
తూర్పు vs పశ్చిమం!
రియల్ బూమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హైదరాబాద్‌లో తూర్పు, పశ్చిమలు కొత్త ఆశల్ని నింపుతున్నాయి. మాంద్యంలోనూ స్థిరాస్తి రంగాన్ని ఆదుకున్న ప్రాంతాలేవైనా ఉన్నాయంటే అవి ఇవే. తూర్పున ఉప్పల్, పశ్చిమాన హైటెక్‌సిటీలు రియల్ రంగంలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మెట్రోతో ఉప్పల్ రియల్ పట్టాలెక్కితే.. ఐటీఐఆర్‌తో హైటెక్‌సిటీ కొత్త హంగుల్ని పోతోంది. ఉప్పల్-హైటెక్‌సిటీ భవిష్యత్తు చిత్రంపై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథన ం..
తూర్పు హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ నుంచి హయత్‌నగర్, నాగోల్ నుంచి నాదర్‌గుల్, స్నేహపురి నుంచి హస్తినాపురం, కొత్తపేట నుంచి కర్మన్‌ఘాట్, తుర్కయాంజాల్ నుంచి బాటసింగారం.. ఇవీ తూర్పు హైదరాబాద్ కిందికి వచ్చే ప్రాంతాలు. హైటెక్‌సిటీ తర్వాత ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా మారుతోంది ఉప్పల్ సర్కిలే అని ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజర్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జే వెంకట్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
‘‘ఉప్పల్ బస్ డిపో పక్కనే రెండున్నర ఎకరాల్లో ఏవీ ఇన్ఫో ప్రైడ్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 210 ఫ్లాట్లు. ధర చ.అ.కి రూ.2,600. ఇదే ప్రాంతంలో 2,800 గజాల్లో హరేరాం రెసిడెన్సీని కూడా నిర్మించాం. ఇది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది. మొత్తం 60 ఫ్లాట్లు. ధర చ.అ.కి రూ.2,400. మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలో 850 గజాల్లో రాచూరీ అరణ్య కూడా వస్తోంది. మొత్తం 20 ఫ్లాట్లు. ధర చ.అ.కి రూ.2,400.’’ అని వెంకట్ రెడ్డి వివరించారు.
పశ్చిమ హైదరాబాద్: ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ వంటి అనేక రంగాలకు చిరునామాగా నిలుస్తోంది పశ్చిమ హైదరాబాద్. శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్‌చెరువు సర్కిళ్లు దీని కిందికొస్తాయి. వీటిలో స్థిరాస్తి వ్యాపారానికి పెట్టింది పేరు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాలు. ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌లతో పశ్చిమ హైదరాబాద్‌కు గిరాకీ బాగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఫ్లాట్ల నుంచి విల్లాల వరకు అన్ని రకాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
‘‘కొండాపూర్‌లో మూడున్నర ఎకరాల్లో ఆర్వీ పాంచజన్య ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రా రెడ్డి చెప్పారు. రెండు బ్లాకుల్లో మొత్తం 310 ఫ్లాట్లొస్తాయి. ధర చ.అ.కి రూ.3,800గా నిర్ణయించామన్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పక్కనే ఎకరంన్నర విస్తీర్ణంలో ఆర్వీ శిల్పహిల్‌టాప్‌ను కూడా నిర్మించాం. ఇది గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. మొత్తం 128 ఫ్లాట్లు. 2, 3 పడక గదులతో పాటు డూప్లెక్స్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ధర చ.అ.కి రూ.4,500గా ఉందన్నారు.
ఐటీఐఆర్ ధమాకా
క్లస్టర్-3లో ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంది. దీనికి అనుసంధానంగా ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి.మీ., గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి.మీ. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే ప్రజయ్ టెక్నో పార్క్, జెన్‌ప్యాక్ట్, సురానా ఐటీపార్క్, రహేజా ఐటీ పార్క్, నూజివీడు సీడ్స్, ఎన్‌ఎస్‌ఎల్, ఇన్ఫోసిస్ సెజ్, టాప్‌నాచ్ సెజ్, ఐకానియా, భాగ్యనగర్ మెటల్స్ వంటి ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కొలువుదీరాయి.
