించిన సర్వీసులు అనేకం ఈ ఓఎస్‌లో కనిపిస్తాయి. కిట్‌క్యాట్‌లో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓకే గూగూల్ వీటిల్లో ఒకటి. జెల్లీబీన్ తాజా వెర్షన్లు కొన్నింటిలో కనిపించిన ఈ ఫీచర్ మీ మాటనే ఆదేశంగా మారుస్తుంది. హోంస్క్రీన్పైనే ఉండే మైక్ ఐకాన్ ద్వారా గూగుల్ సెర్చింజిన్‌ను వాడుకోవచ్చు. లేదా టెక్ట్స్ మెసేజ్‌లు పంపవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరోచోటికి వెళ్లేందుకు డెరైక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్ వంటి అప్లికేషన్లను లాంచ్ చేయవచ్చు కూడా. వీటితోపాటు గూగుల్ నౌ అప్లికేషన్లను ఇతర అప్లికేషన్లతో అనుసంధానించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఏదైనా హోటల్ కోసం వెతుకుతున్నారనుకుందాం. గూగుల్ నౌలో ఈ పని మొదలుపెట్టగానే... మీకు దగ్గర్లో ఉన్న హోటళ్ల వివరాలు గూగుల్ మ్యాప్ అప్లికేషన్ సాయంతో కనిపిస్తాయి. మెసేజీలన్నీ హ్యాంగౌట్ లోనే... ఇప్పటివరకూ కేవలం ఎస్ఎంఎస్లకు మాత్రమే పరిమితమైన హ్యాంగౌట్ కిట్‌క్యాట్‌లో అన్ని రకాల మెసేజ్‌లను ఒకేచోట చూపుతుంది. హెచ్డీ వీడియో కాల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. యానిమేషన్ జీఐఎఫ్, లొకేషన్ల షేరింగ్‌కి కూడా హ్యాంగౌట్ ఉపయోగపడుతుంది. కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో కాలర్ ఐడీలోనూ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డిజైన్‌తోపాటు ఒక సెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో లిస్ట్ అయిన వ్యాపారాల తాలూకూ కాంటాక్ట్ సమాచారం కాలర్ ఐడీ ద్వారానే లభిస్తుంది. వైర్లెస్ ప్రింటింగ్‌కు ఆస్కారం... మొబైల్ఫోన్ల ద్వారా ఫొటోలు, డాక్యుమెంట్లను నేరుగా ప్రింట్ చేసేందుకు కిట్‌క్యాట్ అవకాశం కల్పిస్తోంది. గూగుల్ క్లౌడ్ ప్రింట్ అప్లికేషన ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాకపోతే వైఫై, బ్లూటూత్ ల ద్వారా జరిగే ఈ ప్రింటింగ్‌కు తగిన ప్రింటర్లు కూడా ఉండాలి. ప్రింటింగ్ సంగతి ఇలా ఉంటే కిట్‌క్యాట్ ద్వారా క్లౌడ్ స్టోరేజీ కూడా చాలా సులువుగా జరిగిపోతుంది. మీ ఫోన్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే గూగుల్ డ్రైవ్ సాయంతో నేరుగా క్లౌడ్ నుంచే డాక్యుమెంట్లను ఓపెన్ చేయవచ్చు. స్టోర్ చేయవచ్చు నన్నమాట. క్విక్ ఆఫీస్ వంటి అప్లికేషన్ల ద్వారా ఈ డాక్యు మెంట్స్‌ను ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకునే వీలుంటుంది. తద్వారా ఆఫీసు పనులను కూడా ఎప్పటి కప్పుడు చక్కబెట్టుకోవచ్చునన్నమాట. కిట్‌క్యాట్ ఓఎస్‌లో రెండు కాంపోజిట్ సెన్సర్లు అదనంగా చేరాయి. స్టెప్ కౌంటర్, స్టెప్ డిటెక్టర్ అనే ఈ రెండు సెన్సర్ల ద్వారా ప్రత్యేకమైన ఫిట్నెస్ అప్లికేషన్ల అవసరం లేకుండా పోతుందన్నమాట. -
కొత్త సరుకు
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌తో ఎల్జీ ఎల్80 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ కిట్‌క్యాట్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ కంపెనీ ఎల్80 పేరుతో ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మధ్యమశ్రేణి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ధర రూ.13,100 వరకూ ఉండవచ్చునని అంచనా. ఎల్జీ ఇండొనేషియా ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ఎల్80 రాకను తెలియజేయగా దీంట్లో సింగిల్ సిమ్, డబుల్ సిమ్ వేరియంట్లు రెండూ ఉంటాయని తెలిపింది. ఎల్80లో 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ క్వాల్కామ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. స్క్రీన్‌సైజు దాదాపు 5 అంగుళాలు. ఇక మెమరీ విషయానికొస్తే దీంట్లో ఒక గిగాబైట్ ర్యామ్, 4 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డు ఉపయోగించే వీలుంది కాబట్టి మెమరీని మరింత పెంచుకోవచ్చు. అయిదు మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీంట్లో ఏర్పాటు చేశారు. త్రీజీ, బ్లూటూత్ 4.0, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, వైఫై వంటి అదనపు హంగులున్న ఎల్జీ ఎల్80లో 2540 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 కలర్స్... దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ రంగు రంగుల కవర్షెల్స్తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన కాన్వాస్ శ్రేణిలో భాగంగా ‘కాన్వాస్ 2 కలర్స్’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.