ఆ విషయంలో మోదీ, ట్రంప్ ఒక్కటే..
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధించారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అహ్మద్ మరణించినందుకు సంతాప సూచకంగా పార్లమెంట్ సమావేశాలను రేపటికి వాయిదా వేయకుండా, బుధవారం సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడాన్ని తప్పుపడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో పోల్చారు. ప్రధాని మోదీని ఇండియన్ ట్రంప్గా అభివర్ణిస్తూ, ఇద్దరూ సమస్యలను సృషిస్తారని విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ట్రంప్ నియంతృత్వ విధానాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడాన్ని లాలు ప్రస్తావించారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఎంత మొత్తంలో నల్లధనాన్ని వెలికితీశారు? దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపింది? వంటి విషయాలను బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని లాలు ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు.
మంగళవారం పార్లమెంట్లో అస్వస్థతకు గురైన ఎంపీ అహ్మద్ బుధవారం మరణించారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలు మరణిస్తే సభను ఒకరోజు వాయిదా వేస్తారని, మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కాలరాసిందని లాలు విమర్శించారు. సభను రేపటికి వాయిదా వేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని, మోదీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని లాలు మండిపడ్డారు.