మేం ముందు వెళ్తాం.. మీరు వెనక రండి
మేం ముందు వెళ్తాం.. మీరు వెనక రండి
Published Wed, Feb 1 2017 11:24 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
కొత్త బడ్జెట్‌లో తాము మూడు సంస్కరణలు తెచ్చామని అరుణ్ జైట్లీ అన్నారు. తాము ముందుకు వెళ్తామని, మీరంతా మా వెనక రావాలని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
''కరెంటు ఖాతా లోటు 0.3 శాతానికి తగ్గింది. ఫిస్కల్ కన్సాలిడేషన్ మీద ప్రభుత్వం దృష్టిపెట్టింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థికవ్యవస్థ అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆరో అతిపెద్ద ఉత్పత్తి దేశంగా భారత్ వచ్చింది. ఇంతకుముందు 9వ స్థానంలో ఉంది. గత సంవత్సరం దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక విధాన నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ అమలుకు రాజ్యాంగ బిల్లు ఆమోదం, పెద్దనోట్ల రద్దు.. ఈ రెండూ ముఖ్యమైనవి. జీఎస్టీని ఆమోదించినందుకు ఇరు సభల సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. పెద్దనోట్ల రద్దు చాలా సాహసోపేతమైన చర్య. చాలా దశాబ్దాలుగా పన్ను ఎగవేత మామూలైపోయింది. దానివల్ల పేదలపై ప్రభావం పడుతోంది. సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు తర్వాత అది చాలావరకు తగ్గింది. అవినీతి, నల్లధనాన్ని, నకిలీనోట్లు, ఉగ్రవాదులకు నిధులు.. వీటన్నింటినీ అది అరికట్టింది. ఆర్థిక వ్యవస్థలో డిజిటైజేషన్ కూడా సాధ్యమైంది. వీటన్నింటి వల్ల జీడీపీ వృద్ధిరేటు పెరగడం కూడా సాధ్యమైంది. 'జామ్' విజన్‌లో ఇది ప్రభుత్వ మూడో అతిపెద్ద ముందడుగు. ''దేనికీ భయపడద్దు.. ముందడుగు వేయండి.. ఎందుకు భయపడతారు, మేం ముందు వెళ్తాం, మా వెనక రండి మీరు'' అని అర్థం వచ్చేలా ఒక హిందీ షాయరీ చెప్పారు. 2017, 18 సంవత్సరాల్లో జీడీపీ వృద్ధిరేటు 7.2, 7.7 శాతం చొప్పున ఉంటుందని అంచనా వేశాం. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులలో నగదు అందుబాటు పెరిగి, వడ్డీ రేట్లు తగ్గడమే కాక, నిధుల అందుబాటు కూడా పెరిగింది. పేదలకు గృహనిర్మాణం, రైతులకు రుణసదుపాయం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం.. ఇవన్నీ కూడా మెరుగవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంచాలన్నది మా లక్ష్యం. ''
2017-18 బడ్జెట్ విషయంలో మూడు సంస్కరణలు
1) ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం. దీనివల్ల మంత్రిత్వశాఖలు కొత్త పథకాలను కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయడానికి వీలయింది.
2) రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలపడం. 1924 నుంచి బ్రిటిష్ వలస విధానంలో ఉన్న దీన్ని మేం ఛేదించాం.
3) వ్యయాల్లో ప్రణాళిక, ప్రణాళికేతర విధానాన్ని వదిలిపెట్టాం. వనరులను రంగాల వారీగా మాత్రమే కేటాయిస్తాం
Advertisement
Advertisement