సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధిస్తూ భారత్ డిజిటల్ స్ట్రయిక్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా కూడా డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన వావే టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ) యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి నిషేధించింది. ‘ఈ రెండు కంపెనీలకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, చైనా మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలతో సంబంధాలున్నాయి. ఆ దేశ ఇంటలిజెన్స్ సర్వీసులకు సహకరించడానికి ఇవి చైనీస్ చట్టాలకు లోబడి పనిచేస్తాయి. ఇవి రెండు చైనా ఇంటెలిజెన్స్ విభాగంకు సహకరిస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి’ అని ఎఫ్‌సీసీ చైర్‌పర్సన్ అజిత్‌పాయ్ తెలిపారు. ఈ క్రమంలో ఈ రెండింటితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని అగ్రరాజ్యం పేర్కొంది. వావే, జెడ్‌టీఈలను నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిత్ర దేశమైన భారతదేశంపై కూడా ఈ విషయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి.
(చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్)
ఈ రెండు కంపెనీలపై భారత్ నిషేధం విధిస్తే...
ఇక సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో భారతదేశం 59 చైనీస్ యాప్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పడు ఈ రెండు కంపెనీలపై కూడా నిషేధం విధిస్తే భారత టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకోవచ్చు. వావే ఎంతో కాలంగా దేశీయ టెలికాం కంపెనీలకు తక్కువ ధరకు పరికరాలను సరఫరా చేస్తున్నాయి. 5 జీ స్పెక్ట్రమ్‌ను దేశంలో అభివృద్ధి చేయాలని అనుకుంటున్న క్రమంలో ఈ కంపెనీల పై నిషేధం విధిస్తే ఈ వ్యయం పెరిగే అవకాశం ఉంది. దేశంలో 4జీ సేవలను ప్రారంభించినప్పుడు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ వంటి సంస్థలకు చైనాకు చెందిన ఈ కంపెనీలే పరికరాలను సరఫరా చేశాయి. వావే భారతదేశంలోని మొత్తం టెలికం పరికరాల మార్కెట్లో దాదాపు 25 శాతం కలిగి ఉంది. భారతి ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ల కోసం వావేతో సహా 30 శాతం వరకు చైనా టెలికాం పరికరాలను ఉపయోగిస్తుండగా, వోడాఫోన్ ఐడియా 40 శాతం ఉపయోగిస్తుంది. టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత ఏడాది డిసెంబర్‌లో వావేకు దేశంలో 5జీ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతినిచ్చారు. (పేట్రేగిన చైనా హ్యాకర్లు)
(వావేపై ఆరోపణలు - అమెరికా కీలక ముందడుగు)
జూన్ 15 రాత్రి భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలా అని సమాలోచనలు జరుపుతున్న భారత్ చివరకు డ్రాగన్‌కు గట్టి షాకిస్తూ డిజిటల్ స్ట్రయిక్ ప్రకటించింది. (నిషేధంతో చైనా గుబులు)
Comments
Please login to add a commentAdd a comment