
పాతికేళ్ల కిందట 29 మందితో ఓ చిన్న వ్యాపార సంస్థగా ఆరంభమైన వరుణ్ గ్రూప్... ఇపుడు 13,600 మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరింది. ద్విచక్ర వాహనాల డీలరుగా మొదలైన ప్రస్థానం... ఆటోమొబైల్ రిటైల్ రంగంలో తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద సంస్థగా నిలిపింది. సంస్థ హోల్డింగ్ కంపెనీగా త్వరలో ‘ప్రభు సన్స్’ పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో... తమ విజయం వెనక ఉన్న కారణాలను వరుణ్ గ్రూప్ చైర్మన్ వల్లూరుపల్లి ప్రభుకిషోర్ ‘సాక్షి’కి వివరించారు. సంస్థకు 25 ఏళ్లు నిండిన సందర్భంగా తన విజయ ప్రస్థానాన్ని, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. – సాక్షి, విశాఖపట్నం
వ్యాపారం మొదలై... ఎదిగిందిలా!
మా తండ్రి కేశవరావు చౌదరి 1950లో విజయవాడలో పద్మజా కమర్షియల్ కార్పొరేషన్‌ను ఆరంభించారు. ఆయన శిక్షణలో నేను సొంతగా 1982లో విజయవాడలో కాంటినెంటల్ బిల్డర్స్ పేరిట అపార్ట్‌మెంట్ల నిర్మాణం మొదలెట్టా. 1986లో వరుణ్ ఫైనాన్స్‌కు శ్రీకారం చుట్టాను. 1992లో విశాఖలో వరుణ్ బజాజ్ పేరిట తీసుకున్న డీలర్‌షిప్‌తో వరుణ్ గ్రూప్‌కు పునాదిరాయి పడింది. ఆ రోజుల్లో బజాజ్ చేతక్ స్కూటర్‌కు ఎనలేని డిమాండ్ ఉండేది.
డీలర్లు అద్దాల్లోంచి చూపించే వారు తప్ప లోపలకు పంపేవారు కాదు. అలాంటప్పుడే మేం ఖాతాదార్లను లోపలకు పంపి టెస్ట్ డ్రైవ్‌కు కూడా అవకాశమిచ్చాం. తర్వాత వారికి నచ్చిన స్కూటర్ ఇచ్చేవాళ్లం. అలా అందరి ఆదరణ పొందాం. 1996లో మారుతి కార్ల డీలర్‌షిప్ వచ్చింది. కర్ణాటకలోనూ అడుగుపెట్టాం. దశల వారీగా జేసీబీ, భారత్ బెంజ్ డీలర్‌షిప్‌లొచ్చాయి. జేసీబీకి ఏపీలో నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లో షోరూమ్‌లున్నాయి.
జేసీబీకి రాష్ట్రంలో ఏకైక డీలర్ మేమే. ఏటా అన్నీ కలిపి 1.3 లక్షల వాహనాలు విక్రయిస్తున్నాం. టర్నోవర్ రూ.5వేల కోట్లపైనే. 13 లక్షల మందికి సర్వీసిస్తున్నాం. షోరూంలు, వర్క్‌షాపులు పెంచుతున్నాం. దీనికి కారణం మా ఉద్యోగుల క్రమశిక్షణ, మర్యాదలే. కస్టమర్లు, ఉద్యోగులు, మా ప్రిన్సిపల్స్ (ఉత్పత్తిదార్లు), బ్యాంకర్లు, ప్రభుత్వం.. ఈ ఐదింటిని ఐదు చేతివేళ్లుగా చూసుకుంటాం. ఈ ఐదు వేళ్లు హ్యాపీగా ఉంటేనే మనమూ హ్యాపీగా ఉంటామని మా ఉద్యోగులకు చెబుతుంటాం.
క్రమశిక్షణకు ప్రాధాన్యం..
