
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో మార్కెట్‌లోకి వచ్చాక డేటా రేట్లు విపరీతంగా పడిపోయిన సంగతి తెలిసిందే. జియో రాకకు ముందు అంటే 2016 ఆగస్టు నెల వరకు రూ.249 నుంచి రూ.259 వరకు ఉన్న ఒక్కో జీబీ డేటా రేటు, 99 శాతం మేర కిందకి పడిపోయింది. ప్రస్తుతం జియో ప్రకటించిన రిపబ్లిక్ డే ఆఫర్లతో ఈ డేటా రేట్లు మరింత పతనం కానున్నాయి. ఒక్కో జీబీ డేటా రేటు అత్యంత తక్కువకు రూ.2.7కే పడిపోనున్నట్టు బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ రిపోర్టు చేసింది.
బోఫా-ఎంఎల్ విశ్లేషకుల అంచనాల ప్రకారం జియో రూ.448, రూ.498 ప్లాన్ల కింద ఒక్కో జీబీ డేటా ధర రూ.2.7గా ఉండనున్నట్టు తెలిసింది. జియో రిపబ్లిక్ డే ఆఫర్ కింద ఎంపిక చేసిన ప్లాన్లపై అదనంగా 500 ఎంబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో రూ.448, రూ.498 ప్లాన్లపై రోజుకు 2జీబీ 4జీ డేటా యూజర్లకు లభించనుంది. అయితే లిమిట్ దాటాక డేటా స్పీడ్ తగ్గిపోనుంది. ఈ ప్లాన్ల వాలిడిటీ 84, 91 రోజులు.
అంతకముందు జియో ప్రకటించిన హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద, ఒక్కో జీబీ డేటా ధర 4 రూపాయలకు తగ్గింది. ఈ కొత్త టారిఫ్‌లు 25-33 శాతం టారిఫ్ కోత. అదనపు డేటా ప్రయోజనాలతో పాటు, కొత్త ప్లాన్ రూ.98ను కూడా జియో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద నెలకు 2జీబీ డేటా లభించనుంది. జియో ప్రధాన ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ తన కొత్త స్కీమ్‌ల కింద ఒక్కో జీబీ డేటాను 4 రూపాయలకు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment