మోదీ గ్రామీన మంత్రం ! | Union Budget 2017: Government aims to bring 1 crore households out of poverty by 2019 | Sakshi
Sakshi News home page

మోదీ గ్రామీన మంత్రం !

Published Thu, Feb 2 2017 1:53 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

మోదీ గ్రామీన మంత్రం ! - Sakshi

మోదీ గ్రామీన మంత్రం !

నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌)తో అల్లాడిన పల్లెవాసులను ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్‌లో కనికరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం కోసం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. కీలకమైన ‘ఫ్లాగ్‌షిప్‌’ పథకాలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి ఇదివరకెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నిధులను కేటాయించడం నోట్ల రద్దు ప్రభావం గ్రామీణ భారతావనిపై తీవ్రంగా ఉందన్న వాస్తవాన్ని తేటతెల్లం చేసింది. ఇక మోదీ ప్రతిష్టాత్మక పథకం.. స్వచ్ఛభారత్‌పై మరింత దృష్టిసారించారు. గ్రామీణ విద్యుదీకరణను వేగవంతం చేయడం... కోటి పక్కా ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం... రోడ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించడం... వంటి చర్యల ద్వారా పల్లె వాసులను నోట్ల రద్దు ప్రభావం నుంచి గట్టెక్కించేందుకు బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ తీవ్రంగానే ప్రయత్నించారు. మొత్తంమీద 2019 నాటికి కోటి కుటుంబాలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకురావడం, 50,000 గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా మార్చేయడం తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి శాఖకు మొత్తం కేటాయింపులు 2016–17లో రూ.97,760 కోట్ల నుంచి వచ్చే ఏడాదికిగాను రూ.1,07,758 కోట్లకు పెంచారు.


25  శాతం పెంపు
ఉపాధికి ‘ధీమా’..
2017–18 కేటాయింపులు
48,000
(రూ. కోట్లలో)



2016–17 కేటాయింపులు
38,500
(రూ. కోట్లలో)


యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కీలక పథకానికి మోదీ సర్కారు ఈ సారి నిధుల వర్షాన్ని కురిపించింది. 2016–17లో కేటాయించిన మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేయడమే కాకుండా.. 2017–18 ఏడాదికి ఏకంగా 25 శాతం కేటాయిపులు పెంచి... రికార్డు స్థాయిలో రూ.48,000 కోట్లకు చేర్చారు. నోట్ల రద్దు కారణంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న పేదలకు ఇది కచ్చితంగా వరదాయకమే. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్ధంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది.

ఈ స్కీమ్‌ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలను మోదీ∙సర్కారు నిర్దేశించింది.

అయితే, మార్చి 2017 నాటికి 10 లక్షల చెరువులను పూర్తిచేయనున్నామని.. 2017–18లో మరో 5 లక్షల వ్యవసాయ చెరువుల తవ్వకాన్ని చేపట్టనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య 48 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి చేరిందని చెప్పారు.


‘స్వచ్ఛ భారత్‌’కు దన్ను..

55 శాతం పెంపు
2017–18 కేటాయింపులు
13,948
(రూ. కోట్లలో)


2016–17 కేటాయింపులు
9,000
(రూ. కోట్లలో)


భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ 2014 అక్టోబర్‌ 2న ఈ స్వచ్ఛ భారత్‌ అభియాన్‌(ఏబీఏ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం నిధులను సమకూర్చేందుకుగాను అర శాతం స్వచ్ఛ భారత్‌ సెస్‌తో పాటు...  క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెస్‌ను కూడా వసూలు చేస్తున్నారు. ఈ పథకానికి కేటాయింపులు ఈసారీ 55 శాతం పెరిగాయి. ఇందులో రూ.1,395 కోట్లను ఈశాన్య రాష్ట్రాలు–సిక్కింలకు, రూ.3,069 కోట్లను దళితులకు(ఎస్‌సీ), రూ.1,395 కోట్లను గిరిజనులకు(ఎస్‌టీ)లకు కేటాయించనున్నారు.

2019 అక్టోబర్‌ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్‌ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం.

♦  దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు.  ఎస్‌బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం.

