Fund Review: స్థిరత్వం, రాబడుల కలయిక | SBI Large Mid Cap Fund Review | Sakshi
Sakshi News home page

Fund Review: స్థిరత్వం, రాబడుల కలయిక

Published Mon, May 23 2022 2:45 PM | Last Updated on Mon, May 23 2022 2:52 PM

SBI Large Mid Cap Fund Review - Sakshi

దేశ స్టాక్‌ మార్కెట్లు గడిచిన నెల రోజుల్లో భారీ పతనాన్ని చూశాయి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసే వారికి మంచి పెట్టుబడుల అవకాశాలు లభించినట్టే. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్‌ ఆరోగ్యకర స్థాయిలో దిద్దుబాటుకు లోనయ్యాయి. ఈ తరుణంలో స్థిరత్వాన్నిచ్చే లార్జ్‌క్యాప్, మంచి రాబడులను ఇచ్చే మిడ్‌క్యాప్‌లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఈ రెండింటినీ నెరవేర్చే విభాగమే లార్జ్‌అండ్‌ మిడ్‌క్యాప్‌. ఈ విభాగంలో దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ఎస్‌బీఐ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఒకటి. సగటకు మించి రాబడులను ఈ పథకం ఇస్తోంది. అస్థిరతల మార్కెట్లలో రిస్క్‌ తక్కువగా ఉండాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ పథకం అనుకూలం. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు.  

రాబడులు 
ఈ పథకం గతంలో ఎస్‌బీఐ మాగ్నం మల్టీప్లయర్‌ ఫండ్‌గా ఉండేది. సెబీ తీసుకొచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం లార్జ్‌అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకంగా మారింది. 1993 నుంచి ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13 శాతం రాబడిని ఇచ్చింది. మూడేళ్లలో చూస్తే వార్షిక రాబడి 17 శాతంగా ఉంది. ఐదేళ్లలో 12 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 16 శాతానికి పైనే వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. ఐతే ఇందులో మూడేళ్లకు పైన రాబడులున్నవి గతంలో లార్జ్‌క్యాప్‌ ఆధారంగా వచ్చినవి. ఇప్పుడు లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ప్రాధాన్యంగా పెట్టుబడులు చేస్తుంది కనుక మరుగైన ప్రతిఫలాన్ని ఈ పథకం నుంచి ఆశించొచ్చు. 

పెట్టుబడుల విధానం 
ఈ పథకం భిన్న రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. వృద్ధి, వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ రెండూ ఈ పథకంలో భాగంగా ఉండడం మరో ఆకర్షణీయ అంశం. భారీ వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అదే సమయంలో ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్‌ అవుతున్న, వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్న స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు చేస్తుంది. టాప్‌ డౌన్, బోటమ్‌అప్‌ రెండు విధానాలకు చోటు ఇస్తుంది. ప్రస్తుతం ఈ పథఫకం పోర్ట్‌ఫోలియో పీఈ 44గా ఉండడం అన్నది గ్రోత్‌ ఆధారిత పోర్ట్‌ఫోలియోను సూచిస్తోంది. గత మూడేళ్లలో మార్కెట్ల నష్టాల సమయాల్లో ఎన్‌ఏవీ క్షీణతను పరిమితం చేసింది. డౌన్‌సైడ్‌ క్యాప్చర్‌ రేషియో 93శాతంగా ఉంది.  

పోర్ట్‌ఫోలియో 
సాధారణంగా 55–60 స్టాక్స్‌ వరకు పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. తగినంత వైవిధ్యం ఉండేలా చూస్తుంటుంది. లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకం కనుక ఒక్కో విభాగంలో కనీసం 35 శాతం మేర పెట్టుబడులను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,599 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 94.2 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులు 51 శాతంగా ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీలకు 35 శాతాన్ని కేటాయించగా.. స్మాల్‌క్యాప్‌లోనూ 14 శాతం ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మల్టీక్యాప్‌ పథకం తీరును ప్రతిఫలిస్తోంది. అంటే స్థిరత్వంతోపాటు రాబడులకు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్థమవుతోంది. పెట్టుబడు ల పరంగా రంగాల వారీ ప్రాధాన్యాన్ని గమనించినట్టయితే.. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు 19 శాతం, ఆటోమొబైల్‌ 10%, హెల్త్‌కేర్‌ రంగాలకు 9 శాతం చొప్పున కేటాయించింది.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement