
సాక్షి,న్యూఢిల్లీ: మరో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వడోదరకు చెందిన విద్యుత్ కేబుల్స్, సామగ్రిని తయారు చేసే కంపెనీ వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది. 11 బ్యాంకుల కన్సార్టియాన్ని భారీ ఎత్తున మోసం చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేశామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లోన్ డిఫాల్టర్ల లిస్ట్‌లోనూ, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ హామీ కార్పొరేషన్ హెచ్చరిక జాబితాలో ఉన్నప్పటికీ కంపెనీ, దాని డైరెక్టర్లు తప్పుడు పద్ధతుల్లో రుణాలు పొందారని ఆరోపించింది.
వివిధ బ్యాంకుల నుంచి అక్రమ మార్గాల్లో డైమెండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డిపిఐఎల్) రూ. 2,654 కోట్ల రుణాలను తీసుకుందని సీబీఐ తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి కంపెనీపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పింది. కంపెనీ ప్రమోటర్ ఎస్‌ఎన్ భట్నాగర్, అతని కుమారులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అమిత్ భట్నాగర్, సుమిత్ భట్నాగర్‌లపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ.670.51కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా- రూ.349 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు- 279.46 కోట్ల రూపాయలు రుణాలు పొందినట్టుగా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. అలాగే గుజరాత్ వడోదరాలోని కంపెనీ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల నిసాసాల్లో సీబీఐ సోదాలు ప్రారంభించింది.
కాగా సీబీఐ అందించిన సమాచారం ప్రకారం 2008 జూన్‌లో యాక్సిస్ బ్యాంకు నేతృత్వంలోని 11బ్యాంకుల కన్సార్టియం (పబ్లిక్, ప్రైవేట్) ద్వారా మోసపూరితంగా డిపిఐఎల్ రుణాలను పొందింది. నగదు క్రెడిట్ పరిమితులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్యాంకుగా ఉంది. ఈ మొత్తం 2016 జూన్ 29 నాటికి రూ .2,654.40 కోట్ల రూపాయలకు చేరింది. అయితే 2016-17లో ఎన్‌పీఏగా ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment