కింగ్ ఫిషర్ వేలం మళ్లీ విఫలం
రూ.135 కోట్ల రిజర్వ్ ధరకు బిడ్డింగ్ కరువు
ముంబై: బ్రిటన్‌కు పారిపోయిన ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు విజయ్‌మాల్యా నియంత్రణలోని కింగ్‌ఫిషర్ హౌస్ వేలం మళ్లీ విఫలమైంది. ఈ హౌస్ వేలానికి సంబంధించి రూ.135 కోట్ల బిడ్ నిర్ణయించినా, ఈ ధరకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంతక్రితం మార్చిలో రూ.150 కోట్ల రిజర్వ్ ధర పెట్టినా, బిడ్డింగ్‌కు ఎవ్వరూ ముందుకురాకపోవడంతో ఈ ధరలు తగ్గించింది. అయితే ఈ ధరకూ బిడ్డింగ్ లభించలేదని మాల్యాకు దాదాపు రూ.9,000 కోట్ల రుణాలు అందించిన 17 బ్యాంకుల కన్సార్షియం వర్గాలు తెలిపాయి.
రిజర్వ్ ధరను మరింత తగ్గించే అవకాశం ఉందనీ తెలిపాయి. ముంబై విమానాశ్రయంలో నిలిపి ఉంచిన మాల్యా విమానం, కింగ్‌ఫిషర్ లోగోల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో మాల్యా విమానానికి రిజర్వ్ ధర రూ.152 కోట్లు కాగా, బిడ్ రిజర్వ్ ధరలో ఒకశాతంకన్నా తక్కువగా రూ.1.09 కోట్లుకు దాఖలైంది. దీనితో సంబంధిత వేలాన్ని సేవల పన్ను విభాగం రద్దు చేసింది.