మా సంస్థ ఎదుగుదలలో క్రమశిక్షణదే ప్రధాన స్థానం. సెక్యూరిటీ గార్డు నుంచి నా వరకూ అంతా ఒకేరకమైన యూనిఫాం ధరిస్తాం. అర్థరాత్రి ఆపద వచ్చినా ప్రభుకిషోర్ ఉన్నారన్న ఓ భరోసా మా ఉద్యోగుల్లో ఉంటుంది. ఇది నా అదృష్టంగా భావిస్తాను. నన్ను నమ్ముకున్న వారిని ఆదుకోవాలన్న తపనతో వారి ఆరోగ్యం, హౌసింగ్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నాం.
సంస్థలో కింది నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి, పాతికేళ్లకు పైగా సంస్థను భుజాన మోసిన, నిజాయతీపరులైన కొందరు ఉద్యోగుల సంక్షేమం కోసం గిఫ్ట్ బాండ్లను ప్రవేశపెట్టాం. వారు పదవీ విరమణ చేశాక (60 ఏళ్లు నిండాక) వివిధ విభాగాల్లోని బోర్డు సభ్యులకు రూ.25 లక్షల నుంచి నుంచి కోటి వరకు చెల్లిస్తున్నాం. వీరికి ఏటా రూ.75 వేల నుంచి 3 లక్షల వరకు డివిడెండ్లను కూడా ఇస్తున్నాం. ఎంప్లాయీస్ స్కీం సభ్యులకు (పది మందికి పైగా) రూ.10 నుంచి 20 లక్షల వరకు అందజేస్తున్నాం.
40 ఏళ్లుగా మచ్చ లేకుండా..
నేను వ్యాపారం మొదలెట్టి నలభయ్యేళ్లయింది. గ్రూప్‌పై కేసులు లేవు. బ్యాంకులకు బకాయిల్లేకుండా, ఒక్క మచ్చ కూడా పడకుండా నడుస్తోంది. కస్టమర్లను మోసం చేసినట్టో, జీతాలివ్వలేదనో ఒక్క ఆరోపణకు ఆస్కారం లేకుండా చట్టాలకు లోబడి నడుపుతున్నందుకు గర్వంగా ఉంది.
నా శ్రమ నా సంతానం కోసం కాదు.. వరుణ్ గ్రూప్ కోసమే. ఈ సంస్థ అంతం లేకుండా నడవటానికి టాటా సన్స్‌లా ప్రభు సన్స్ పేరిట ట్రస్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో 13 మంది శాశ్వత సభ్యులుంటారు. నలుగురు మా కుటుంబీకులు. ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకుంటాం. తరతరాల పాటు వరుణ్ గ్రూప్ కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ట్రస్ట్‌లోకి వరుణ్ గ్రూపు సంస్థలన్నీ వస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ట్రస్టును ఏర్పాటు చేస్తాం.
అమ్మా, నాన్నల పేరిట వైద్య సేవలు..
మా అమ్మ నవరత్నం 53 ఏళ్లకే హృద్రోగంతో మరణించారు. ఆమె అనారోగ్యాన్ని కళ్లారా చూశాక పేదలకు ఏదైనా వైద్యసాయం అందజేయాలనుండేది. దీంతో నవరత్నం–కేశవరావు చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించాను. తొలుత విశాఖలోనూ ఆ తర్వాత గాజువాక, భీమిలి, నర్సీపట్నం, నిడుమోలు, శ్రీకాకుళంలలోనూ వరుణ్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశాం.
తెల్లకార్డుదారులకు నామమాత్రపు రుసుముతో అన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తున్నాం. 40 మంది వైద్యులతో ఓపీ వైద్యం అందిస్తున్నాం. జనరిక్ మందులను అందుబాటులోఉంచాం. ఏటా ఈ ట్రస్టు ద్వారా ఆరు లక్షల మంది పేద రోగులకు సేవలందిస్తున్నాం. ఇందుకు రూ.15 కోట్లు వెచ్చిస్తున్నాం. త్వరలో విజయవాడలో రెండు, విజయనగరంలో ఒక సెంటరును ప్రారంభించాలనుకుంటున్నాం.