2016–17లో 1.5 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2016 డిసెంబర్‌ నాటికి 1.12 కోట్లు నిర్మితమయ్యాయి. రూ.6,917 కోట్లను ఖర్చు చేశారు.

♦  డిసెంబర్‌ నాటికి 66 జిల్లా, 702 బ్లాకులు, 56,769 గ్రామ పంచాయతీలు, 1,26,900 పల్లెల్లోని కుటుంబాలన్నీ సెప్టిక్‌ లెట్రిన్లనే ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

♦  గ్రామీణ  భారత్‌లో పారిశుధ్య కవరేజీ 2014 అక్టోబర్‌లో 42 శాతంకాగా.. ఇప్పుడిది 60 శాతానికి పెరిగినట్లు జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన

2017–18 కేటాయింపులు
10,635
(రూ. కోట్లలో)
2016–17


కేటాయింపులు
8,500
(రూ. కోట్లలో)


విద్యుత్‌ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... బీపీఎల్‌ కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది.

2015 ఏప్రిల్‌ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం మోదీ సర్కారు లెక్కగట్టింది. 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ ప్రకటించారు.

తాజా బడ్జెట్‌లో గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,814 కోట్లు... ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు, ఫీడర్లను వేరుచేయడం వంటి స్కీమ్స్‌(ఐపీడీఎస్‌)కు రూ.5,821 కోట్లు చొప్పున కేటాయించారు.

జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ)

2017–18 కేటాయింపులు
6,050
(రూ. కోట్లలో)


2016–17
కేటాయింపులు
5,000
(రూ. కోట్లలో)


భారత్‌ నిర్మాణ్‌ ప్రోగ్రామ్‌లో భాగమైన ఈ పథకానికి మోదీ ప్రభుత్వం నిధులను అంతకంతకూ పెంచుతోంది. దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్‌కవర్డ్‌) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్‌ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం లక్ష్యం.  కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి.  కాగా, నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై).

53.3 శాతం పెంపు

2017–18
కేటాయింపులు
23,000
(రూ. కోట్లలో)


2016–17
కేటాయింపులు
15,000
(రూ. కోట్లలో)

2022 కల్లా దేశంలో అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ బడ్జెట్‌లో చౌక గృహనిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది.

2019 నాటికి ఇళ్లులేనివాళ్లు, పూరిళ్లలో ఉంటున్న వారికి ఒక కోటి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న కుటుంబా లు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్‌ మైనారి టీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.

మైదాన ప్రాంతాల్లో పేదలకు ఒక్కో ఇంటికి రూ.1.2 లక్షలు..., కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.1.3 లక్షల చొప్పున సాయాన్ని ఇస్తున్నారు.

స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్‌ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.

పీఎంఏవై కిందకు రాని గ్రామీణ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, ఆధునీకరణకు తీసుకునే రుణాల్లో రూ.2 లక్షల వరకూ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.


ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)
2017–18 కేటాయింపులు
19,000
(రూ. కోట్లలో)


పెంపు లేదు

2016–17 కేటాయింపులు
19,000
(రూ. కోట్లలో)


గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం ఇది.

2011–14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73 కిలోమీటర్లు కాగా, 2016–17లో ఇది 133 కిలోమీటర్లకు జోరందుకుందని జైట్లీ పేర్కొన్నారు.

2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కి.మీ. మేర రోడ్లను నిర్మించాలన్నదే లక్ష్యం దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

2105–16; 16–17లో 10,894 రోడ్లను, 723 బ్రిడ్జ్‌లను(మొత్తం 44,947 కి.మీ) మంజూరు చేశారు. దీనికి అంచనా వ్యయం రూ.26,421 కోట్లు.

ప్రస్తుతం 56,943 గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఎంపిక చేయగా.. 12,599 ప్రాంతాలకు ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. 44,344 ప్రాంతాలకు నిధులు మంజూరయ్యాయి.. అనుసంధాన పక్రియ కొనసాగుతోంది. మొత్తం లక్ష్యంలో ఇంకా 1,77,523 కి.మీ. రోడ్లను నిర్మించాల్సి ఉంది.

