ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి? | Value Research CEO dhirendra kumar interview | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?

Published Mon, Jan 2 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?

ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?

నేను 2015, మార్చిలో ఎస్‌బీఐ ఈవెల్త్‌  యులిప్‌ను కొనుగోలు చేశాను. దీనికి నెలకు ప్రీమియం రూ.2,500 చొప్పున చెల్లిస్తూ వచ్చాను. ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేయమంటారా ? లేక ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా?
–విజయ్, వరంగల్‌
ఎస్‌బీఐ ఈవెల్త్‌ అనేది యునిట్‌  లింక్డ్‌ ఇన్సూరెన్స్‌  ప్లాన్‌(యులిప్‌) ఇలాంటి ఇన్సూరెన్స్‌–కమ్‌–ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ సరైన రాబడులు రావనే ఉద్దేశంతో వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయవద్దని సూచిస్తూ ఉంటాం. ఇవి ఖరీదైనవి.  ఇవి మంచి రాబడులను కూడా ఇవ్వలేవు. ఈ స్కీమ్‌ను ఐదేళ్లు గడవక ముందే, అంటే 2020 కంటే ముందే సరెండర్‌  చేస్తే, వచ్చే మొత్తాన్ని డిస్‌కంటిన్యూడ్‌  ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఐదేళ్ల లాక్‌ ఇన్‌  పీరియడ్‌ పూర్తయిన తర్వాత వర్తించే చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని మీకు చెల్లిస్తారు. మీరు సరెండర్‌  చేసేటప్పుడు ఎన్‌ఏవీ ఎంత ఉంటుందో అంతే మీకు సరెండర్‌  వేల్యూగా వస్తుంది. ఈ పాలసీని సరెండర్‌  చేయడం వల్ల మీకు నష్టాలు వచ్చినప్పటికీ, ఈ పాలసీని సరెండర్‌ చేస్తేనే మంచిదని మేము భావిస్తున్నాం. ఇక ఈ యులిప్‌లో నెలకు రూ.2,500 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి ఈ మొత్తాన్ని ఇప్పుడు మంచి రాబడులు వచ్చే విధంగా ఇన్వెస్ట్‌ చేయండి. మీ బీమా అవసరాలకు అనుగుణంగా ఉండే తగిన టర్మ్‌  బీమా పాలసీని ఎంచుకోండి. వీటితో పాటు రెండు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఫలితంగా మీకు బీమా అవసరాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాలూ తీరతాయి.

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే లాభాలు, డివిడెండ్లపై పన్నులు ఎలా ఉంటాయి? వివరించగలరు.
–నరేశ్, తిరుపతి
మ్యూచువల్‌  ఫండ్‌ స్కీమ్‌ల్లో డివిడెండ్, గ్రోత్‌ అనే రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. మీరు డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకున్నారనుకుందాం. ఈక్విటీ, డెట్‌  మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు లభించే డివిడెండ్స్‌పై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. డెట్‌  ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌ హౌస్‌ 28.33 శాతం డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)ని చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా ఇన్వెస్టర్లకు చెల్లిస్తాయి. ఇక మూలధన లాభాల పన్ను పరంగా చూస్తే, మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఈక్విటీ, ఈక్విటీయేతర ఫండ్స్‌గా విభజిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌ను కొనుగోలు చేసిన ఏడాదిలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను, ఏడాది తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్‌పై సల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా ఉండగా, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఏమీ ఉండదు. ఇక ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్స్‌  విషయానికొస్తే, కొనుగోలు చేసిన మూడేళ్లలోపు మ్యూచువల్‌  ఫండ్స్‌ యూనిట్లను విక్రయిస్తే, వాటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుగానూ, మూడేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును విధిస్తారు. ఈక్విటీయేతర మ్యూచువల్‌  ఫండ్స్‌కు స్వల్ప కాల మూలధన లాభాల పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి, ఇక దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం ఇండేక్సేషన్‌తో కలిపి విధిస్తారు. లార్జ్‌ క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్, మల్టీ క్యాప్, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌(ఈక్విటీ ఆధారిత), సెక్టర్‌ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు.  లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్, మనీ మార్కెట్‌ ఫండ్స్, గోల్డ్‌ ఫండ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌  ఫండ్స్, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ (డెట్‌ ఓరియంటెడ్‌), ఈక్విటీ–ఇంటర్నేషనల్‌ తదితర ఫండ్స్‌ను ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్స్‌గా పరిగణిస్తారు.

నేను ఒక బీమా సంస్థ నుంచి రూ.3 లక్షలకు ఫ్యామిలీ ప్లోటర్‌ మెడిక్లెయిమ్‌ పాలసీ తీసుకున్నాను. రూ. 7 లక్షలకు టాప్‌ అప్‌ కవర్‌ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఫ్యామిలీ ప్లోటర్‌ మెడిక్లెయిమ్‌ పాలసీ తీసుకున్న సంస్థ నుంచి కాకుండా వేరే సంస్థ నుంచి టాప్‌–అప్‌ కవర్‌ పాలసీ తీసుకోవచ్చా?
– గణేశ్, వైజాగ్‌
మెడిక్లెయిమ్‌ పాలసీ ఒక సంస్థ నుంచి, టాపప్‌  కవర్‌  పాలసీ మరో కంపెనీ నుంచి తీసుకోవచ్చు. మీరు మెడిక్లెయిమ్‌ పాలసీ తీసుకోకపోయినా, టాపప్‌ కవర్‌ పాలసీ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.

నేను ఆర్బిట్రేజ్‌ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్‌చేశాను. ఈ ఫండ్‌ ద్వారా నాకు నెలనెలా కొంత మొత్తంలో డివిడెండ్‌లు వస్తున్నాయి. ఈ డివిడెండ్‌ ఆదాయంపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
– వినీత్, హైదరాబాద్‌
పన్ను అంశాల పరంగా చూస్తే, ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ను ఈక్విటీ ఓరియంటెడ్‌ ఫండ్స్‌గా పరిగణిస్తారు. అందుకని ఈ ఫండ్స్‌ ద్వారా లభించే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌10(35) ప్రకారం, ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణించే ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ (పన్ను అంశాల పరంగా) నుంచి మీకు లభించే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement