విజయ్ మాల్యా (ఫైల్ ఫోటో)
లండన్ : బ్యాంక్‌లకు వేలకోట్లు కొల్లగట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, భారత్‌కు అప్పగింత కేసు నేడు విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా విజయ్ మాల్యా మధ్యాహ్నం వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా విజయ్ మాల్యాను ఉంచేందుకు భారత అథారిటీలు సమర్పించిన ముంబై జైలు సెల్ వీడియోను జడ్జి సమీక్షించారు. విజయ్ మాల్యాను ఉంచే ముంబై ఆర్థూర్ రోడ్డు జైలు బ్యారెక్ 12కు సంబంధించి ప్రతీది స్టెప్-బై-స్టెప్ వీడియో తీసి తమకు సమర్పించాలని గత విచారణ సందర్భంగా జూలైలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు జడ్జి ఎమ్మా అర్బుత్నోట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోతో అన్ని అనుమానాలను నివృతి చేయాలని పేర్కొంది.
భారత్‌లో జైళ్లు దారుణంగా ఉన్నాయంటూ విజయ్ మాల్యా ఆరోపించారు. సరైన సదుపాయాలు ఉండవని, గాలి, వెలుతురు సైతం సరిగ్గా ఉండవని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దీంతో మాల్యాను ఉంచే జైలుకు సంబంధించిన 10 నిమిషాల నిడివి గల వీడియోను తీసి భారత అధికారులు లండన్ కోర్టుకు సమర్పించారు. బ్యారెక్-12లో మాల్యా కోసం ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామని, ఆ సెల్‌లో మాల్యా కోసం ప్రత్యేకంగా ఎల్‌సీడీ టీవీ, కొత్త పరుపులు, తల్లగడ్లు, దుప్పట్లు, వాష్ ఏరియా, వెస్ట్రన్ స్టయిల్‌లో టాయిలెట్, లైబ్రరీ, మంచి వెలుతురు వచ్చేలా తూర్పు వైపు గది కల్పిస్తామని చెప్పారు. ఈ వీడియోను నేడు లండన్ కోర్టు పరిశీలిస్తోంది.
క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు, భారత ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారు. అప్పగింత ప్రొసీడింగ్స్‌కు సంబంధించి యూకే మానవ హక్కుల బాధ్యతల్లో భాగంగా సెల్‌ను తనిఖీ చేయాలని విజయ్ మాల్యా డిఫెన్స్ టీమ్ వాదిస్తోంది. విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన విజయ్ మాల్యాను మీడియా పలు ప్రశ్నలు వేసింది. ‘ముందు నుంచి నేను చెబుతున్న మాదిరి, కర్నాటక హైకోర్టు ముందు నేను సమగ్ర పరిష్కార ఆఫర్‌ను ఉంచాను. గౌరవనీయులైన జడ్జీలను దీనిపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని మాల్యా అన్నారు. కాగా, దేశీయ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా, ఆ రుణాలను కట్టలేక చేతులెత్తేసి, చెప్పాపెట్టకుండా విదేశాలకు పారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment