యూఎస్‌ మార్కెట్లకు బ్యాంకింగ్‌ దన్ను | US Market gains on Banking sector push | Sakshi
Sakshi News home page

యూఎస్‌ మార్కెట్లకు బ్యాంకింగ్‌ దన్ను

Published Thu, Jul 16 2020 10:38 AM | Last Updated on Thu, Jul 16 2020 10:41 AM

US Market gains on Banking sector push - Sakshi

బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ సాధించిన పటిష్ట ఫలితాలకుతోడు.. మోడర్నా ఇంక్‌ వ్యాక్సిన్‌ యాంటీబాడీలను అభివృద్ధి చేయడంలో సఫలమవుతున్నట్లు వెలువడిన వార్తలు వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో బుధవారం డోజోన్స్‌ 228 పాయింట్లు(0.,9 శాతం) పుంజుకుని 26,870 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 29 పాయింట్లు(0.9 శాతం) బలపడి 3,227 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ 62 పాయింట్లు(0.6 శాతం) లాభపడి 10,550 వద్ద స్థిరపడింది.వెరసి మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. అంతకుముందు 750 బిలియన్‌ యూరోల కోవిడ్‌ రికవరీ ఫండ్‌పై ఆశలతో యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 2 శాతం స్థాయిలో ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌, జపాన్‌, సింగపూర్‌, కొరియా, తైవాన్‌ 1.4-0.5 శాతం మధ్య క్షీణించగా.. థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 0.3 స్థాయిలో బలపడ్డాయి. 

బ్యాంకింగ్‌ జోరు
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు వెల్లడించడంతో మోడర్నా ఇంక్‌ షేరు తాజాగా 7 శాతం జంప్‌చేసింది. మంగళవారం సైతం ఈ షేరు 18 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే.క్యూ2లో మొత్తం ఆదాయం రెట్టింపునకు పెరగడంతో బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ 1.5 శాతం బలపడింది. ఈ ప్రభావంతో నేడు ఫలితాలు ప్రకటించనున్న మోర్గాన్‌ స్టాన్లీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా 2 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా.. ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌ వెనకడుగు వేయడంతో నాస్‌డాక్‌ లాభాలు పరిమితమైనట్లు నిపుణులు పేర్కొన్నారు.

ట్రావెల్‌ జోరు
వ్యాక్సిన్‌ ఆశలకుతోడు లాక్‌డవుల ఎత్తివేత నేపథ్యంలో ఈ నెల నుంచి బిజినెస్‌ యాక్టివిటీ పుంజుకుంటున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ బీజ్‌బుక్‌ సర్వే అభిప్రాయపడటంతో టూరిజం, ట్రావెల్‌ సంబంధ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. కార్నివాల్‌ కార్ప్‌, రాయల్‌ కరిబియన్‌ క్రూయిజెస్‌, మారియట్‌ ఇంటర్నేషనల్‌, విన్‌ రిసార్ట్స్‌ 7-21 శాతం మధ్య దూసుకెళ్లాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement