యూత్ బ్రాండ్ యునినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ యునినార్‌కు దేశవ్యాప్తంగా జూన్ నాటికి 3.93 కోట్ల మంది చందాదారులున్నారు. వీరిలో 60 శాతం మంది 18-25 ఏళ్ల వయసు వారే కావడం విశేషం. సబ్‌సే సస్తా పేరుతో అన్ని కంపెనీల కంటే చవకైన ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని, దీంతో యూత్ బ్రాండ్‌గా నిలిచామని యునినార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజీవ్ సేథి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.
అందరికీ ఇంటర్నెట్‌ను చేరువ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇంటర్నెట్ చార్జీ గంటకు 50 పైసలు మొదలు చవక ధరలో ప్యాక్‌లు, టారిఫ్‌లు పరిచయం చేశామన్నారు. యునినార్ వినియోగదారుల్లో 30 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. మార్చికల్లా ఈ సంఖ్య2 రెట్లు ఆశిస్తున్నాన్నారు.
అవసరంగా ఇంటర్నెట్..
కనీస అవసరంగా ఇంటర్నెట్ మారిందని రాజీవ్ సేథి తెలిపారు. ‘యునినార్ వినియోగదారుల్లో 50 శాతం మంది గ్రామీణులు ఉన్నారు. వీరు వినోదం కోసం నెట్‌లో ముఖ్యంగా పాటలు, యూట్యూబ్, ఫేస్‌బుక్ వాడుతున్నారు. పట్టణ వినియోగదారులు సమాచారం, పరిజ్ఞానం తెలుసుకోవడానికి నెట్‌పై ఆధారపడుతున్నారు’ అని తెలిపారు. టెలికం రంగంలో తాము 45 శాతం వృద్ధి నమోదు చేస్తున్నామని, పరిశ్రమ వృద్ధి రేటు కేవలం 10 శాతానికి పరిమితమైందని వివరించారు. అస్సాంలో జనవరిలో అడుగు పెట్టనున్నామని, దీంతో యునినార్ సర్కిళ్ల సంఖ్య 7కు చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఉత్తమ ఐడియాకు..
నార్వేలోని ఓస్లోలో డిసెంబరులో టెలినార్ యూత్ సమ్మిట్ జరగనుంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ ఫర్ ఆల్ చాలెంజ్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. 18-25 ఏళ్ల వయసున్నవారు చాలెంజ్‌కు అర్హులని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్ తెలిపారు. మొబైల్ ఇంటర్నెట్‌ను ఆసరాగా చేసుకుని సామాజిక మార్పు, అభివృద్ధికి దోహదపడే ఉత్తమ వ్యాపార ఆలోచనలను ఎంపిక చేస్తారు.
ఒక్కో సర్కిల్ నుంచి ఇద్దరిని, ఇలా భారత్‌లో 12 మందిని ఎంపిక చేస్తారు. ఇద్దరు విజేతలకు ప్రథమ బహుమతి రూ.1 లక్ష, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు ఇస్తారు. ఇలా టెలినార్ సేవలందిస్తున్న 14 దేశాల నుంచి 28 మందిని సమ్మిట్‌కు పంపిస్తారు. దరఖాస్తును ఫేస్‌బుక్‌లో యునినార్ పేజీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు పంపించేందుకు చివరితేదీ ఆగస్టు 31.