క్లస్టర్-1లో భాగంగా సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో 86.7 చ.కి.మీ. మేర ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, వట్టినాగుల పల్లి ప్రాంతాలు ఇందులో ఉంటాయి. రెండు దశాబ్ధాల క్రితమే సైబర్ టవర్స్ కేంద్రంగా ఐటీ సేవలు ప్రారంభమయ్యాయి. హైటెక్‌సిటీలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఓరాకిల్, జీఈ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ వంటి వందలాది ఐటీ కంపెనీలున్నాయి. ప్రస్తుతం సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో 3.18 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఔటర్‌పై దూకుడు
నగరం చుట్టూ 158 కి.మీ. మేర నిర్మిస్తున్న ఔటర్‌రింగ్ రోడ్ 14 జంక్షన్లతో అనుసంధానమై ఉంటుంది. వీటిలో అన్నోజిగూడ, ఘట్‌కేసర్, పెద్ద అంబర్‌పేట, బొంగ్లూరు జంక్షన్లు తూర్పు హైదరాబాద్ పరిధిలోకే వస్తాయి. ఓఆర్‌ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్ మధ్య 195 కి.మీ. మేర 33 రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 59 కి.మీ. తూర్పు హైదరాబాద్ లోనే ఉన్నాయి. హబ్సిగూడ నుంచి బోగారం జంక్షన్-19 కి.మీ., సర్వే ఆఫ్ ఇండియా నుంచి మేడిపల్లి-12 కి.మీ., నాగోల్ బ్రిడ్జి నుంచి సింగారం -14 కి.మీ., నాగోల్ బ్రిడ్జి నుంచి గౌరెల్లి- 14 కి.మీ. ఈ రోడ్లుంటాయి.
నగరం చుట్టూ నిర్మిస్తున్న ఔటర్‌రింగ్ రోడ్ చివరి దశకు చేరింది. 22 కి.మీ. గల గచ్చిబౌలి-శంషాబాద్ రోడ్డు, 23.7 కి.మీ. గల నార్సింగి- పటాన్‌చెరువు రోడ్ పశ్చిమ హైదరాబాద్ నుంచే వెళతాయి. ఇక రేడియల్ రోడ్ల విషయానికొస్తే.. 34.65 కి.మీ. మేర రోడ్లు పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరించి ఉన్నాయి. నానల్‌నగర్ జంక్షన్ నుంచి హెచ్‌సీయూ డిపో వరకు 3.95 కి.మీ., హెచ్‌సీయూ డిపో నుంచి వట్టినాగుల పల్లి వరకు 14.30 కి.మీ., నిజాంపేట ఎక్స్ రోడ్ నుంచి ఖాజీపల్లి వరకు 9 కి.మీ., మూసాపేట నుంచి బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వరకు 7.40 కి.మీ. దూరం రేడియల్ రోడ్లు రానున్నాయి.
మెట్రో మెరుగులు
మెట్రో రైల్ తొలిసారిగా పరుగులు తీసేది తూర్పు హైదరాబాద్ నుంచే. త్వరలోనే నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు 8 కి.మీ. దూరం మెట్రో పరుగులు పెట్టనుంది. కారిడార్-1, కారిడార్-3 మెట్రో ప్రాజె క్ట్‌లోని కొన్ని ప్రాంతాలు తూర్పు హైదరాబాద్ నుంచే వెళతాయి. 28.87 కి.మీ. గల మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 27 మెట్రో స్టేషన్లు వస్తాయి. మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు రానున్నాయి. అలాగే 27.51 కి.మీ. గల నాగోల్-శిల్పారామం మార్గంలో 23 స్టేషన్లు వస్తాయి. నాగోల్, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడల్లో మెట్రో స్టేషన్లు వస్తాయి.
ఐటీ రంగంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న పశ్చిమ హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంతో మరింత జోరుగా సాగుతోంది. కారిడార్-1, కారిడార్-3లోని మెట్రో మార్గాలు ఇటు తూర్పు, పశ్చిమ హైదరాబాద్‌లను కలుపుతూ నిర్మిస్తున్నారు. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వచ్చే 27 మెట్రో స్టేషన్లలో మియాపూర్, జేఎన్‌టీయూ కాలేజీ, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, భరత్ నగర్ ప్రాంతాలు పశ్చిమ హైదరాబాద్ కిందికొస్తాయి. అలాగే నాగోల్-శిల్పారామం మార్గంలోని 23 స్టేషన్లలో రోడ్ నం:5 జూబ్లీహిల్స్, జూబ్లీ చెక్‌పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ, శిల్పారామంలో మెట్రో స్టేషన్లొస్తాయి.