కొత్త సరుకు | The new cargo | Sakshi
Sakshi News home page

కొత్త సరుకు

Published Wed, Apr 30 2014 11:59 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

The new cargo

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌తో ఎల్‌జీ ఎల్80
 
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ కిట్‌క్యాట్‌తో పనిచేసే  స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ కంపెనీ ఎల్80 పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మధ్యమశ్రేణి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ధర రూ.13,100 వరకూ ఉండవచ్చునని అంచనా. ఎల్‌జీ ఇండొనేషియా ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా ఎల్80 రాకను తెలియజేయగా దీంట్లో సింగిల్ సిమ్, డబుల్ సిమ్ వేరియంట్లు రెండూ ఉంటాయని తెలిపింది. ఎల్80లో 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ క్వాల్‌కామ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. స్క్రీన్‌సైజు దాదాపు 5 అంగుళాలు. ఇక మెమరీ విషయానికొస్తే దీంట్లో ఒక గిగాబైట్ ర్యామ్, 4 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మైక్రోఎస్‌డీ కార్డు ఉపయోగించే వీలుంది కాబట్టి మెమరీని మరింత పెంచుకోవచ్చు. అయిదు మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీంట్లో ఏర్పాటు చేశారు. త్రీజీ, బ్లూటూత్ 4.0, ఎఫ్‌ఎం రేడియో, జీపీఎస్, వైఫై వంటి అదనపు హంగులున్న ఎల్‌జీ ఎల్80లో 2540 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.
 
 
 మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 కలర్స్...

 దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ రంగు రంగుల కవర్‌షెల్స్‌తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన కాన్వాస్ శ్రేణిలో భాగంగా ‘కాన్వాస్ 2 కలర్స్’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.పది వేల వరకూ ఉండవచ్చు. డార్క్ గ్రే, వైట్ రంగుల్లో లభించే కాన్వాస్ కలర్స్ కవర్‌షెల్స్ మాత్రం భిన్న రంగుల్లో లభిస్తాయి. డార్క్ గ్రే కలర్ స్మార్ట్‌ఫోన్‌ను ఖరీదు చేస్తే దాంతోపాటు రేడియెంట్ రెడ్, మిస్టిక్ బ్లూ కవర్లు లభిస్తాయి. తెల్లరంగు ఫోన్‌తోపాటు వైబ్రంట్ ఎల్లో, స్ప్లెండిడ్ గ్రీన్ కవర్లు ఉంటాయన్నమాట. రెండు జీఎస్‌ఎం సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగల కలర్స్‌లో అయిదు అంగుళాల స్క్రీన్ ఉంటుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ 4 గిగాబైట్లు. పిక్సెల్ రెజల్యూషన్ 720 బై 1280 ఉండటం విశేషం. అలాగే ప్రధాన కెమెరా 8 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీయగలుగుతుంది. వీడియో కాలింగ్‌కు ఉద్దేశించిన ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ 2 మెగాపిక్సెల్స్. బర్న్ ద రోప్, ఫుక్రే, ఫ్రాగ్ బరస్ట్ వంటి గేమ్స్, కింగ్‌సాఫ్ట్, గెటిట్, ఒపేరా మినీ, ఎంలైవ్, ఎంఐ గేమ్స్, రివరీ ఫోన్‌బుక్, స్మార్ట్‌ప్యాడ్ వంటి అప్లికేషన్లతో కలిపి లభిస్తోంది ఈ స్మార్ట్‌ఫోన్.
 
 
 ఐవరీ ఎస్ టాబ్లెట్

దేశీయ టెక్నాలజీ కంపెనీ లావా త్రీజీ ఆధారిత టాబ్లెట్ ఐవరీఎస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టాబ్లెట్ ఏడు అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఐవరీ ఎస్‌లో గ్రాఫిక్స్ కోసం మాలీ 400 జీపీయూ కూడా ఏర్పాటు చేశారు. రెండు సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగలదీ టాబ్లెట్. త్రీజీ, 2జీ బ్లూటూత్, వైఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక గిగాబైట్ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్‌డీకార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు) ఉన్న ఐవరీ ఎస్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్. వాట్స్‌అప్, హంగామా, పేటీఎం, ఈఏ గేమ్స్, వంటివి ప్రీలోడెడ్‌గా లభిస్తాయి. ధర రూ.8499.
 
 
నికాన్ కూల్‌పిక్స్ శ్రేణి కెమెరాలు..

 సుప్రసిద్ధ కెమెరా తయారీ కంపెనీ నికాన్ తాజాగా తన కూల్‌పిక్స్ శ్రేణిలో భాగంగా 16 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఫొటోగ్రఫీ నిపుణులతోపాటు సామాన్యులు సైతం సులువుగా ఉపయోగించేందుకు వీలుగా వేర్వేరు స్పెసిఫికేషన్స్, ఫీచర్లతో ఉన్నాయి ఈ కెమెరాలు. కూల్‌పిక్స్ పీ సిరీస్‌లో భాగంగా విడుదలైన పీ600, పీ530, పీ340ల్లో సూపర్ లాంగ్ జూమ్ లెన్సులు, ఫుడ్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కూల్‌పిక్స్ పీ600లో అప్టికల్ జూమ్ 60 ఎక్స్ వరకూ ఉండగా, డైనమిక్ జూమ్1 120 ఎక్స్ వరకూ ఉండటం వల్ల సుదూర చిత్రాలను కూడా స్పష్టంగా తీసే అవకాశముంది.  వైడ్ యాంగిల్ 24 మిమీల నుంచి 1440 మిమీ వరకూ ఉండటం విశేషం. వైఫై, జీపీఎస్ టెక్నాలజీలనూ దీంట్లో పొందుపరిచారు. ఇక ఎస్ శ్రేణి కెమెరాల్లో మొత్తం ఎనిమిది కెమెరాలను విడుదల చేసింది. ఎస్9700లో 30 ఎక్స్ ఆప్టికల్, డైనమిక్ జూమ్1లు ఉన్నాయి. ట్రావెల్‌లాగ్స్ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణించే మార్గాన్ని, ఫొటో తీసిన ప్రాంతాన్ని జీపీఎస్ ద్వారా లొకేషన్ రికార్డు చేయవచ్చు. ఎస్9600లో 22 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 16 ఎంపీ రెజల్యూషన్ ఉన్నాయి. ఎల్‌శ్రేణిలో మొత్తం 4 మోడళ్లను ప్రవేశపెట్టారు. వీటిల్లోని ఎల్830లో అల్ట్రా హై పవర్ జూమ్ బ్రిడ్జ్ కెమెరా టెక్నాలజీని ఉపయోగించారు. ఇక ఎల్330 26ఎక్స్ ఆప్టికల్ జూమ్ సౌకర్యం కలిగి ఉంది. ఈజీ ఆటోమోడ్, స్మార్ట్ పోర్టెయిట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ ఎల్ శ్రేణి కెమెరాల్లో. చివరగా కూల్‌పిక్స్ ఏడబ్యూ120 గురించి. రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఉద్దేశించిన ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ కూడా. రెండు మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా తట్టుకునే విధంగా తయారు చేశారు. పీ శ్రేణి కెమెరా ధర రూ.19 నుంచి రూ.24 వేల మధ్యలో ఉంటే.. ఎస్ శ్రేణి ధర రూ.6450 నుంచి రూ.17950 వరకూ ఉంటాయి. ఎల్‌శ్రేణి కెమెరాల ధర రూ.5వేల నుంచి రూ.16 వేల వరకూ ఉంది. ఏడబ్ల్యూ 120 ధర రూ.17950.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement