కొత్త శిఖరాలకు సెన్సెక్స్‌ | US and China trade agreement will be soon | Sakshi
Sakshi News home page

కొత్త శిఖరాలకు సెన్సెక్స్‌

Published Tue, Nov 26 2019 2:15 AM | Last Updated on Tue, Nov 26 2019 4:42 AM

US and China trade agreement will be soon - Sakshi

అమెరికా–చైనాల మధ్య ఈ ఏడాది చివరికల్లా  వాణిజ్య ఒప్పందం కుదరగలదన్న వార్తలతో స్టాక్‌ సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. ద్రవ్యలోటును పూడ్చటానికి గాను డిజిన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం తాజా ప్రకటనలు, ఈ వారంలోనే నవంబర్‌ నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం కలసివచ్చాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించింది. నిఫ్టీ 12,050 పాయింట్ల పైకిఎగబాకింది.  

సెన్సెక్స్‌లో కొత్తగా నాలుగు షేర్లు జత కానుండటం, ఆర్‌బీఐ రేట్ల కోత ఆశలు బలం పుంజుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 573 పాయింట్ల లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,932 పాయింట్లను తాకింది. చివరకు 530 పాయింట్ల లాభంతో 40,889 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌ జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 12,074 పాయింట్ల వద్దకు చేరింది. ఆల్‌టైమ్‌ హై (12,103 పాయింట్ల)కు 29 పాయింట్ల దూరంలోనే ఉంది.  

రోజంతా లాభాలు... 
సెన్సెక్స్, నిఫ్టీలు  లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతంతమాత్రంగానే ఉన్నా, ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగినా మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. నిఫ్టీ ఇంట్రాడేలో 170 పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్‌తో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, అదానీ గ్రీన్, ఆవాస్‌ ఫైనాన్షియర్స్, ఫోనిక్స్‌ మిల్స్, ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌  తదితర షేర్లు  ఈ జాబితాలో ఉన్నాయి.  

లోహ షేర్ల జోరు...
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశాలుండటం,  ఉక్కు ధరలను యూఎస్‌ స్టీల్, ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీలు ఈ నెలలో మూడు సార్లు పెంచడంతో లోహ షేర్లు ముఖ్యంగా స్టీల్‌ షేర్లు దూసుకుపోయాయి. టాటా స్టీల్‌ 5%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 7% పెరిగాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3 శాతం ఎగసింది.  

మరిన్ని విశేషాలు...
- సెన్సెక్స్‌ పునర్వ్యస్థీకరణలో భాగంగా యెస్‌ బ్యాంక్‌ షేర్‌ను తొలగించడంతో ఈ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.63.70 వద్ద ముగిసింది.  
స్పెక్ట్రమ్‌ చార్జీల చెల్లింపుల్లో ఊరట లభించడం, టారిఫ్‌ల పెంపునకు సంబంధించి కేంద్రం సానుకూలంగా ఉండటం, ఏజీఆర్‌పై వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌లు పిటిషన్‌ దాఖలు చేయడం తదితర పరిణామాలతో టెలికం షేర్లు జోరుగా పెరిగాయి.  ఎయిర్‌టెల్‌ షేర్‌ 7.2 శాతం లాభంతో రూ.451 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 4.2 శాతం లాభంతో రూ.6.84 కు చేరింది.  
31 సెన్సెక్స్‌ షేర్లలో యస్‌ బ్యాంక్, ఓఎన్‌జీసీ మినహా మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి.

లాభాలు ఎందుకంటే...
త్వరలోనే వాణిజ్య ఒప్పందం ! 
గత వారాంతంలో అమెరికా–చైనాల ఉన్నతాధికారులు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సానుకూల ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరగలవన్న ఆశలు మొలకెత్తాయి. మరోవైపు అమెరికా లేవనెత్తిన మేధోపర హక్కుల ఉల్లంఘనలపై జరిమానాలు విధించడానికి చైనా అంగీకరించిందన్న వార్తలు కూడా సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో  ప్రపంచ మార్కెట్లు జోరుగా పెరిగాయి.  

డిజిన్వెస్ట్‌మెంట్‌ జోరు.... 
ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని తట్టుకోవడానికి, ద్రవ్యలోటును పూడ్చటానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. బీపీసీఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాన్‌కార్‌–ఈ మూడు సంస్థల్లో ప్రభుత్వానికున్న పూర్తి వాటాను విక్రయించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంతే కాకుండా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటాను 51 శాతం కంటే తక్కువకు తగ్గించడానికి కూడా నిర్ణయం తీసుకుంది.  

కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు... 
రేట్ల తగ్గింపునకు అమెరికా ఫెడ్‌ సానుకూలం గా ఉండటంతో భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లలో  పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. కాగా ఈ నెలలో మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.17,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.  

అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు.... 
గతంలో ఏవో కొన్ని రంగాల షేర్లు మాత్రమే పెరిగేవి. కానీ సోమవారం నాడు అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి.  వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఇతర వినియోగ ఆధారిత రంగ షేర్లు జోరుగా పెరిగాయి.  

సాంకేతిక కారణాలు.... 
నిఫ్టీ కీలకమైన 12,000 పాయింట్ల ఎగువకు దూసుకుపోవడంతో కొనుగోళ్లు  పోటెత్తాయని  ఎనలిస్ట్‌లు అంటున్నారు. నిఫ్టీ సూచీ ‘డెయిలీ అప్పర్‌ బొలింగర్‌ బాండ్‌’ను చేరిందని, ఆల్‌ టైమ్‌ హై, 12,103 పాయింట్లకు సమీపంలోకి వచ్చిందని షేర్‌ఖాన్‌ బై బీఎన్‌పీ పారిబా టెక్నికల్‌ ఎనలిస్ట్‌ గౌరవ్‌ రత్నపర్కి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement