విజయ్ మాల్యా ఇప్పటికే జంప్?
విజయ్ మాల్యా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా చూడాలంటూ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో 13 బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంలో దానిపై విచారణ కూడా బుధవారం కొనసాగాల్సి ఉంది. కానీ.. జాతీయ మీడియా కథనం నిజమైతే, మాల్యా ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయారు!! తనకు సురక్షితంగా ఉండే వేరే దేశంలో తలదాచుకున్నారు. మాల్యా దాదాపు 9వేల కోట్ల వరకు బాకీ ఉన్నారని, అందువల్ల ఆయన వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని బ్యాంకులు కోరాయి. తాను లండన్‌లో సెటిల్ అవుతానని ఇటీవలే మాల్యా చెప్పారు.
అయితే, ఆయన తరఫు అధికార ప్రతినిధి మాత్రం.. మాల్యా ఎక్కడున్నారో తెలియదని, కేవలం ఈ మెయిల్స్ ద్వారానే తమకు అందుబాటులో ఉన్నారని చెబుతున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి వైదొలగినందుకు మాల్యాకు మరో లిక్కర్ కంపెనీ డియాజియో ఇచ్చిన రూ. 515 కోట్లను ఖర్చుపెట్టేందుకు వీల్లేదని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఆదేశించింది గానీ, ఆయన పాస్‌పోర్టును సీజ్ చేసేందుకు మాత్రం అనుమతించలేదు. ఆ సొమ్ముతోనే ఆయన లండన్‌లో స్థిరపడాలనుకుంటున్నారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ద్వారా బ్యాంకులు సుప్రీంకోర్టుకు తెలిపాయి. బ్యాంకులు కర్ణాటక హైకోర్టుకు కూడా వెళ్లినా, అక్కడి నుంచి కూడా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు రాలేదు.