విజయ్ మాల్యా అరెస్టు
స్వదేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్ వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు ఆయనను అక్కడ అరెస్టు చేశారు. గత కొంత కాలంగా లండన్‌లోనే ఉంటున్న మాల్యాపై స్వదేశంలో పలు కేసులు ఉన్నాయి. ప్రధానంగా 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా నిందితుడు. త్వరలోనే ఆయనను యూకే కోర్టులో ప్రవేశపెడతారు.
ఆ తర్వాత నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద లండన్ నుంచి మాల్యాను భారతదేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్టేట్‌బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియంకు మొత్తం రూ. 9వేల కోట్లకు పైగా రుణాలు చెల్లించకుండా ఎగవేసిన లిక్కర్ కింగ్ మాల్యా.. గత సంవత్సరం మార్చి 2వ తేదీన రాత్రికి రాత్రి లండన్ పారిపోయారు. మొత్తం 17 బ్యాంకులకు ఆయన రుణాలు ఎగవేసినట్లు చెబుతున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, యూబీ గ్రూప్ చైర్మన్ అయిన విజయ్ మాల్యా గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. భారత హై కమిషన్ ఒక పిటిషన్ దాఖలు చేయడంతో లండన్ కోర్టు విచారణ జరిపి, వారంటు ఇచ్చిన తర్వాత స్కాట్‌లాండ్ యార్డు పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.