పది వేల వరకూ ఉండవచ్చు. డార్క్ గ్రే, వైట్ రంగుల్లో లభించే కాన్వాస్ కలర్స్ కవర్షెల్స్ మాత్రం భిన్న రంగుల్లో లభిస్తాయి. డార్క్ గ్రే కలర్ స్మార్ట్‌ఫోన్‌ను ఖరీదు చేస్తే దాంతోపాటు రేడియెంట్ రెడ్, మిస్టిక్ బ్లూ కవర్లు లభిస్తాయి. తెల్లరంగు ఫోన్‌తోపాటు వైబ్రంట్ ఎల్లో, స్ప్లెండిడ్ గ్రీన్ కవర్లు ఉంటాయన్నమాట. రెండు జీఎస్ఎం సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగల కలర్స్‌లో అయిదు అంగుళాల స్క్రీన్ ఉంటుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ 4 గిగాబైట్లు. పిక్సెల్ రెజల్యూషన్ 720 బై 1280 ఉండటం విశేషం. అలాగే ప్రధాన కెమెరా 8 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీయగలుగుతుంది. వీడియో కాలింగ్‌కు ఉద్దేశించిన ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ 2 మెగాపిక్సెల్స్. బర్న్ ద రోప్, ఫుక్రే, ఫ్రాగ్ బరస్ట్ వంటి గేమ్స్, కింగ్‌సాఫ్ట్, గెటిట్, ఒపేరా మినీ, ఎంలైవ్, ఎంఐ గేమ్స్, రివరీ ఫోన్‌బుక్, స్మార్ట్‌ప్యాడ్ వంటి అప్లికేషన్లతో కలిపి లభిస్తోంది ఈ స్మార్ట్‌ఫోన్. ఐవరీ ఎస్ టాబ్లెట్ దేశీయ టెక్నాలజీ కంపెనీ లావా త్రీజీ ఆధారిత టాబ్లెట్ ఐవరీఎస్ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ స్టోర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టాబ్లెట్ ఏడు అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఐవరీ ఎస్‌లో గ్రాఫిక్స్ కోసం మాలీ 400 జీపీయూ కూడా ఏర్పాటు చేశారు. రెండు సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగలదీ టాబ్లెట్. త్రీజీ, 2జీ బ్లూటూత్, వైఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక గిగాబైట్ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్డీకార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు) ఉన్న ఐవరీ ఎస్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్. వాట్స్అప్, హంగామా, పేటీఎం, ఈఏ గేమ్స్, వంటివి ప్రీలోడెడ్‌గా లభిస్తాయి. ధర రూ.8499. నికాన్ కూల్‌పిక్స్ శ్రేణి కెమెరాలు.. సుప్రసిద్ధ కెమెరా తయారీ కంపెనీ నికాన్ తాజాగా తన కూల్‌పిక్స్ శ్రేణిలో భాగంగా 16 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఫొటోగ్రఫీ నిపుణులతోపాటు సామాన్యులు సైతం సులువుగా ఉపయోగించేందుకు వీలుగా వేర్వేరు స్పెసిఫికేషన్స్, ఫీచర్లతో ఉన్నాయి ఈ కెమెరాలు. కూల్‌పిక్స్ పీ సిరీస్‌లో భాగంగా విడుదలైన పీ600, పీ530, పీ340ల్లో సూపర్ లాంగ్ జూమ్ లెన్సులు, ఫుడ్ హెచ్డీ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కూల్‌పిక్స్ పీ600లో అప్టికల్ జూమ్ 60 ఎక్స్ వరకూ ఉండగా, డైనమిక్ జూమ్1 120 ఎక్స్ వరకూ ఉండటం వల్ల సుదూర చిత్రాలను కూడా స్పష్టంగా తీసే అవకాశముంది. వైడ్ యాంగిల్ 24 మిమీల నుంచి 1440 మిమీ వరకూ ఉండటం విశేషం. వైఫై, జీపీఎస్ టెక్నాలజీలనూ దీంట్లో పొందుపరిచారు. ఇక ఎస్ శ్రేణి కెమెరాల్లో మొత్తం ఎనిమిది కెమెరాలను విడుదల చేసింది. ఎస్9700లో 30 ఎక్స్ ఆప్టికల్, డైనమిక్ జూమ్1లు ఉన్నాయి. ట్రావెల్లాగ్స్ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణించే మార్గాన్ని, ఫొటో తీసిన ప్రాంతాన్ని జీపీఎస్ ద్వారా లొకేషన్ రికార్డు చేయవచ్చు. ఎస్9600లో 22 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 16 ఎంపీ రెజల్యూషన్ ఉన్నాయి. ఎల్శ్రేణిలో మొత్తం 4 మోడళ్లను ప్రవేశపెట్టారు. వీటిల్లోని ఎల్830లో అల్ట్రా హై పవర్ జూమ్ బ్రిడ్జ్ కెమెరా టెక్నాలజీని ఉపయోగించారు. ఇక ఎల్330 26ఎక్స్ ఆప్టికల్ జూమ్ సౌకర్యం కలిగి ఉంది. ఈజీ ఆటోమోడ్, స్మార్ట్ పోర్టెయిట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ ఎల్ శ్రేణి కెమెరాల్లో. చివరగా కూల్‌పిక్స్ ఏడబ్యూ120 గురించి. రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఉద్దేశించిన ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ కూడా. రెండు మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా తట్టుకునే విధంగా తయారు చేశారు. పీ శ్రేణి కెమెరా ధర రూ.19 నుంచి రూ.24 వేల మధ్యలో ఉంటే.. ఎస్ శ్రేణి ధర రూ.6450 నుంచి రూ.17950 వరకూ ఉంటాయి. ఎల్శ్రేణి కెమెరాల ధర రూ.5వేల నుంచి రూ.16 వేల వరకూ ఉంది. ఏడబ్ల్యూ 120 ధర రూ.17950.