అయితే, తాజా బడ్జెట్‌లో దీనికి నిధుల కేటాయింపులను పెంచలేదు. అయితే, రాష్ట్రాల వాటాతో కలిపితే మొత్తం నిధులు రూ.27,000 కోట్లుగా జైట్లీ పేర్కొన్నారు.

గ్రామీణ టెలిఫోనీ..
భారత్‌ నెట్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ (జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌–ఎన్‌ఓఎఫ్‌ఎన్‌) ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్‌ నిర్మాణ్‌ కామన్‌ సర్వీస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్‌ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం.

టెలికం శాఖకు చెందిన యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ నిధి(యూఎస్‌ఓఎఫ్‌) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు.

ఈ ఏడాది ఒక్క భారత్‌ నెట్‌ కోసమే రూ.10,000 కోట్లను కేటాయించడం గమనార్హం.

2017–18 చివరినాటికి 1.5లక్షల గ్రామ పంచాయతీలకు ఓఎఫ్‌ఎన్‌ కింద హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం అందుబాటులోకి వస్తుందని జైట్లీ పేర్కొన్నారు.

డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా టెలీ మెడిసిన్, విద్య, నైపుణ్యాల కల్పన కోసం ‘డిజిగావ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిజిటల్‌ సేవల కోసం తక్కువ టారిఫ్‌లతో వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నారు.

322 శాతం పెంపు

2017–18
కేటాయింపులు
11,636
(రూ. కోట్లలో)


2016–17
కేటాయింపులు
2,755
(రూ. కోట్లలో)


గ్రామీణాభివృద్ధికి జోష్‌!
న్యూఢిల్లీ
దేశంలోని కోటి కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయడమే లక్ష్యంగా తాజా బడ్జెట్‌లో గ్రామీణ రంగానికి కేంద్రం పెద్ద పీట వేసింది. 2019 నాటికి దేశంలోని 50 వేల గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా మార్చుతామని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన నాణ్యతను పెంచడమనేది రాజీ లేని ఎజెండా అని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ రంగానికి గణనీయ స్థాయిలో నిధులు పెంచడంతోపాటు వ్యవసాయం, ఉపాధి హామీ, గ్రామీణ రహదారులు, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు, కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.

భారీగా నిధుల కేటాయింపు
2017–18 బడ్జెట్‌లో మొత్తంగా గ్రామీణ రంగానికి రూ.1,87,200 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 24 శాతం అధికం కావడం గమనార్హం. దేశ చరిత్రలో గ్రామీణ రంగానికి ఇదే అత్యధిక కేటాయింపు కూడా. ఇందులో ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖకే రూ. 1,07,758 కోట్లు ఇచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రికార్డు స్థాయిలో రూ.48,000 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పనులతో ఉత్పత్తికి తోడ్పడే ఆస్తుల కల్పన జరగాలని.. వ్యవసాయ ఉత్ప త్తులు, రైతుల ఆదాయం పెరగడానికి అది తోడ్పడాలని జైట్లీ పేర్కొన్నారు. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 2.23 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించి.. 65 వేల నివాస ప్రాంతాలను అనుసంధానిస్తామని ప్రకటించారు. గ్రామీణ మహిళల్లో సాధికారతను పెంపొందించడానికి మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పేదల కోసం 2019 నాటికి కోటి ఇళ్లను నిర్మిస్తామని జైట్లీ తెలిపారు. పీఎంఏవై ఇళ్ల పథకానికి కేటాయింపులను రూ.15 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్లకు పెంచడంతోపాటు.. దీని కింద ఇచ్చిన రుణాల తిరిగి చెల్లింపు గడువును 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్, ఫ్లోరైడ్‌ బాధిత 28 వేల నివాస ప్రాంతాలకు వచ్చే నాలుగేళ్లలో సురక్షిత మంచినీటిని అందజేస్తామని వెల్లడించారు. 2022 నాటికి ఐదు లక్షల మందికి తాపీ పనిలో శిక్షణ ఇస్తామని అందులో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 20 వేల మందికి శిక్షణ ఇస్తామని జైట్లీ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement