మాల్యా జైలు, ఎన్ని సౌకర్యాలో చూడండి.. | Mallya Case, CBI H‌as Filed Video Documentary Of Mumbai Jail To UK | Sakshi
Sakshi News home page

మాల్యా జైలు, ఎన్ని సౌకర్యాలో చూడండి..

Published Fri, Aug 24 2018 5:50 PM | Last Updated on Fri, Aug 24 2018 5:50 PM

Mallya Case, CBI H‌as Filed Video Documentary Of Mumbai Jail To UK - Sakshi

విజయ్‌ మాల్యా (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : టీవీ, పర్సనల్‌ టాయిలెట్‌, బెడ్, వాష్‌ చేసుకునే ఏరియా, ఎల్లప్పుడూ సూర్యుని కాంతి పడేలా వెంటిలేషన్‌.. ఇదిగో చూడండి.. జైలు ఎంత బాగా రూపుదిద్దుకుందో... ఇంతకుమించిన సౌకర్యాలు కావాలా? అంటూ సీబీఐ, యూకే కోర్టుకు ఓ వీడియో డాక్యుమెంటరీ సమర్పించింది. ఇంతకీ ఈ వీడియో ఏంటి, దీని కథేంటి, అనుకుంటున్నారా? విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలనే కేసుపై యూకే కోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే భారత్‌లో జైళ్లు బాగుండవని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో నక్కిన విజయ్‌ మాల్యా, యూకే కోర్టులో వాదించారు. మాల్యా వాదనల మేరకు ఆయన్ను భారత్‌కు అప్పగిస్తే, ఆయనను ఎక్కడ ఉంచుతారు? జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? నిందితుడి సెల్‌ ఏ విధంగా ఉంటుందో చూపుతూ ముంబై జైలు వీడియోను తమకు సమర్పించాలని సీబీఐను యూకే కోర్టు ఆదేశించింది. 

యూకే కోర్టు ఆదేశాల మేరకు మాల్యాను ఉంచే ముంబై ఆర్థుర్‌ రోడ్‌ జైలులోని బరాక్‌ నెంబర్‌ 12ను, అక్కడ ఉండే సౌకర్యాలను చూపిస్తూ.. 6 నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియోను తీసిన సీబీఐ డాక్యుమెంటరీ రూపంలో యూకే కోర్టుకు సమర్పించింది. ఇదే మాల్యా నివాసం అని పేర్కొంది. కాగ, భారత జైళ్లలో తాజా గాలి, సహజ సిద్ధమైన కాంతి ఉండవని విజయ్‌మాల్యా ఆరోపించారు. మాల్యాను ఉంచబోయే సెల్‌ ముఖద్వారం తూర్పువైపు ఉంటుంది. అంటే సూర్యకాంతి మంచిగా పడుతుంది అని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. కిటికి తలుపులు, ఇరువైపుల బార్లతో మాల్యాను ఉంచబోయే సెల్‌ మంచి వెంటిలేషన్‌ను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. విజయ్‌మాల్యాకు లైబ్రరీ యాక్సస్‌ కూడా కల్పిస్తామని ఈ వీడియో తీసిన సీనియర్‌ అధికారి చెప్పారు. ఇక భద్రతాపరంగా చూసుకుంటే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల భద్రతాపరమైన వసతులున్నాయని తెలిపారు. విచారణ సమయాల్లో పలుసార్లు ఇదే విషయాన్ని తాము కోర్టుకు వెల్లడించామని కూడా చెప్పారు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్‌లో ఎలాంటి లోపాలు లేవని, హోం మంత్రిత్వ శాఖ కూడా దీనిపై సెక్యురిటీ ఆడిట్‌ చేపట్టిందని తెలిపారు.

జైలులోని సెల్‌లన్నింటినీ సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంటాయని, బరాక్‌ వెలుపల, లోపల అదనపు గార్డులు ఉంటారని, వారు 24 గంటల పాటు బరాక్‌కు కాపాలాగా ఉంటారని అధికారులు చెప్పారు. రోజులో నాలుగు సార్లు భోజనం అందిస్తామని, ఆర్థూర్‌ రోడ్డు జైలులోని బరాక్‌ 12 ఎక్కువగా హై-ప్రొఫైల్‌ ఖైదీలకు మాత్రమే వాడనున్నట్టు తెలిపారు. ఎవరికైతే భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉంటుందో, వారు ఎవరికైనా ముప్పు కలిగిస్తారని అనుమానం ఉన్నా.. వారిని బరాక్‌లోనే ఉంచనున్నట్టు చెప్పారు. బ్యాంక్‌లకు దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి, యూకేకు పారిపోయిన మాల్యాను కూడా భారత్‌కు రప్పిస్తే ఇక్కడే ఉంచనున్నారు. ఆయన్ను భారత్‌కు అప్పగించే వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 12న జరుగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement